రౌడీషీటర్ ను కమిషనరేట్ నుంచి బహిష్కరణ
ఆరు నెలల పాటు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి నుంచి వెలివేత
సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు
వరంగల్ నేటిధాత్రి
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజా శాంతి, భద్రతలకు భంగం కలిగిస్తున్న రౌడీషీటర్‌పై పోలీస్ కమిషనరేట్ తొలిసారిగా కఠిన చర్యలు చేపట్టింది. మీల్స్ కాలనీకి చెందిన రౌడీషీటర్ వంచనగిరి సురేష్ @ కోతి సురేష్ (31)ను ఆరు నెలల పాటు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి నుంచి బహిష్కరిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం–1348 ఫస్లి (వరంగల్ మెట్రోపాలిటన్ ఏరియా పోలీస్ చట్టం–2015)లోని సెక్షన్ 26(1) ప్రకారం ఈ బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర్వుల అనంతరం మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్ఐ మిథున్లు నిందితుడు కోతి సురేష్‌కు వరంగల్ పోలీస్ కమిషనరేట్ సరిహద్దులో బహిష్కరణ ఉత్తర్వులను అందజేశారు.
మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన వంచనగిరి సురేష్ రౌడీషీటర్‌గా గుర్తించబడిన వ్యక్తి కాగా, అతనిపై గతంలో పలు తీవ్రమైన నేర కేసులు నమోదై ఉన్నట్లు పోలీస్ రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇతని అక్రమ కార్యకలాపాల వల్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొనగా, ఫిర్యాదులు చేయడానికీ ప్రజలు భయపడుతున్న పరిస్థితి ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కారణాలు చూపించాలని నోటీసులు జారీ చేసినప్పటికీ, నిందితుడు సంబంధిత అధికారుల ఎదుట హాజరుకాలేదని, ఎలాంటి వ్రాతపూర్వక వివరణ కూడా ఇవ్వలేదని తెలిపారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించిన పోలీసులు, అతని ప్రవర్తన ప్రజా శాంతి భద్రతలకు తీవ్ర ముప్పుగా మారిందని నిర్ధారించారు.
అందువల్ల ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని, వంచనగిరి సురేష్‌ను వెంటనే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి నుంచి ఆరు నెలల కాలానికి బయటకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. కోర్టు హాజరు సందర్భంలో మాత్రమే ముందస్తు అనుమతితో కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశించేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు కొనసాగుతాయని కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ హెచ్చరించారు. ప్రజలు భయభ్రాంతులకు లోనుకాకుండా నేరాలపై సమాచారం పోలీసులకు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
