*ప్రజా సంక్షేమం పట్టని రేవంత్ సర్కార్ *
6గ్యారంటీలను అమలు చేయాలని తాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై నిలదీయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక
ఎం సిపిఐ( యు )డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రజా సంక్షేమం పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపులేదని ఎం సిపిఐ(యు)డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి ఆరోపించారు.తెలంగాణలో ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ,తెలంగాణ వ్యాప్తంగా ఎం సిపిఐ( యు) పార్టీ చేపట్టిన తాహాసిల్దార్ కార్యాలయాల ముందు ఆందోళనలో భాగంగా శుక్రవారం నర్సంపేట తహసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కొత్తకొండ రాజమౌళి మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్రం,రాష్ట్రంపై చూపిన బడ్జెట్లో వివక్షపై అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకువెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు .మిర్చి రైతులకు గిట్టుబాటు ధరలేక అనేక సమస్యలతో సతమతమవుతున్నారన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి సారించి ప్రజలను గట్టెక్కించాలని ఆయన కోరారు .లేనిపక్షంలో ఉద్యమాలు తీవ్రతరం అవుతాయని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకుడు కలకోట్ల యాదగిరి,గుర్రం రవి,గొర్రె సామ్యెల్, పెండ్యాల యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
దుగ్గొండి మండలంలో..

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలును వేగవంతం చేయాలని ఎం సిపిఐయు రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాబురావు డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల అమలును వేగవంతం చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఏ విధమైన షరతులు లేకుండా అర్హులందరికీ అందేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కుసుంబ బాబురావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా దుగ్గొండి మండల తహసిల్దార్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పలు డిమాండ్లతో కూడిన మెమొరండాన్ని సమర్పించారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల సహాయ కార్యదర్శి ఎల్లబోయిన రాజు,సీనియర్ నాయకులు పేరబోయిన చేరాలు, బత్తిని కుమారస్వామి,పకిడె చందర్రావు తదితరులు పాల్గొన్నారు