Sai Export Workers Demand Salary Hike
సాయి ఎక్స్పోర్ట్ కంపెనీ కార్మికుల వేతనాలు పెంచాలి
నర్సంపేట,నేటిధాత్రి:
హైదరాబాదు నగర నడిబొడ్డు మీద ఉన్న నాచారం పారిశ్రామిక ప్రాంతంలోని సాయి ఎక్స్పోర్ట్ కంపెనీ సుమారు 2000 మంది కార్మికులు తమ వేతనాలను పెంచాలని గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ యాజమాన్యం మొండిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు గురువారం నాడు కార్మికుల ధర్నా శిబిరాన్ని సందర్శించిన ఐఎఫ్టియు ప్రతినిధి బృందం తరపున ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. గత రెండు దశాబ్దాలుగా సాయి ఎక్స్పోర్ట్ కమిటీలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాల చట్టం అమలు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 ఏళ్లుకాలం గడుస్తున్న కార్మికుల వేతనాలు రూ10 వేల లోపే పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 90 శాతం మహిళా కార్మికులు ఉన్నప్పటికీ వారికి కనీస రక్షణ చర్యలు లేవని ఫలితంగా తీవ్ర వివక్షకు వేధింపులకు గురవుతున్నారని ఆరోపించారు.
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా ఈ సమస్యపై స్పందించాలని లేబర్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగి కార్మికుల యాజమాన్య తో చర్చించి సమస్య పరిష్కారానికి పూనుకోవాలని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి చట్టాలు అమలు చేయకుండా కార్మికుల కనీస హక్కులను హరిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేసి సాయి ఎక్స్పోర్ట్ కంపెనీలో చట్టాలు అమలయ్యే విధంగా తగిన చర్యలు చేపట్టాలని అందులో భాగంగానే కనీస వేతనం కింద ఒక్కో కార్మికుడికి కనీస వేతనం రూ. 26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని మహిళా కార్మికులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. లేనియెడల కార్మికులకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం కావాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ ప్రతినిధి బృందంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అరుణ, నాయకులు కావేరి, మల్లన్న, ఇంద్రసేనారెడ్డి, శ్రీశైలం, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
