సైన్స్ తోనే శాస్త్రీయ దృక్పథం

చందుర్తి ఎంపీటీసీ, పులి రేణుక సత్యం,
చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో తయారు చేసినటువంటి పాఠ్యాంశ కృత్యాలు, ప్రయోగాల ప్రదర్శనను స్థానిక ఎంపీటీసీ పులి రేణుక సత్యం ప్రారంభించారు. సైన్స్ ఫెయిర్ లో విద్యార్థులచే ప్రదర్శించబడిన ప్రాజెక్టులు సందర్శకులను ఆకర్షించి, ఆలోచింపజేశాయి.
ఈ సందర్భంగా పులి రేణుక సత్యం మాట్లాడుతూ ” పాఠశాల స్థాయిలోనే బాలమేధస్సులను ఉత్తేజపరిచి వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి తద్వారా ప్రతి పాఠశాలను నూతన ఆవిష్కరణల వేదికగా రూపొందించాల్సిన ఆవశ్యకత నేటి సాంకేతిక యుగంలో ఎంతైనా ఉందని , విద్యార్థులలో చిన్నతనం నుంచి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని, పిల్లలు స్వంత వ్యక్తిత్వ వికాసం కోసం కృషి చేయాలని, పిల్లలు మేధావితనం పెంచుకొని శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని, విద్యారంగంలో ప్రశ్నించే తత్వం, ప్రతి అంశాన్ని హేతుబద్ధంగా విశ్లేషించడం, సృజనాత్మక ,ఊహాత్మక భావ స్వేచ్ఛ వంటి వాటికి పెద్దపీట వేయాలని, విద్యార్థులు తమ లక్ష్యం చేరుకోవడానికి సరైన మార్గంలో ప్రయాణించడానికి మేధోపరమైన సంభావితంగా అభివృద్ధికి విద్యాసంస్థలు చోదక శక్తిగా ఉపయోగపడాలని, ఆధునిక ,శాస్త్ర సాంకేతిక విద్య విద్యార్థులకు అందినప్పుడే దేశంలో ఆర్థికాభివృద్ధి వేగంగా జరుగుతుందని, చిన్న వయసు నుండే పిల్లలకు శాస్త్రీయ దృక్పథం ,సాంకేతిక నైపుణ్యం అలవడడానికి కావలసిన ప్రాథమిక అంశాలు పాఠ్యాంశాలలో చేర్చాలని, దీనితో మూఢనమ్మకాలు, మూర్ఖ విశ్వాసాలకు దూరంగా హేతుబద్ధంగా ఆలోచించడం నేర్చుకుంటారని, అంతేకాకుండా కళాశాల స్థాయి వచ్చేసరికి విద్యార్థులు సొంత సాంకేతిక అంశాలు రూపొందించే సామర్థ్యాన్ని పునికి పుచ్చుకుంటారని ” పేర్కొన్నారు.
ప్రధానోపాధ్యాయుడు బొగ్గారపు శంకర్ మాట్లాడుతూ “ఒక ద్రవపదార్థంపై కాంతి కిరణాలు పడినప్పుడు ఆ కాంతి పరిక్షేపం చెందుతుందని ,కాంతి కిరణాల్లోని ప్రోటాన్లు ద్రవపదార్థాల అణువుల పై పడి పరిక్షేపం చెందుతాయని, చెదిరిన ప్రోటాన్లలో ఎక్కువ భాగం వాటి పూర్వపు తరచుదనాన్ని కోల్పోవని, కొన్ని కొంత తక్కువ పౌనఃపుణ్యంతో పరిక్షేపం చెందుతాయని, పాదదర్శకంగా ఉన్న ఘన, ద్రవ, వాయు మాధ్యం గుండా కాంతిని ప్రసరింప చేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుందని, ఇదే రామన్ ఎఫెక్ట్ 1928 ఫిబ్రవరి 28న ‘ఎ న్యూ రేడియేషన్’ పేరుతో “ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజిక్స్ “లో రామన్ ఎఫెక్ట్ ముదిరితమైందని, తక్కువ వనరులతో చేసిన ప్రయోగ పరికరాలతో నోబెల్ బహుమతి పొందడం ,అందునా బ్రిటిషర్ల పాలన కాలంలో వర్ణ వివక్షతో మేధోదోపిడి జరుగుతున్న రోజుల్లో భారతీయ వైజ్ఞానిక కీర్తి పతాకాన్ని సివి రామన్ ఎగరవేయడం శాస్త్రవేత్తల ప్రపంచాన్ని నివ్వెర పరిచిందని స్వతంత్రంగా ఆలోచించడం, కఠోర పరిశ్రమలతో పరిశోధన చేయడం తదితర అంశాలలో రామన్ యువతలో స్ఫూర్తినింపాడని, విద్యార్థినీ, విద్యార్థులు రామన్ ను స్ఫూర్తిగా తీసుకొని, సైన్స్ పట్ల మక్కువ పెంచుకోని, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకొని, శాస్త్రవేత్తలుగా ఎదగాలని” పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు తిప్పని శ్రీనివాస్ ,గొట్టె ప్రభాకర్, పులి సత్యం, దారం రామచంద్రం, పోతురాజు రవి మరియు ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!