గుట్టల్లా రీచ్‌లు…వేలల్లో లారీలు! ఇసుక బుక్కుడే…బుక్కుడు!

లారీ లోడ్‌కు మించి నింపుతున్నారు.

ప్రమాణాలు వదిలేస్తున్నారు..ప్రజల ప్రాణాలు తీస్తున్నారు.

లారీల కండీషన్లు చెక్‌ చేస్తున్న వారు లేరు.

ఎంతెంత లోడ్‌ నింపుతున్నరో చూసే వారు లేరు.

డ్రైవర్లు మద్యం మత్తులో తూగుతూ డ్రైవ్‌ చేస్తున్నారు.

హైవేలలో క్లీనర్ల చేతికి లారీ అప్పగిస్తున్నారు.

లారీల మోతతో భూపాలపల్లి జనం హడలిపోతున్నారు.

బస్టాండులో నిలుచున్న వారికి గుద్దేశారు.

రోడ్డు మీద వున్న పదుల సంఖ్యలో వాహనాలు ద్వంసం చేశారు.

ఓ ఇద్దరికి తీవ్ర గాయాలు చేశారు.

అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు.

ఇసుక లారీ గుద్ది ఇటీవలే ఘట్‌ కేసర్‌ వద్ద బైకిస్ట్‌ మరణం.

వెలుగులోకి రాని సంఘటనలు అనేకం.

ఎక్కడిక్కడ వాటాలు పంచుకుంటున్నారు.

ప్రభుత్వాదాయానికి కన్నం పెడుతున్నారు.

అధికారులు అవినీతికి పాల్పడడం వల్లే ఇదంతా!

చెకింగ్‌ల పేరుతో చేసే హడావుడి అంతా డొల్ల.

ప్రభుత్వ ఖజానా గుల్ల.

అధికారుల తీరుతో వందల కోట్లు గండి.

ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెడితేనే ఖజానా నిండు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న డంపింగ్‌ యార్డుల్లాంటి ఎత్తెన ప్రదేశాలు కొన్ని కనిపిస్తున్నాయి. అవేమైనా చెత్త గుట్టలు కాదు. నిజమైన గుట్టలు అసలే కాదు. ఇసుక రాసులు. కాళేశ్వరం వద్ద నుంచి తవ్వుతున్న ఇసుకను రాసులుగా పోసి, గుట్టలుగా పోసి, అందరికీ తెలిసినా, గుట్టు చప్పుడు కాకుండా అమ్ముకుంటున్నట్లు సాగుతున్న వ్యాపారం. ఓ వైపు ప్రభుత్వం కాళేశ్వరం బాగు కోసం ఇసుక తీసేందుకు అనుమతులిచ్చిందన్న నెపంతో ఇక వ్యాపారులు రెచ్చిపోతున్నారు. గతంలో నిత్యం వందల లారీలతో సాగే ఇసుక వ్యాపారం ఇప్పుడు వేలకు చేరింది. నిత్యం కనీసం వెయ్యినుంచి రెండు వేల లారీల వరకు తరలుతోంది. అయితే ఇక్కడ మరో తిరకాసుంది. ఒక లారీలో నియమితమైన లెక్క ప్రకారం ఇసుకను రవాణ చేయాలి. కాని ఇసుకాసురులు, అదికారులను గుప్పిట్లో పెట్టుకొని లోడ్‌కు మించి లారీలలో ఇసుక నింపుకొని తరలిస్తున్నారు. లెక్క ప్రకారం ప్రభుత్వానికి చెల్లించాల్సిన దానిని దొడ్డిదారిన ఎగ్గొట్టేస్తున్నారు. ఇలా నిత్యం కొన్ని వేల లారీల ద్వారా టన్నుల కొద్ది ఇసుక అక్రమంగా తరులుతున్నా, పట్టించుకునే వారు లేరు. అడిగేవారు లేరు. ఎప్పుడైనా మీడియాలో ఏదైనా కథనం వస్తే అప్పుడు ఏదో హడావుడి చేసినట్లు నటిస్తారు. మళ్లీ ఆ తర్వాత యధావిధిగా జరగాల్సినదంతా జరుగుతూనే వుంటుంది. ఇక లారీల విషయానికి వస్తే ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఇసుక రవాణా సాగిస్తుంటారు. హైదరబాద్‌కు పగటి పూట ఇసుక రవాణ నిశేధం. అందవల్ల రాత్రి సమయాల్లోనే ఈ ఇసుక రవాణ విచ్చలవిడిగా జరుగుతుంది. అందుకే నిబంధనలు పాతర వేస్తారు. తమ ఇస్టానుసారం ఇసుక తరలిస్తుంటారు. లెక్కాపత్రం లేని ఇసుకను కూడా తోలేస్తుంటారు. కోట్లు సంపాదిస్తుంటారు. అందుకు అనుమతులివ్వాల్సిన అదికారులకు ముట్టచెప్పేది ముట్ట జెబుతుంటారు. వాళ్లు చేతులు కట్టుకొని చోద్యం చూస్తుంటారు. వారికి సహకరిస్తుంటారు. నిజానికి ఇసుక తరలించే లారీలు ఎలా వున్నాయన్నది కూడా అధికారులు పట్టించుకోరు. వాటి ఫిట్‌ నెస్‌ ఎలా వుందన్నది కూడా చూడరు. నిత్యం ప్రయాణం చేసే ఆ లారీల మెంటెనెన్స్‌ కూడా సరిగ్గా వుండదు. ఒక్కరోజు లారీ ఆగితే వేలల్లో నష్టం అనుకునే రకాలు వ్యాపారులు. అందువల్ల లారీ ఫిట్‌నెస్‌ కన్నా, ఇసుక రవాణే వారికి ముఖ్యం. ఆ నిర్లక్ష్యమే ప్రజల ప్రాణాలను కూడ తీస్తోంది. ఇసుక లారీల వల్లనే తరుచూ ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం కూడా ఇదే.

ఫిట్‌నెస్‌ సరిగ్గాలేని లారీలు ఎలాంటి సర్వీసింగ్‌లకు వెళ్లకుండా ఇసుక రవాణకే వెళ్తుండడం, విపరీతమైనలోడు, తెల్లారేసరికి హైదరాబాద్‌ చేరాలన్న జోరుతో విపరీతమైన స్పీడ్‌ను మెంటైన్‌ చేస్తుంటారు.
అడ్డొచ్చిన వారిని గుద్దుకుంటూ వెళ్తుంటారు. వెనకుండి గుద్దేసి వెళ్తుంటారు. ఇక ఇసుక లారీలను అడపా దడపా పోలీసులు ఆపి చెక్‌ చేసినట్లు నటిస్తారు. బండికి అన్ని అనుమతులున్నాయా? అన్నది చూస్తారే గాని డ్రైవర్‌ ఫర్ఫెక్టు డ్రైవరేనా అని చూడరు. అతనికి లైసెన్స్‌ వుందా? లేదా? అడగరు. అలా నడుస్తున్న లారీలు కూడా వున్నాయని సమాచారం. ఇక ప్రతి లారీకి ఒక క్లీనర్‌ వుండాడు. వాళ్లు కనీసం 20 సంవత్సరాలుకూడా వుండరు. ఎక్కువ మంది 15 సంవత్సరాల పైబడి మాత్రమే వుంటారు. అలాంటి వారికి డ్రైవర్లు హైదరాబాద్‌ మెయిన్‌ రోడ్డు రాగానే డ్రైవింగ్‌ అప్పగిస్తుంటారు. డ్రైవర్లు నిద్రపోతుంటారు. ఆ సమయాల్లో ఎక్కడా పోలీస్‌ చెకప్‌ వుండదు. వరంగల్‌నుంచి హైదరాబాద్‌ వరకు అర్ధరాత్రి ఎలాంటి చెకింగ్‌లు వుండవు. ఒకవేళ ఏదైనా చెకింగ్‌లు వున్నట్లు ముందే పసిగట్టి, డ్రైవర్లను నిద్రలేపి స్టీరింగ్‌ ఇస్తుంటారు. ఇలా డ్రైవింగ్‌ నిష్ణాతులు , సుశిక్షితులు కాని యువకుల చేతికి లారీలను ఇస్తుంటారు. ఇటీవలే ఘట్‌కేసర్‌ వద్ద ఇసుక లారీ గుద్ది, ఓ వహనదారుడు చనిపోయాడు. ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని వెనుకనుంచి వచ్చిన లారీ డీకొన్నది. అతను అక్కడికక్కడే మరణించాడు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయంలో భూపాల పల్లికి కొంత మంది రాజకీయ నాయకులు ప్రచారానికి వచ్చారు. ఇక్కడే కొంత కాలం వున్నారు. ప్రచార పర్వ సమయం ముగియడంతో, పోలింగ్‌ ఇక రెండు రోజులు వుందనగా వాళ్లు, తమ స్వస్ధలాలకు వెళ్లడానికి సిద్దమయ్యారు. అలా వచ్చిన వారిలో మహబూబ్‌నగర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు బస్టాండ్‌ సమీపంలో నిల్చుకొని వుంటే ఇసుక లారీ వచ్చి గుద్దేయడంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. భూపాలపల్లిలో ఎటు నుంచి లారీలు ఎటు వస్తున్నాయో అర్ధం కాక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. భయ బ్రాంతులకు గురౌతున్నారు. ఆ మధ్య ఓ ఇసుక లారీ భీభత్సం చేసింది. రోడ్డుపై పార్కు చేసిన ఇరవై ఐదు ద్విచక్రవాహనాల మీదకు వెళ్లింది. ఆ బైకులన్నీ నుజ్జు నుజ్జయ్యాయి. ఆ పక్కన నిల్చున్న ఓ ఇద్దరికి గాయాలయ్యాయి.
ఇలా లారీలు సృష్టిస్తున్న భీభత్సం చూసి, ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నారు.

ఇక రాత్రి వేళల్లో లారీల చప్పుడు, వారు చేసే హరన్‌ల మోతలో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. లారీ వెనుక లారీ అన్నట్లు వేలాది లారీలు భూపాలపల్లి పట్టణం నుంచే వెళ్తుంటాయి. అవి ఒకదాని తర్వాత ఒకటి ఆపకండా పట్టణం దాటేదాకా హరన్ల మోత మోగిస్తుంటారు. స్ధానిక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోందని వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. పోలీసులకు ఈ విషయం తెలుసు. కాని వాళ్లు చేసేదేమీ లేదు. లారీలను కంట్రోల్‌ చేయలేరు. ఇక ఓవర్‌ లోడ్‌తో వెళ్లే లారీలకు బ్రేక్‌ డౌన్లు అవడం సహజం. నిర్ణీత బరువును మోసుకొని లోడ్‌లతో వెళ్లే లారీల ఫిట్‌ నెస్‌ బాగానే వుంటుంది. కాని నిత్యం నిబంధనలకు విరుద్దంగా అధిక పరిమితికి మించి లోడ్‌లతో వెళ్లే లారీలను కంట్రోల్‌ చేయడం డ్రైవర్లుకు కూడా కష్టమే. అందుకే ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇది ఇలా వుంటే రాత్రి వేళల్లో డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుతపుతుంటారు. గుట్కాలు వేసుకుంటారు. మత్తు పదార్ధాలు సేవిస్తుంటారు. ఇటీవల గంజాయి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు మత్తు పదార్ధాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు, క్యాబ్‌ డ్రైవర్లుకు అవగాహన సదస్సులు నిర్వహించారు. కాని ఇలాంటి హెవీ వెయికిల్‌ డ్రైవర్లును మాత్రం పిలిపించలేదు. వారికి సూచనలు చేయలేదు. నిజానికి ఆటో డ్రైవర్లకు ఆ డ్రగ్స్‌, గంజాయి వాడేంత స్దోమత వుండదు. ఒక వేళ వున్నా అది కొంత మందికే పరిమితం. ఇక క్యాబ్‌ డ్రైవర్లకు అడుగుగునా నిఘా వుంటుంది. డ్రైవింగ్‌ సమయాల్లో వాళ్లు కూడా సేవించకపోవచ్చు. కాని ఇసుక లారీలను నడిపే డ్రైవర్లును ఎక్కడా ఆపరు. ఎక్కడావారిని డ్రంకన్‌ డ్రైవ్‌ టెస్టులు చేయరు. ఎందుకంటే వాళ్లు రాత్రి సమయాల్లో డ్రైవింగ్‌ చేసేందుకు డ్రగ్స్‌కు, గంజాయిలకు అలవాటు పడుతుంటారు. సహజంగా మద్యం సేవిస్తే నిద్ర పోతుంటారు. కాని హేవీ వెయికిల్స్‌ నడిపే వారు శారీరకంగా విపరీతమైన శ్రమ పడుతుంటారు. దాన్ని మర్చిపోయేందుకు మద్యం సేవిస్తుంటారు. దాంతో అటు హెవీలోడ్‌ లారీలు, డ్రైవర్‌ కూడా లోడ్‌ మీద వుండడంతో ప్రమాదాలు విపరీతంగా జరుగుతుంటాయి. ఇవన్నీంటినీ అదికారులు కళ్లు మూసుకొని చూస్తుంటారు. అందుకే అవి కనిపించవు. ఇలా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండిపడేందుకు కూడా అధికారులు సహకరిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యేక నిఘా వ్యవస్ధను ఏర్పాటు చేసి, పొరపాటు చేస్తున్న అదికారులను శిక్షించాలి. ఇసుక పరిమితికి మించి రవాణా చేస్తున్న లారీల లైసెన్సులు రద్దు చేయాలి. రాయల్టీ ఎగ్టొట్టేందుకు పరిమితికి మంచి ఇసుక రవాణా చేస్తున్న వ్యాపారుల నుంచి సొమ్ము వసూలు చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!