తప్పుడు బీసీ కుల ధ్రువీకరణ పత్రంతో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థిని తొలగించాలని
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో కాటారం మండలం గుండ్రాతిపల్లి గ్రామపంచాయతీకి సంబంధించి ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తప్పుడు బీసీ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించి గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థిని వెంటనే తొలగించాలని, అలాగే రెండవ స్థానంలో నిలిచిన గోనే ముకుంద ని సర్పంచ్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్, గోనే ముకుంద పార్టీ జిల్లా నాయకులు వినతి పత్రం అందజేశారు.
అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవి పటేల్ మాట్లాడుతూ,
గుండ్రాతిపల్లి గ్రామంలో ప్రస్తుత సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల సమయంలో సమర్పించిన నామినేషన్ అఫిడవిట్, కుల ధ్రువీకరణ పత్రం తప్పుడు వివరాలతో కూడినవని, వాటిని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు తక్షణమే తనిఖీ చేసి, తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ సర్పంచ్ అభ్యర్థిత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులకు స్పందిస్తూ,
ఈ అంశంపై తప్పకుండా సమగ్ర విచారణ (ఎంక్వయిరీ) నిర్వహిస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని, అలాగే అధికారులను తప్పుదోవ పట్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని రవి పటేల్ తెలిపారు.
అలాగే, ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించకపోతే,
తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న స్వయంగా భూపాలపల్లికి వచ్చి జిల్లా కలెక్టర్ తో నేరుగా మాట్లాడతారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇప్పటికీ న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ప్రజాపోరాటాలకు దిగుతామని, మీడియా ముఖంగా అధికారులను రవి పటేల్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
