నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)
కమలాపూర్ మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన మౌటం శ్రీనివాస్ – రమ దంపతుల కూతురైన సంగీత అథ్లెటిక్స్,గేమ్స్ లో రాణిస్తూ సత్తా చాటుతుంది.స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించిన సంగీత గత రెండేళ్లుగా గేమ్స్ మాస్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జావలింగ్, డిస్కత్రో, హామర్ అథ్లెటిక్స్ పోటీలతో పాటు కబడ్డీ,ఖోఖో, వాలీబాల్ పోటీల్లో శిక్షణ పొంది జిల్లా,రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణిస్తోంది. ఇప్పటికే స్కూల్ తరఫున 15 చోట్ల పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచి ప్రశంసలు అందుకుంటుంది. గత ఏడాది కరీంనగర్ లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో హమర్ విభాగంలో కాంస్య పథకాన్ని సాధించగా గత కొద్ది రోజుల క్రితం హనుమకొండలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో జావలింగ్, డిస్కత్రో విభాగంలో సిల్వర్, కాంస్య పథకాలను సాధించింది. జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చాటుతున్న సంగీతను మండల విద్యాధికారి రామకృష్ణరాజు ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా,రాష్ట్ర స్థాయి పోటీల్లో పథకాలు వచ్చేలా శిక్షణ ఇచ్చిన గురువులు కృష్ణమూర్తికి, ప్రధానోపాధ్యాయులు రంగనాథ్, ఉపాధ్యాయులకు స్టూడెంట్ సంగీత ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఎవరైనా సహకారం అందిస్తే దేశ స్థాయిలో రాణించి, మరిన్ని పథకాలు సంపాదిస్తానని తెలుపుతోంది. ఓక్క ఆటల్లోనే కాదు చదువుల్లోనూ దిట్ట ఈ పేదింటి బిడ్డ…