
నేటి నుంచి (బుధవారం) బోనాల ఉత్సవాలు ప్రారంభం
ఆనవాయితీ ప్రకారం తొలిబోణం సమర్పించనున్న శాలివాహన పూజారులు
నేటిధాత్రి, వరంగల్ తూర్పు
శ్రావణమాసంలో పోచమ్మ తల్లికి సమర్పించే బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని శంభునిపేట లోని కాకతీయుల కాలంనాటి ప్రాచీన పోచమ్మ దేవాలయాన్ని ముస్తాబు చేసారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో గ్రామంలో ఇంటింటికి తిరిగి (జోగురూపం)లో సేకరించిన పసుపు, బియ్యం, కుంకుమ పూజా ద్రవ్యాలతో, శాలివాహనులు తమ పూజ ద్రవ్యాలను జత చేసి ఆనవాయితీ ప్రకారం పోచమ్మ తల్లికి మట్టి పాత్రలోనే తొలిబోనాన్ని శాలివాహనులు (కుమ్మరులు) సమర్పిస్తారని, శాలివాహనుల ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు ముక్కుపుడకను అలంకరించి, గండ దీపం వెలిగించి తొలి మొక్కులు సమర్పిస్తారని శంభునిపేట పోచమ్మ దేవాలయం అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు, శాలివాహన పూజారి కందికొండ మోహన్ తెలిపారు. మట్టి పాత్రలోనే బోనాన్ని సమర్పించడంతో పరాశక్తి, పర్యావరణం పరవశిస్తాయని తెలిపారు. ఆ తదుపరి గ్రామస్తులందరూ అమ్మవారికి బోనాలు, మొక్కులు చెల్లిస్తారని తెలిపారు. ఈ సంవత్సరం కూడా బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయంలో అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. శంభునిపేట పోచమ్మ తల్లి ఎంతో ప్రాశస్త్యం కలదని కోరన కోరికలు కల్పవల్లిగా అమ్మవారిని భక్తులు ఆరాధిస్తున్నారని, కోరికలు నెరవేరస్తుండడంతో ప్రతి సంవత్సరం ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆయన తెలిపారు. శ్రావణమాసంలో వేలాది ముంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి, భక్తిశ్రద్ధలతో ముక్కులు సమర్పించి అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. బుధవారం నుంచి శంభునిపేట లో శాలివాహనులు సమర్పించే తొలి బోనంతో గ్రామాల్లో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు.