పాఠశాలలు పరిశుభ్రంగా ఉంచాలి

# ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలి.

# కలెక్టర్ డాక్టర్ సత్య శారదాదేవి

# ఉప్పరపల్లి ఉన్నత పాఠశాలలను సందర్శన

నర్సంపేట,నేటిధాత్రి :

జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదాదేవి అన్నారు.వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలోని చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాధమిక పాఠశాలలను వరంగల్ జిల్లా కలెక్టర్ శారదా దేవి సందర్శించారు.ఈ సందర్భంగా పలు తరగతులను పరిశీలించారు. సమర్ధ నిర్వహణ కోసం ప్రధానోపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.గ్రామపంచాయతీ సిబ్బందిని ప్రతిరోజు పాఠశాలకు వచ్చి పరిశుభ్రం చేసేలా ఎంపీడీవోను ఆదేశించారు.అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో గుర్తించి చేపడుతున్న పాఠశాలకు సంబంధించిన అభివృద్ధి పనులన్నింటిని వారం రోజుల్లోపు పూర్తి చేయాలన్నారు. వారం రోజుల అనంతరం పాఠశాలను మళ్ళీ సందర్శిస్తానన్నారు.కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి,స్థానిక తహసీల్దార్ ఫణికుమార్, ఇంచార్జి ఎంపిడిఓ ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

# ప్రజావాణి కార్యక్రమం పట్ల స్పందించిన కలక్టర్..

చెన్నారావుపేట మండలంలోని తిమ్మరాయన్పాడు గ్రామంలో సర్వే నంబర్ 70 లో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ను రైతులు కోరిన మేరకు బుదవారం జిల్లా కలెక్టర్ స్వయంగా గ్రామంలో సందర్శించారు.సర్వే నంబర్ 70 అటవీ భూమి అని, నిబంధనల ప్రకారం ఈ భూమికి అసైన్మెంట్ పట్టాలు వర్తించవని స్థానిక తహశీల్దార్ కలెక్టర్ కు వివరించగా, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రెవెన్యూ, అటవీశాఖ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి ఈ భూమిలో దున్నుతున్న
రైతులు, వారికున్న ఆధారాల వివరాలతో కూడిన పూర్తి నివేదిక పక్షం రోజుల్లో సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *