సైన్స్ తోనే మానవ మనుగడ

-ఫార్మసీ ప్రొఫెసర్ డాక్టర్ వీర బ్రహ్మకిషన్.*

లక్షేట్టిపేట్ (మంచిర్యాల) నేటిధాత్రి :

సైన్స్ తోనే మానవ మనుగడ సాధ్యమని తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ (TAS) జోనల్ సెక్రటరీ, ఫార్మసీ ప్రొఫెసర్ డాక్టర్ వీర బ్రహ్మ కిషన్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ముందస్తు ‘నేషనల్ సైన్స్ డే’ ను పురస్కరించుకొని “వికసిత్ భారత్ కోసం దేశీయ సాంకేతికతలు” అనే అంశంపై ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మన నిత్య జీవితంలో సైన్స్ పాత్ర మరువలేనిదన్నారు. బయాలజీ, మాథమాటిక్స్, ఫిజిక్స్ మాత్రమే సైన్స్ కాదు అని, సృష్టిలో ప్రతిదీ సైన్స్ తోనే ముడిపడి ఉందనే వాస్తవాన్ని విద్యార్థులు గుర్తించాలన్నారు. ప్రకృతిలో జరుగుతున్న ప్రతి విషయం వెనుక శాస్త్రీయత దాగి ఉంటుందనేది పరిశీలన, ప్రయోగాల ద్వారానే నిరూపించవచ్చన్నారు. ‘సర్ సీ వీ రామన్ ఎఫెక్ట్’ భారత దేశానికి ఎంతో మంచి పేరును తీసుకువచ్చిందన్నారు. ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పధంతో చదివితే ఎన్నో కొత్త ఆవిష్కరణలకు బీజం పడుతుందన్నారు. పలు రకాల ఉదాహరణలతో విద్యార్థులలో సైన్స్ పట్ల ఆసక్తి కలిగేలా ప్రసంగించారు. అంతకుముందు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓజా మాట్లాడుతూ… నోబెల్ ప్రైజ్ సాధించినటువంటి సర్ సీ వీ రామన్ మన దేశానికి ఎంతో గర్వకారణమన్నారు. పరిమితమైన సౌకర్యాలతోనే ప్రయోగాలు చేసి శాస్త్రీయ దృక్పధాన్ని నెలకొల్పిన సర్ సీ వీ రామన్ నేటి యువతకు ఆదర్శమన్నారు. విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలతో చదువుపట్ల మరింతగా ఆసక్తిని పెంచేలా తమ కళాశాలలో విద్యను అందిస్తున్నట్లు ఆయన వివరించారు. అనంతరం డాక్టర్ వీర బ్రహ్మ కిషన్ ను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గంగయ్య, IQAC కోఆర్డినేటర్ పి సవిత, కెమిస్ట్రీ అధ్యాపకులు ఎం కుమారస్వామి మరియు ఇతర అధ్యాపక బృందం, బోధనేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!