
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో చోప్పదండి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈకార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. బిఆర్ఎస్ పథకాలకు ఆకర్షితులై పలువురు యువకులు రవిశంకర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ నవంబర్ 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి పక్ష పార్టీలకు ఓటేస్తే మోసపోయి గోసపడతామని తెలిపారు. బిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఉందన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదింటికి కేసీఆర్ బీమా పథకం కింద ఐదు లక్షల బీమా, ప్రతి కుటుంబానికి సన్న బియ్యం, పేదింటి మహిళకు 400కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని కెసిఆర్ ప్రకటించారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తోమ్మిది ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంతో పాటు చొప్పదండి నియోజకవర్గం కోనసీమగా మారిందన్నారు. ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడే ఉంటున్న నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నానని, గతంలో ఏ ఎమ్మెల్యే చేయని అభివృద్ధి పనులను 18వందల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. మరో అవకాశం కల్పిస్తే రాష్ట్రంలోనే చొప్పదండి నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో ఉంచుతానని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ కలిగేటి కవిత, మండలాధ్యక్షులు జితేందర్ రెడ్డి, జెడ్పిటిసి మార్కొండ లక్ష్మీ కృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు వీర వెంకటేశ్వరరావు, ఫ్యాక్స్ చైర్మన్ ఓంటెల మురళీకృష్ణారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.