
Grand Celebration of Saddula Bathukamma
సందడితో ముగిసిన సద్దుల బతుకమ్మ
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో బతుకమ్మ సంబరాలను మహిళలు చప్పట్ల సందడితో చందమామ పాటలతో తీరొక్క పూలతో. బ్రతుకు నిచ్చే బతుకమ్మ పండుగను ఆయా గ్రామ శివారులలో మహిళలందరూ ఒక్కటై గౌరమ్మను బ్రతుకమ్మలో అందంగా పేర్చి బతుకమ్మ పండుగను తమలో ఉప్పొంగిన రెట్టింపు ఉత్సాహంతో చిందులేసి అనంతరం గ్రామాలలోని వాగులు చెరువులలో బతుకమ్మను పోయి రావమ్మ అంటూ సాగనంపారు. మొగుళ్లపల్లి మండలంలోని మహిళలంతా బతుకమ్మ పండుగ శుక్రవారంతో ముగియనుండడంతో. మహిళలంతా. బతుకమ్మ చందమామ బంగారి బతుకమ్మ చందమామ అంటూ మొదలైన బతుకమ్మ ఆట పాటలు తో పోయిరా బతుకమ్మ పోయిరావమ్మా అంటూ సాగనంపడంతో సంబరాలు ముగుస్తున్నాయి.గ్రామాలలో పొద్దు వాలంగానే ఏ దిక్కుచూసిన తొమ్మిది రోజులు బతుకమ్మ ఆటపాటలు కనిపించాయి. రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో వాడలన్నీ పూల వాసనగా మారాయి. చెరువు గట్లు వాగులు ఆనందంతో ఉప్పొంగాయి. సద్దుల బతుకమ్మ సాగడంపడానికి ఆడిబిడ్డలంతా అత్త ఇంటి నుంచి పుట్టింటికి వచ్చారు. పొద్దు పొడవుకు ముందే ఇల్లు వాకిలి సర్దుకొని పట్టు బట్టలతో ఆనందంగా ముస్తాబయి, అన్నదమ్ములు తెచ్చిన గునుగు, గన్నేరు, తంగేడు, సీత జడ, బంతి, చామంతి తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా పేర్చి గ్రామ శివారులలోని ఆహ్లాదకరమైన వాతావరణం లో బతుకమ్మ వెలుగుల్లో ఆనందంగా బతుకమ్మను కొలిచిన మహిళలు పాటలు పాడుతూ. గ్రామ శివారులలోని వాగులు చెరువులలో పోయిరా పోయిరా అంటూ బతుకమ్మను సాగినంపారు.