
Co-education in Mirzapur (B) PG College.
నాలుగున్నర దశాబ్దాలకు మోక్షం
◆:- మిర్జాపూర్ (బి) పీజీ కళాశాలలో కో-ఎడ్యుకేషన్
జహీరాబాద్ నేటి ధాత్రి:
నాలుగు దశాబ్దాలుగా మెన్స్ పీజీగా కొనసాగిన న్యాల్ కల్ మండలం మిర్జా పూర్(బి) ఓయూ (ఉస్మానియా అనుబంధ) పీజీ కళాశాల కో-ఎడ్యుకేషన్ గా మారనుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే తొలి పీజీ కళాశాలగా పేరొందిన ఈ కళాశాలలో ఇకపై మహిళలకు ప్రవేశాలు దక్కను న్నాయి. ఏళ్లుగా చేస్తున్న ప్రతిపాదనలకు కార్యరూపమిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త కోర్సులు మంజూరైతే కళాశాల పూర్వ వైభవం సంతరించు కోనుంది.జహీరాబాద్ ప్రాంతంలో చక్కెర, అనుబంధ రసాయన కోర్సులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బంగ్లా మీర్జాపూర్ గ్రామంలో 1980 అక్టోబరు 30న ఈ పీజీ కళాశాలను ప్రారంభించారు. జహీరాబాద్-బీదర్ రహదారిపై గల మిర్జాపూర్(బి) గ్రామానికి స్వర్గీయ మాజీ మంత్రి, మాజీ ఎంపి మొగిలిగుండ్ల బాగారెడ్డి కృషి వల్ల ప్రభుత్వం పీజీ కళాశాలను ప్రత్యేకించి మంజూరు చేసింది. మిర్జాపూర్(బి)లో ఓయూ పీజీ కళాశాలఏర్పాటు చేసింది. అవసరమైన భూమి లభ్యత, కూత వేటు దూరంలో కొత్తూర్ (బి) చక్కెర కర్మాగారం, నీటికి నారింజ ప్రాజెక్టు అనువుగా ఉండటంతో మాజీ ఎంపీ బాగారెడ్డి పట్టుబట్టి పీజీ కళాశాల ఏర్పాటు చేయించారు.ఎంబీఏ, ఎమ్మెస్సీ ఆర్గానిక్స్ కొత్త కోర్సులకు ఏటా చేస్తున్న విజ్ఞప్తులకు ఈసారి ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ నుంచి సానుకూల స్పందన లభించింది. కో-ఎడ్యుకేషన్ కు ఆమోదం కూడా లభించగా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఆదరణ ఉన్న ఎంబీఏ, ఎమ్మెస్సీ ఆర్గానిక్స్ కోర్సుల ప్రతిపాదనలకు మోక్షం దక్కనుంది. పీజీ కళాశాల పూర్వ విద్యార్థి ప్రిన్సిపల్ శివశంకర్ దృష్టిసారించి కోర్సులుసాధించేలా కృషి చేస్తున్నారు. ఇవి సుంజూరైతే డే కమ్, రెసిడెన్షియల్ తరగతులు కొనసాగే అవకాశాలున్నాయి.

ప్రతిపాదనలు పంపించాం:
శివశంకర్, ప్రిన్సిపల్ పీజీ కళాశాల మిర్జాపూర్(బి)
కళాశాలకు కో-ఎడ్యుకేషన్ మంజూరైంది. ఇక కొత్త కోర్సుల కోసం ఉస్మానియా విశ్వ విద్యాలయం సహా సంబంధిత ఉన్నతాదికారులకు ప్రతిపాదనలు పంపించాం. ఆగస్టు, సెప్టెంబరులో సీపీ గేట్ ప్రవేశ అర్హత పరీక్ష ఫలితాల తర్వాత కొత్త కోర్సులు దాదాపుగా మంజూరు కానున్నాయి.