పార్టీల కొంప ముంచుతున్న ఫిరాయింపులు
ప్రజాస్వామ్యానికి జాడ్యంగా మారిన ఫిరాయింపులు
ప్రజల పేరు చెప్పి అడ్డగోలు రాజకీయం
ఉన్న ప్రశాంతతను ధ్వంసం చేయడంలో సిద్ధహస్తులు
నడిచేవారికి కాళ్లడ్డం పెట్టే రాజకీయం
రాష్ట్ర ప్రగతికి వీరే ప్రధాన అడ్డంకి
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దగ్గరినుంచి ఇప్పటివరకు పార్టీ ఫిరాయింపులు యదేచ్ఛగా కొనసా గుతుండటం గమనార్హం. చేరికలు కొనసాగిన పార్టీ మరింత బలంగా, వలసలకు గురైన పార్టీ బలహీనపడటం సహజంగా జరిగే ప్రక్రియ. అయితే ఈ ఆయారాం గయారాంల సమస్య మన రాష్ట్రానికే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, జాతీయ రాజకీయాల్లో జరుగుతున్న తంతే! అ యితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన బి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి మారడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నిజానికి కె.సి.ఆర్.అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వలసనలనుబాగా ప్రోత్సహించి తెలుగుదేశం ఆనవాళ్లు రాష్ట్రంలో లేకుండా చేయగలిగారు. అదేవిధంగా కాంగ్రెస్‌నుంచి కూడా తమపార్టీలోకి పెద్దసంఖ్యలో నాయకులను చేర్చుకోవడం ద్వారా ఆపార్టీని దెబ్బతీయాలనుకున్నారు కానీ, దీని ఫలితం బి.జె.పి.రూపంలో కనిపించింది. కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడిన స్థితిలో బి.ఆర్.ఎస్.కు. ఆశ్చర్యకరంగా భారతీయ జనతాపార్టీ బలమైన ప్రత్యర్థిగా ఎదగడం చూశాం. తర్వాత అనూహ్య పరిణామల్లో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పుంజుకో వడమే కాదు ఏకంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవడం, బి.ఆర్.ఎస్. తీవ్రంగా నష్టపోవడం కూడా తెలంగాణ రాజకీయాల్లో ఎవరూ ఊహించని పరిణామాలు.
ఇక గతంలో కె.సి.ఆర్. అనుసరించిన వైఖరినే, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ కూడా అనుసరిం చారు. ఫలితంగా బి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంతో కేవలం నలుగురు ఎమ్మెల్యేల మెజారిటీ వున్న కాంగ్రెస్ తన అధికారాన్ని సుస్థిరం చేసుకుంది. ఏపార్టీ అధికారంలో వున్నప్పటికీ అవకాశ వాద ఎమ్మెల్యేల కారణంగా ఆయా పార్టీల సుస్థిరతకు, సజావుపాలనకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వీరివల్ల ప్రభుత్వాన్ని ఏర్పరచిన పార్టీ అధికారం నిలబెట్టుకోవడానికే ఎక్కువ గా దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడి పాలన కుంటుపడటం సర్వసాధారణమైపోయింది. ఇదిలావుండగా ఈవిధంగా ఎమ్మెల్యేలు తమ స్వార్థం కోసం పార్టీలు మారడం ఎంతవరకు సబబు అన్నది ప్రశ్న. తాము ఎన్నికల్లో పాల్గన్నప్పుడు ఒక పార్టీ తరపున పోటీచేసి తర్వాత మరో పార్టీలోకి చేరిపోవడమంటే నియోజకవర్గ ప్రజలను మోసం చేయడమే! ఎందుకంటే ప్రజలు ఒక పార్టీపట్ల అభిమానంతో ఓట్లు వేస్తే, వారి విశ్వాసాన్ని వమ్ము చేయడం తప్ప మరోటి కాదు. ఎన్నికల్లో ప్రతి పార్టీ ప్రజలకు కొన్ని హామీలనిస్తుంది. ఏ పార్టీ హామీలు నచ్చుతాయో దానికి ప్రజలు ఓట్లేస్తారు. మరిక్కడ జరుగుతున్నదేంటి? తాము గెలిపించిన ఎమ్మెల్యే వేరే పార్టీలోకి జంప్ అయితే తాము వేసిన ఓట్లకు విలువెక్కడుంది? తమ అభిప్రాయాన్ని తుంగలో తొక్కినట్టే కదా అన్న భావన ప్రజల్లో తప్పక కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ మార్పిడుల వ్యతిరేక చట్టాన్ని 1985లో ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. రాజ్యాంగంలోని పదవ షెడ్యూలు ప్రకారం, ఒక పార్టీనుంచి రాజీనామా చేసిన, పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు చేసి నా, ఇండిపెండెంట్‌గా ఎన్నికై వేరే పార్టీలో చేరినా అటువంటి ప్రజాప్రతినిధులు తమ పదవులకు అనర్హులవుతారు. ఒక పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల్లో 1/3వ వంతుమంది వేరే పార్టీలో చేరాలనుకుంటే అప్పుడు వారికి ఈ చట్టం నుంచి మినహాయింపు లభిస్తుంది.వీరి విషయంలో స్పీకర్‌దే నిర్ణయాధికారంగా షెడ్యూలు పేర్కొంది. ఈ ‘మినహాయింపు’ను అడ్డం పెట్టుకొని అధికారం లో వున్న పార్టీలు స్పీకర్ సహాయంతో విపక్షాలనుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తుండటం ప్రస్తుత రాజకీయాల్లో సర్వసాధారణమైపోయింది. ఈ నేపథ్యంలోనే బి.ఆర్.ఎస్.నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఈ చట్టం యొక్క ప్రభావశీలత చర్చనీయాంశంగా మారింది. మొత్తంమీద చెప్పాలంటే ఫిరాయింపుల చట్టంలోని లసుగులు, చర్యలు తీసుకోలేని విపక్షాలబలహీనత, కోర్టు తీర్పుల్లో విపరీత జాప్యం వెరసి ఈ ఫిరాయింపులు యదేచ్ఛగా కొనసాగడానికిదోహదం చేస్తున్నాయి.
ప్రజాప్రతినిధులు ఎవరైనా తాను ఏ ‘వేదిక’ (పార్టీని) ఆధారంగా చేసుకొని ఎన్నికల్లో పోటీచేసి గెలుస్తారో ఆ పార్టీకే కట్టుబడి వుండాలన్నది ప్రజాస్వామ్య సూత్రాల్లోని కీలక అంశం. కానీ ఈ ఫిరాయిపులు ఓటర్ల నమ్మకాన్ని, ప్రజాస్వామిక విలువలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయి. ఒక పార్టీనుంచి మరో పార్టీకి అలవోకగా మారిపోయే ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా వ్యవహరించేలా చట్టాలకు మరింత పదును పెట్టాలని ఇటు పౌరులు, పౌరసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా తమకు ఒక పార్టీపట్ల విశ్వాసాన్ని లేదా నమ్మకాన్ని తామెన్నుకున్న ఎమ్మెల్యేలు పూర్తిగా ధ్వంసం చేస్తున్నారన్న ఆగ్రహావేశాలు ఆయా నియోజకవర్గాల పౌరుల్లో క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇది నిజంగా ప్రజల్లో పెరుగుతున్న అవగాహనకు నిదర్శనం.
పార్టీలు మారేసమయంలో, తమన నియోజకవర్గ అభివృద్ధికోసమే పార్టీ మారుతున్నామంటూ గంభీర ప్రకటనలు ఇవ్వడం రివాజుగా మారింది. కానీ అసలు కారణం మాత్రం, వ్యక్తిగత కాంట్రా క్టులు, వ్యాపారాలను రక్షించుకోవడం, తమ దందాలను నిరాటంకంగా కొనసాగించుకోవడం. ఇదే వారి దృష్టిలో నియోజకవర్గ అభివృద్ధి! తమ వ్యక్తిగత లాభనష్టాలను బేరీజు వేసుకొని పార్టీలు మారేవారిని ప్రజలు ఎన్నుకోకూడదు. ఎందుకని అది జరగడంలేదంటే…చాలామంది తమ ఓటును అమ్ముకోవడంవల్ల! ఓటు అమ్ముకున్నవాడికి ఎమ్మెల్యేను ప్రశ్నించే అధికారం వుండదన్న కొత్త సిద్ధాంతం పుట్టుకొచ్చింది. అంటే ఓట్లకోసం ఖర్చురూపంలో పెట్టిన పెట్టుబడిని, ఎన్నికైన త ర్వాత లాభంతో సహా రాబట్టుకోవాలి. ఇది చాలామంది ఎమ్మెల్యేల వైఖరి! ఇక్కడ సిద్ధాంతం లే దా పార్టీ అనేది ముఖ్యం కాదు. తాము పెట్టిన పెట్టుబడిపై ఇబ్బడి ముబ్బడి లాభాలు ఎట్లా పొందాలనేది కీలకం. ఇంకెక్కడి ప్రజాస్వామ్య విలువ? ఆవిధంగా అది ‘పెట్టుబడి`లాభం’ అనే సి ద్ధాంతం కింద భూస్థాపితమైపోయింది.
1967లో హర్యానాకు చెందిన గయారాం లాల్ అనే ఒక ఎమ్మెల్యే పదిహేను రోజుల్లో మూడు పార్టీలు మారి రికార్డు సృష్టించాడు! అప్పటినుంచి ‘ఆయారాం గయారాం’ అనే నానుడి ప్రచా రంలోకి వచ్చింది. కొన్ని రాష్ట్రాల రాజకీయాల్లో కులాలు బలమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ అంతిమంగా డబ్బుదే ఆధిపత్యం. దీనిముందు తన`పర అనే భేదం వుండటంలేదు. కులం అధికారా న్ని తెచ్చిపెడితే, డబ్బుపై వ్యామోహం, స్వార్థపరత్వం, అధికారంతో వచ్చిన కిరీటానికి ‘అవినీతి`అక్రమాలు’ కలికితురాయిగా వున్నాయి! ఒకరకంగా చెప్పాలంటే ఈ పార్టీ ఫిరాయింపులు, ప్రజాస్వామ్యమనే పొట్లకాయకు పట్టిన ‘బచ్చుపురుగు’ (గొంగళిపురుగు) మాదిరిగా తయారయ్యాయి. ఇది ఒక్క తెలంగాణకే పరిమితం కాదు మిగిలిన రాష్ట్రాలు/దేశ రాజకీయాల్లో కూడా జరుగుతున్నదిదే. కొందరు ఎమ్మెల్యేలు తమ స్వార్థంకోసం లేదా తమ స్వప్రయోజనాల పరిరక్షణకోసం, నియోజకవర్గ అభివృద్ధి పేరుతో పార్టీ ఫిరాయించినప్పుడు, సదరు పార్టీ అధికారాన్ని కోల్పోతే పరిస్థితేంటి? అప్పటివరకు ఆ పార్టీ అమలు జరుపుతున్న సంక్షేమ/అభివృద్ధి పథకాలు, విధానాలు ఒక్కసారిగా నిలిచిపోతాయి. ఈ కప్పదాటు ఎమ్మెల్యేల పుణ్యమాని మరోపార్టీ అధికారంలోకి వస్తేఆపార్టీ తనవంటూ కొత్త విధానాలు మొదలుపెడుతుంది. అప్పుడు పరిపాలనకు ఒక అర్థమం టూ వుండదు. ప్రజాస్వామ్యంలో వున్న ప్రధాన లోపమిది. ‘తోక శరీరాన్ని ఊపిన చందంగా’ ఇటువంటి ఫిరాయింపుదార్లు ప్రభుత్వాలను శాసించే స్థితి కొనసాగడాన్ని మించిన దౌర్భాగ్యస్థితి మరోటుండదు!
ప్రజలకోసమే, అభివృద్ధి కోసమే పార్టీలు మారుతున్నామని చెప్పుకునే ఇటువంటి ఎమ్మెల్యేలకు ఎప్పుడు ఏ పార్టీ అధినేత దేవుడవుతాడో లేక దయ్యమవుతాడో వాళ్లకే తెలియదు. తమకు ఇబ్బంది లేకుండా చూసుకునే పార్టీ అధినేత వీరికి దేవుడు! మరి అదే నాయకుడు కొంచెం కఠినమైన విధానాలు తీసుకొస్తే రాత్రికి రాత్రే ఆయన వీరి దృష్టిలో ‘దయ్యమై’పోతాడు. ప్రస్తుతం తెలంగాణ లో ఇష్టంవచ్చినట్టు పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలు ఇందుకు గొప్ప ఉదాహరణ. బీఆర్‌ఎస్‌లో ఉన్నంతకాలం ‘కె.సి.ఆర్’ వీరికి దేవుడు! ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వచ్చిన తర్వాత ‘రేవంత్’ దేవుడు. మరి రేవంత్ దేవుడు హైడ్రాను తీసుకొచ్చి కచ్చితంగా విధానాలను అమలు చేస్తుంటే వీరికి ‘ఎక్కడో’ గుచ్చుకుంది. ఇంకేం ఇక ముంచుడు రాజకీయాలు షురూ! ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఇదే రాజకీయం నడుస్తోంది! మరి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్‌ఎస్‌లోకి వెళతారా? అది తప్ప మరోపార్టీ దిక్కులేదు! ఒకప్పుడు కె.సి.ఆర్.ను దేవుడని పొగిడి, కాంగ్రెస్‌లో చేరినతర్వాత ఆయనపై దుమ్మెతిపోసి, ఇప్పుడు మళ్లీ ‘నువ్వు తప్ప దిక్కులేదు’ అని ఏ ముఖం పెట్టుకొని వెళతారు? ఇదిలావుండగా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి హుటాహుటిన ఢల్లీికి వెళుతున్నారు. అధిష్టానం ఏం చెబుతుందో, వీరేం వింటారో అక్కడే తేలుతుంది. అధిష్టానం చెప్పుడు మాటలకే ప్రాధాన్యమిస్తే పార్టీ పుట్టిమునగడం ఖాయం! రేవంత్ వంటి సమర్థ నాయకుడు పార్టీలో లేడు! చెప్పుడు మాటలు మోసే నాయకులకు పార్టీని నడిపే సత్తా అసలు లేదు.
ఇక కె.సి.ఆర్. విషయానికి వస్తే కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు నిద్రబోతున్న సింహాన్ని తట్టిలేపాయి. ఆయన చిన్నగా జూలు విదిల్చి దెబ్బకొడితే తిరుగుండదని హెచ్చరించడమే కాదు, బహిరంగ సభలకు ప్రణాలికలు సిద్ధం చేసుకుంటున్నారు. మాటల మాంత్రికుడు రంగంలోకి దిగితే పరిస్థితి వేరుగా వుంటుంది! రేవంత్ కూడా సమర్థవంతమైన మడమతిప్పని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన్ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. మరి ఈ ఇద్దరు దిగ్గజాలు ఢీ అంటే ఢీ అంటూ వచ్చే స్థానిక ఎన్నికల్లో తమ మంది మార్బలంతో రంగంలోకి దిగితే తెలంగాణ రాజకీయాల్లో ఆ కిక్కే వేరబ్బా!