రోడ్డు భద్రత మన అందరి బాధ్యత:ఝరాసంగం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కప్పాడ్ గ్రామ చౌరస్తా దగ్గర
ఝరాసంగం పోలీసుల ఆధ్వర్యంలో,సీఐ హనుమంతు మరియు ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ మరియు నాయకత్వంలో “ప్రాణాలతో చేరుకుందాం – రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం”ను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం రోడ్డు ప్రమాదాలను నివారించడం మరియు ప్రజల్లో రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించడం.ఈ సందర్భంగా విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు, ఆటో రిక్షా డ్రైవర్లు, కార్ డ్రైవర్లు మరియు సాధారణ ప్రజలకు రోడ్డు భద్రత నిబంధనలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, నాలుగు చక్రాల వాహనాల్లో సీటు బెల్టు వినియోగించాలి, మద్యం సేవించి వాహనం నడపకూడదు, వాహనం నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని స్పష్టంగా వివరించారు.అలాగే వేగ నియంత్రణ పాటించడం ఎంత ముఖ్యమో, పాదచారులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి వాహనదారుడిపై ఉందని తెలియజేశారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు హెచ్చరిక జారీ చేశారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు, ప్రాణనష్టానికి దారి తీస్తుందని తెలిపారు.రోడ్డు భద్రత నిబంధనల ఉల్లంఘన చట్టపరమైన చర్యలకు మాత్రమే కాకుండా అమూల్యమైన ప్రాణాల నష్టానికి కారణమవుతుందని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా “రోడ్డు భద్రత మన అందరి బాధ్యత” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించి, తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చని పోలీసులు ప్రజలకు సూచించారు. అవగాహన కార్యక్రమం లో కప్పడ్ మాజీ సర్పంచ్ నందప్ప పటేల్ మాజీ ఎంపీటీసీ మహేందర్ గారు సర్పంచ్ కీర్తన ప్రభాకర్ మాకు ఉప సర్పంచ్ ఇస్మాయిల్ సాబ్ మరియూ గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది,
