భూపాలపల్లి లో లారీ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన

లారీ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన సదస్సు

భూపాలపల్లి జిల్లా ఎస్పీ సంకీర్త్

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆరివి అలైవ్ క్యాంపెనింగ్
2026” కార్యక్రమంలో భాగంగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మీడియా అవుట్‌రీచ్ డే కార్యక్రమాన్ని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్, భూపాలపల్లి నందు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో నిర్వహించబడగా, లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, బొగ్గు లారీ డ్రైవర్లతో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే అవుట్‌రీచ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,
మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, అందులో దాదాపు 50 వేల మంది సకాలంలో వైద్య సహాయం అందకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాల మేరకు జనవరి మాసం మొత్తం దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సూచనలతో “ 2026” పేరిట ఈ కార్యక్రమాన్ని రూపొందించామని, ఇది 13 జనవరి 2026 నుండి 24 జనవరి 2026 వరకు నిర్వహించబడుతున్నదని తెలిపారు. మీడియా అవుట్‌రీచ్ డే కార్యక్రమంలో ముఖ్యంగా “రహవీర్ – గుడ్ సమరిటన్” పథకం గురించి వివరించారు.
రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారిని సకాలంలో ఆసుపత్రికి తరలించకపోవడం వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రమాద స్థలంలో ఉన్న పాదచారులు లేదా వాహనదారులు, పోలీసులు ప్రశ్నిస్తారు, కోర్టులకు పిలుస్తారు అనే భయంతో సహాయం చేయడం లేదని పేర్కొన్నారు.
ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాల చట్టం – సెక్షన్ 134(A) ద్వారా గుడ్ సమరిటన్‌లకు పూర్తి రక్షణ కల్పించిందని, ప్రమాద బాధితులను ఆసుపత్రికి చేర్చిన వారి వివరాలను పోలీసులు అడగరాదని, కోర్టులకు హాజరు కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
గోల్డెన్ అవర్‌లో స్వచ్ఛందంగా రోడ్డు ప్రమాద బాధితులను ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి “గుడ్ సమరిటన్” బిరుదుతో పాటు రూ.25,000 నగదు బహుమతి అందజేస్తారని తెలిపారు. ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో గరిష్టంగా ఐదు సార్లు ఈ బహుమతిని పొందవచ్చని అన్నారు. అలాగే రాష్ట్రస్థాయిలో ఎంపికైన గుడ్ సమరిటన్‌లలో నుంచి మూడు పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయగా, ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వం రూ.1 లక్ష నగదు బహుమతి మరియు జాతీయ అవార్డు అందజేస్తుందని తెలిపారు.
అదేవిధంగా, జిల్లా ఎస్పీ లారీ, ఆటో, బొగ్గు లారీ డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడుతూ,
రోడ్డు ప్రమాదం ఒక్క డ్రైవర్‌కే కాకుండా ఆయనపై ఆధారపడి ఉన్న మొత్తం కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అన్నారు. ప్రమాదాల్లో గాయాలు లేదా మరణాలు సంభవిస్తే, కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు, ఉపాధి కోల్పోవడం, కుటుంబ పోషణలో సమస్యలు, పిల్లల చదువు దెబ్బతినడం, మానసిక వేదన వంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ రోడ్డు రవాణా జిల్లా అధికారి ఎండి సంధాని ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందు. సీఐ నరేష్ కుమార్ ఎస్సై సాంబమూర్తి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version