
#AvadhootaGiriMaharaj #ManavaSeva #MadhavaSeva #DattagiriAshram #Jahirabad
మానవసేవే మాధవసేవ
◆: – అవధూత గిరి మహారాజ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్/ఝరాసంగం :ప్రతి మనిషి మాధవ సేవ చేస్తూనే మానవ సేవకు ప్రాధాన్యత ఇవ్వాలని బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతి అవధూత గిరి మహారాజ్ పేర్కొన్నారు. దత్తగిరి చారిటబుల్ ట్రస్టు తరఫున ఓవైపు మాధవ సేవ చేస్తూనే మానవ సేవకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. పేద పిల్లలకు ఉచిత వేద విద్య, ప్రభుత్వ వైద్యశాలకు భూమి, కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు, ప్రతిరోజు నిత్య అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం అవధూత గిరి మహారాజ్ జన్మదిన సందర్భంగా ఉత్తర పీఠాధిపతి మహంత్ డాక్టర్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
స్వాగత పూజ, గణపతి పూజ, శుభారంభ పూజ, వైదిక పాఠశాల విద్యార్థుల వేదమంత్రాల మధ్య గురుపాద పూజ, సుగంధ ద్రవ్యాలతో విశేష అర్చనలు, మంగళ హారతి నిర్వహించారు. భక్తులు స్వామిజీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాతృశ్రీ అనసూయ మాత, నందినీ శ్రీగిరి మాత, అర్చకులు శ్రీపాద స్వామి, శివశక్తి, నాగేంద్ర స్వామి, ఉత్సవ కమిటీ సభ్యులు రమేష్ పాటిల్, శ్రీనివాస్, రాజు పాటిల్ (జహీరాబాద్), బోయిని ఎల్లన్న, సుధాకర్, వివిధ ప్రాంతాల మహిళా భక్తులు పాల్గొన్నారు.