
సెప్టెంబర్ 15లోగా చీరల ఉత్పత్తి ఆర్డర్ పూర్తి చేయాలి
ఉత్పత్తిలో వెనుకబడిన వారు వేగం పెంచాలి
రెండు షిఫ్ట్ లలో ఉత్పత్తి చేయాలి
త్వరలో ఆర్డర్ల బిల్లులు చెల్లిస్తాం
చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా
రామయ్యార్, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ తో సమీక్ష
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అందించిన చీరల ఉత్పత్తి ఆర్డర్ ను వచ్చే నెల సెప్టెంబర్ 15వ తేదీలోగా పూర్తి చేయాలని చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ సూచించారు. ఎస్ హెచ్ జీ సభ్యులకు అందజేసే ఏకరూప చీరల ఉత్పత్తిపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు చెందిన బాధ్యులతో హ్యాండ్ లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హాజరై, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ముందుగా సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమ బాధ్యులకు మొత్తం కేటాయించిన ఆర్డర్, వారు ఉత్పత్తి చేసిన అంశాలపై సమీక్ష చేశారు. ఉత్పత్తిలో చాలా వెనుక బడిన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు ఏడాదికి రెండు ఏకరూప చీర చీరలు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని వెల్లడించారు.ఈ చీరల ఉత్పత్తి ఆర్డర్ లో భాగంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ కేటాయించడం జరిగిందని వివరించారు. మొత్తం 4 కోట్ల 30 లక్షల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ ఇచ్చామని, ఇప్పటిదాకా దాదాపు 50 శాతం పూర్తి అయిందని వెల్లడించారు. మిగతా ఆర్డర్ ను వచ్చే నెల 15వ తేదీ లోగా ఇవ్వాలని స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా పరిశ్రమ బాధ్యులు పవర్ లూమ్స్, కార్మికులు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని, ఎట్టి పరిస్థితుల్లో లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఉత్పత్తిలో వెనుకబడిన వారు తమ ఆర్డర్ పూర్తి చేయని పరిస్థితుల్లో మిగతావారికి దానిని అందిస్తామని స్పష్టం చేశారు. పరిశ్రమ బాధ్యుల వద్ద ఉన్న వస్త్రాన్ని వెంటనే గోదాముకు తరలించాలని సూచించారు. దీంతో మిగతా ప్రక్రియ వేగంగా పూర్తి అవుతుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా చీరలు పంపిణీ చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు నిరంతరం ప్రభుత్వ ఆర్డర్లు అందించేందుకు సర్కార్ సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమలోని యంత్రాలను ఆధునీకరించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ పేర్కొన్నారు. దీంతో మార్కెట్ తో పోటీ పడే అవకాశం ఉంటుందని, మరిన్ని ఆర్డర్లు వస్తాయని తెలిపారు వస్త్ర పరిశ్రమ బాధ్యులు ఆలోచన చేయాలని సూచించారు.వస్త్ర పరిశ్రమ ఆర్డర్లకు సంబంధించిన బిల్లులు త్వరలోనే అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వస్త్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్, జీఎస్టీ తదితర సమస్యలను పరిశ్రమ బాధ్యులు ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లారు. ఆట సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికీ తీసుకువెళ్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు.సమీక్ష సమావేశంలో చేనేత జౌళి శాఖ జేడీ, టెస్కొ సీజీఎం ఎన్ వీ రావు, ఏడీ రాఘవరావు, అధికారులు, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.