
Godavari Flood Havoc
వరద ప్రవాహంతో నీట మునిగిన రోడ్లు.. నాటుపడవలపైనే రాకపోకలు
అల్లూరి జిల్లా విలీన మండలాల్లో రహదారులపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో చింతూరు, వీఆర్ పురం మండలాల పరిధిలో 40 లోతట్టు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలకు నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి.ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో బ్యారేజ్ వద్ద ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి వరద ఉధృతి ఉంది. బ్యారేజీ వద్ద నీటి మట్టం 13.40 అడుగులకు పెరిగింది. దీంతో అధికారులు బ్యారేజ్ 175 గేట్లు పూర్తిగా ఎత్తివేశారు. దాదాపు 12.25 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. వరద ప్రవాహంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. రోడ్లు నీటమునిగిపోవడంతో నాటుపడవలపైనే ప్రజలు రాకపోకలను సాగిస్తున్నారు.