SC/ST Reservations Must Follow 2024 Population in Mulugu Panchayat Elections
గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీలకు 2024 జనాభా నిష్పత్తికి సమానంగా రిజర్వేషన్లు (సీట్లు) కల్పించాలి
ములుగు టౌన్ నేటి దాత్రి
ములుగు జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు జరగబోయే గ్రామ సర్పంచ్ ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీలకు 2024 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ( కెవిపిఎస్) ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నం ప్రవీణ్ కోరారు
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కమిటీ సభ్యులు రత్నం ప్రవీణ్ పాల్గొని
మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎస్సీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించారని, కానీ 2011-2025 ఈ మధ్యకాలంలో వారి జనాభా పెరిగి అనేక వేల మంది యువత కొత్తగా ఓటు హక్కు పొందారని ఎస్సీ ఎస్టీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, 2011 జనాభా లెక్కల ప్రకారం కేటాయిస్తే వారికి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు రాక రాజకీయ రంగంలో కూడా వారి వెనుకబడిపోయి వివక్షతకు గురయ్యే ప్రమాదం ఉందని ఇప్పటికే ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాల వలన విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కోల్పోయి బ్రతకడానికి చాలా ఇబ్బందులు పడుతున్న వారికి ఇప్పుడు ఈ రిజర్వేషన్ విధానం వల్ల రాజకీయ రంగంలో కూడా అవకాశాలు కోల్పోతారని, భారత రాజ్యాంగంలో కూడా ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా కనుగుణంగా రిజర్వేషన్లు కల్పించి, సీట్లు కేటాయించాలని ఉందని, అలాగే ప్రభుత్వాలు అన్ని కులాల వారిని సమానంగా గౌరవించాలని రాజ్యాంగంలో పొందుపరిచారని అయినా నేటి పాలకులు అవేమీ పట్టించుకోకుండా బీసీలకు 2024 జనాభా లెక్కల ప్రకారం గ్రామపంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్లు కల్పించి, ఎస్సీ, ఎస్టీలకు మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించడం అంటే ముమ్మాటికి వారిని అవమానించడమేనని, ఇది రాజ్యాంగ స్పూర్తికి పూర్తి వ్యతిరేకమైన చర్య, రాజ్యాంగ విరుద్ధమైనదని వెంటనే ఈ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను సవరించి రాష్ట్రవ్యాప్తంగా మరియు ములుగు జిల్లాలో కూడా ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని లేనిచో కెవిపిఎస్ ఆధ్వర్యంలో పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు.
