ఆకర్షణీయంగా నిలిచిన బోనాల ప్రదర్శన.
నర్సంపేట/దుగ్గొండి, నేటిధాత్రి :
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా దుగ్గొండి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో వినూత్న రీతిలో వేడుకలను నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాలను ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న క్రమంలో పదో తరగతికి చెందిన విద్యార్థినిలు తెలంగాణ సాంప్రదాయ సంస్కృతిని అద్దంపట్టే విధంగా వినూత్న రీతిలో పట్టుచీరలు ధరిస్తూ బోనాలను నెత్తిన ధరించి గ్రామంలోని పురవీధుల్లో ప్రదర్శించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన సంస్కృతి సమావేశంలో విద్యార్థినిలు బోనాలతో ప్రదర్శించిన నృత్యప్రదర్శన అక్కడి విద్యార్థులను ప్రజలను విద్యార్థుల తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామస్వామి,పిఆర్టియు మండల అధ్యక్షుడు పరపాటి సుధాకర్ రెడ్డి,రెడ్డి ప్రవీణ్, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముందుగా పలు క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు దుగ్గొండి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దోర్నాల రమేష్ చేతుల మీదుగా బహుమతులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అందజేశారు.