‘తరుగు లేకుండా..వరి ధాన్యం కొనుగోలు చేయాలి’
కల్వకుర్తి / నేటి ధాత్రి:
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తాలో మంగళవారం మధ్యాహ్నం వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు మహబూబ్ నగర్ చౌరస్తాలో వరి ధాన్యం రోడ్డుపై పోసి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ..

వరి ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు వ్యాపారస్తులు ఒక బస్తాకు మూడు నాలుగు కేజీల తరుగుదల తీస్తున్నారని.. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ఆరుగాలం కష్టించి పనిచేస్తే.. వ్యాపారస్తులు తమని మోసం చేస్తున్నారని వాపోయారు. ప్రజా పాలనలో ప్రజలకు మేలు చేస్తున్నామని చెప్పే కాంగ్రెస్ పార్టీ నాయకులు.. తమకు అన్యాయం జరుగుతుంటే ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన చెందారు. ‘జై జవాన్.. జై కిసాన్’ ‘తరుగు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలి’ అంటూ.. రైతులు నినాదాలు చేశారు. రైతుల ధర్నాతో.. ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. రైతు సంఘాల నాయకులతో మాట్లాడి ధర్నా విరమింప చేశారు.