
నకిలీ విత్తనాలు విక్రయ దారులపై కఠినంగా వ్యవహరించాలి
టాస్క్ ఫోర్స్ టీములు నిరంతరం తనిఖీలు చేపట్టాలి
భూపాలపల్లి నేటిధాత్రి
నకిలీ విత్తనాలు అమ్మితే పీడి యాక్ట్ నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. గురువారం సమీకృత కలెక్టర్ కార్యాలయపు సమావేశపు హాలులో వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో ఫెర్టిలైజర్ డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో నకిలీ విత్తనాలు నియంత్రణ చర్యలపయో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ రైతులకు డీలర్లు, ఫెర్టి లైజర్ షాపు యజమానులు నకిలి, కాలం చెల్లిన విత్తనాలు, ఎరువులు, నిషేధిత పురుగు మందులు విక్రయించొద్దని తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మినట్లైతే అలాంటి వారిపై పీడి యాక్ట్ నమోదు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ నిభంధనల ప్రకారం నడుచుకోవాలని రైతులకు నష్టం కలిగిస్తే సహించబోమని తెలిపారు. మార్కెట్ లోకి నకిలీ విత్తనాలు, పురుగుమందులు విక్రయాలు జరుగకుండా వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి రోజు జిల్లాలో ఏదో ఒక చోట ఫెర్టి లైజర్ షాపులలో వ్యవసాయ శాక అధికారులు తనిఖీలు చేపట్టి నివేదిక అందజేయాలని తెలిపారు. నకిలీ విత్తనాలను అరికట్టడం కోసం జిల్లాలో పోలీస్, వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక టాస్క్ పోర్స్ టీం ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నకిలి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. వ్యాపారులు రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని కృత్రిమంగా విత్తనాల కొరత సృస్టించే అవకాశం ఉందని అక్రమంగా విత్తనాలు, ఎరువులు నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్సులను రద్ధు చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులకు విత్తనాలు అమ్మేటప్పుడు రైతులకు రశీదు తప్పకుండ ఇవ్వాలని రశీదులో రైతు పేరు, ఏ కంపనీ విత్తనాలు అనే విషయాలు తప్పకుండ రాయాలని, రైతు నుండి సంతకం తీసుకోవాలని, పత్తి విత్తనాలు స్టాక్ షాపులోకి రాగానే ఇన్వాయిస్ బిల్లులను సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు పంపించాలని రిజిస్టర్ నిర్వహించాలని అన్నారు. ఓ.ఎల్.ఏం.ఎస్ పోర్టల్ లో విత్తనాల వివరాలు ప్రతి నెల 5వ తేదీన స్టాక్ అమ్మకం వివరాలను నమోదు చేయాలని తెలిపారు. గత సంవత్సరం విత్తనాలు, పురుగు మందులు ఏవైన నిల్వలు ఉంటే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
జిల్లాఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6 కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. మన జిల్లా మహా రాష్ట్ర, ఛత్తీష్ ఘడ్ సరిహద్దు జిల్లా కావడంతో కొంత మంది దళారులు ముఠాలుగా ఏర్పడి రైతులకు తక్కువ డబ్బుకు విత్తనాలు ఇస్తామని ఆశ చూపి నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారని, అలాంటి వ్యక్తుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని అలాంటి వ్యక్తుల సమాచారం పోలీసులకు అందించాలని తెలిపారు. సరియైన ప్యాకింగ్ లేకుండా రకరకాల పేర్ల తో ఉన్న విత్తనాలు రైతులు కొనొద్దని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి విజయ భాస్కర్, వ్యవసాయ అధికారులు, ఫెర్టి లైజర్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.