`అమల్లోకి నూతన విధానం
`రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నూతన ఒరవడికి శ్రీకారం
`ఇకపై పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు
`ఒత్తిళ్లకు, అక్రమాలకు తావు లేకుండా వెసులుబాటు
`ఎవరికి వారే దస్తావేజులు పూర్తి చేసుకునేందుకు మార్గం
`మధ్య వర్తుల జోక్యం లేకుండా ప్రక్రియ పూర్తికి మార్గ నిర్దేశనం
`అవకతవకలు జరగకుండా పూర్తి భరోసాతో ఆస్థులు భద్రం
`స్థిరాస్తుల మీద ప్రజలకు ఎలాంటి భయం లేకుండా కొత్త నిర్ణయం
`ఏడాది క్రితమే చెప్పిన నేటిధాత్రి
`ఇలాంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ రాబోతోందని చెప్పిన నేటిధాత్రి
`ప్రజలకు మేలు జరగాలన్నదే మంత్రి ‘‘పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి’’ ఆలోచన
`ఎన్ని ఒత్తిళ్లొచ్చినా వెనుకడుగు వేయకుండా అమలు చేస్తున్న ‘‘మంత్రి’’
`అవాంతరాలు ఎన్ని ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతున్న ‘‘మంత్రి పొంగులేటి’’
`సరికొత్త రిజిస్ట్రేషన్ విధానంపై ప్రజల ప్రశంసలు
`మంత్రి ‘‘పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి’’ కి జనం నుంచి అందుతున్న అభినందనలు
`రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సమూల మార్పులకు మంత్రి ఆదేశం
`త్వరలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు
`రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలకు అందుబాటులోకి మరిన్ని సేవలు
`కార్యాలయాలలో గౌరవంగా ప్రజలకు సౌకర్యాలు
హైదరాబాద్,నేటిధాత్రి:
భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో రాష్ట్రప్రభుత్వం విప్లవాత్మకమైన ఆవిష్కరణను తీసుకొచ్చింది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిరచి, కొత్త తరహా రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టింది. గతంలో ఎదురైన అనుభవాలు,సవాళ్లు, ఇబ్బందులు అదిగమించి, ఎలాంటి సమస్యలు భవిష్యత్తులో ఎదురుకాకుండా కొత్త తరహా విధానాన్ని తీసుకొచ్చింది. అందు కోసం రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పట్టుదల, కృషి ఫలించింది. ప్రజలకు రిజిస్ట్రేషన్ విషయంలో ఎలాంటి బాధలు భవిష్యత్తులో ఎదురుకావొద్దన్న మంచి ఉద్దేశ్యంతో ఈ తరహా విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రయోగాత్మకమైన విధానం మూలంగా ఎవరికీ ఎలాంటి సమస్యలు ఎదురుకావు. ప్రజల స్ధిరాస్ధుల విషయంలో గందరగోళానికి తావుండదు. పైగా ఒకరి భూములు, మరొకరు ఎట్టిపరిస్ధితుల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ఆస్కారం లేదు. వీలు అసలే కాదు. ఇకపై భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో చిన్న చిన్న పొరపాట్లకు కూడా తావులేని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిరచి రిజిస్ట్రేషన్లు చేయడం గొప్ప మార్పుగా చెప్పుకోవచ్చు. ఈ విధానం త్వరలో వస్తుందని నేటిధాత్రి ఏడాది క్రితమే చెప్పింది. సమీప భవిష్యత్తుల సులభతరమై, పకడ్భంధీ రిజిస్ట్రేషన్‌కు అవసరమైన నూతన విధానం అందుబాటులోకి రానున్నదని నేటిధాత్రి చెప్పడం జరిగింది. ఇప్పుడు అది వాస్తవ రూపం దాల్చింది. గతంలో రిజిస్ట్రేషన్ల విషయంలో నిత్యం వివాదాలు ఎదురౌతూ వుండేవి. ఇకపై అలాంటి సమస్యలన్నింటికీ చెక్ పడనున్నది. అక్రమాలకు తావులేకుండా, సజావుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుంది. అంతే కాదు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొన్ని నిమిషాల్లోనే పూర్తికానున్నది. రోజుల తరబడి రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పనిలేదు. అదికారులను బ్రతిమిలాడుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు జరిగినా, మళ్లీ మళ్లీ ప్రజలు పదే పదే కార్యాలయం చుట్టూ తిరిగి అలసిపోవాల్సి వుండదు. అధికారులకు ఇబ్బంది లేకుండా,ప్రజలకు సమస్యలు తలెత్తకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానం వచ్చేసింది. ఇదంతా ఇంత త్వరగా పూర్తి కావడానికి అమలులోకి రావడానికి మంత్రి పొంగులేటి కృషిని ప్రభుత్వ వర్గాలు కొనియాడుతున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ కొత్త టెక్నాలజీ ఎంతో దోహడపడుతుంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా వేగవంతమౌతుంది. నేటి నుంచి ఈ స్లాట్ బుకింగ్ అమలలోకి వచ్చింది. మొదటి దశలో 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ కొత్త తరహా ఆవిష్కరణ జరిగింది. దశలవారిగా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం అమలులోకి రానున్నది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అతి వేగంగా కావడమే కాకుంగా, అవినీతి ఆస్కారం లేకుండా వుంటుంది. ఇప్పుడున్న విమర్శలకు భవిష్యత్తులో వినేఅవకాశం వుండదు. ప్రజలకు లంచాల బెడద కూడా వుండదు. ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే ఇకపై దస్తావేజుల తయారీ కోసం ప్రజలు ఎవరి మీద ఆధాపడాల్సిన పని వుండదు. మధ్యవర్తులైన దళారుల చేతుల్లో మోస పోవడం అసలే వుండదు. ఎవరికి వారు స్వంతంగా దస్తావేజులుతయారు చేసుకునేందుకు వెబ్‌సైట్ ఏర్పాటుచేశారు. అందుకోసం ఒక మాడ్యూల్ ప్రవేశపెట్టారు. ఇది కూడా ఐచ్చికంగానే వుంటుంది. ఎందుకంటే గతంలో దస్తావేజుపైన అమ్మిన, కొన్న వాళ్ల సంతాకాలు, రిజిస్ట్రార్ సంతకాల కోసం ఇలా కార్యాలయం చుట్టూ తిరగడానికే సమయం చాల పట్టేది. ఇకపై ఆ గందరగోళం అంతా వుండదు. రిజిస్ట్రేషన్‌లో ఎలాంటి జాప్యానికి తావుండదు. ఒక్కసారి దస్తావేజులు పూరణ పూర్తి చేసి, స్లాట్ బుక్ చేస్తే ఇచ్చిన సమయానికి కార్యాలయానికి వెళ్తే సరిపోతుంది. పదినిమిషాల్లోపు రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఈ ప్రక్రియలో కూడా ఆదార్ ఇ` సంతకం ప్రవేశపెడుతున్నారు. ఈనెల చివరి లోగా ఈ సైన్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. గతంలో రెండు రెండుసార్లు రిజిస్ట్రేషన్ల వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యేవి. ఆ భూములు ఎవరివో తెల్చుకోలేక సతమతమయ్యేవారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇకపై భవిష్యత్తులో అలాంటిసమస్యలు వుండకపోవచ్చు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చట్టం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే డబుల్ రిజిస్ట్రేషన్ గోల ప్రతి రోజూ ఎక్కడో అక్కడ వుంటూనే వుంటుంది. అసలైన లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరుగుతూ వచ్చేది. భూమిని నమ్ముకొని తరతరాలుగా ఆధారపడుతున్న వారే కాదు, రియలెస్టేట్‌లో స్ధలాలు కొన్న వారికి ఈ డబుల్ రిజిస్ట్రేషన్ల వల్ల కేసులు, ఘర్షణలు జరుగుతుండేవి. ఆ కుటుంబాలు ఆర్ధికంగా చితికిపోయేవి. రూపాయి రూపాయి కూడబెట్టుకున్నవారి భూములను ఇతరులు అసలు యజమానులకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిసి ప్రాణాలు పోగొట్టుకున్నవారు కూడా వున్నారు. కుటుంబాలు వీధినపడ్డ వారున్నారు. ఇకపై అలాంటి సమస్యలు ఏ కుటుంబం ఎదుర్కొకుండా కొత్త చట్టం తీసుకొచ్చేందుక ప్రభుత్వం సిద్దమౌతోంది. ఈ విషయంలో చాలా రాష్ట్రాలు కొన్ని ప్రత్యేకమైనచట్టాలను అమలు చేస్తున్నాయి. వాటిన్నింటినీ అధ్యయం చేసి, అందుల్లో ఉత్తమైన చట్టాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమౌతోంది. తెలంగాణలో కూడా త్వరలో ఈ చట్ట సవరణ చేపట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో కసరత్తు జరగుతోంది. అధికారుల అద్యయనం సాగుతోంది. రిజిస్ట్రేషన్ చట్టంలో వున్న సెక్షన్ 22కు అదనంగా 22`బి తీసుకురానున్నారు. దీని వల్ల ఇకపై డబుల్ రిజిస్ట్రేషన్ అనేదానికి ఆస్కారం లేకుండా వుంటుంది. అవసరమైనంత సిబ్బంది లేకుండా ఇబ్బందులుపడుతున్న కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని కూడా నియమించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. దాంతో స్టాట్‌విధానంలో జరిగే వేగవంతమైన రిజిస్ట్రేషన్ కోసం అదనపు ఉద్యోగుల వల్ల ఏక కాలంలో ఎక్కువ రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకే రోజు, ఒకే సమయంలోఎక్కువ దస్తావేజులు రిజిస్ట్రేషన్ కోసం సమర్పించడం వల్ల జరిగే జాప్యాన్ని సునాయాసంగా అధిగమించేందుకు వీలౌతుంది. అదనపు ఉద్యోగుల నియామకం కూడా తొలుత మేడ్చల్`మల్కాజిగిరి, కుత్భుల్లాపూర్‌లో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లతోపాటు, ఇతర సిబ్బందిని నియమించనున్నారు. దీని వల్ల కుత్భుల్లాపూర్‌లో 144 స్టాట్స్ ఏకకాలంలో అందుబాటులోకి వస్తాయి. తెలంగాణలోని 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలోవున్న 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు త్వరలోఈ విధానాన్ని విస్తరిస్తే ఇక రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాల వేగవంతమౌతుంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రభుత్వ భవనాలు కూడా నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటి వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అద్దె భవనాల్లోనే ఎక్కువగా వున్నాయి. చాలీ చాలని సౌకర్యాలతో వుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఇన్ని సంవత్సరాలైనా సొంత భవానాలు లేకపోవడం గమనార్హం. అద్దె ఇళ్లలో కార్యాలయాలు వుండడం వల్ల ప్రజలు అనేకు సమస్యలు ఎదుర్కొనే వారు. కార్యాలయంలో నిలుచులేక, కార్యాలయం సమీపంలో వున్న చెట్ల నీడన ఎదురుచూస్తూ వుండేవారు. వానొచ్చినా, ఎండ కాచినా రోజలు తరబడి ఎదురుచూడాల్సిన పరిస్దితులు కూడా వుండేవి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరే రిజిస్ట్రేషన్లు. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం సమకూర్చే ప్రజలు కార్యాలయంలో కనీసం నిలబడే పరిస్దితి వుండదు. మంచి నీటి సౌకర్యం వుండదు. ఉద్యోగులు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలను కసురుకుంటూ, చీదరించుకంటూ వుండే విధానానికి త్వరలో స్వస్తి పలుకనున్నారు. కొత్త కార్యాయాలను నిర్మాణం చేసుకొని, రిజిస్ట్రేషన్లకోసం వచ్చే ప్రజలకు కూర్చునేందుకు సౌకర్యాలు కల్పించనున్నారు. అంతే కాదు అక్కడికి వచ్చిన ఉద్యోగులు ప్రజలను గౌరవంగా చూసుకునే విధానం తీసుకురానున్నారు. ఇప్పుడు రిజిస్ట్రార్ కార్యాలయంలో కనీసం మాట్లాడుకునే వీలు కూడా వుండదు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ప్రజలకు స్వేచ్చాయుత వాతావరణం కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వుండేలా చూస్తున్నారు. ప్రజలకు గౌరవం కల్పించనున్నారు. కొత్త విధానం వల్ల అవినీతి తగ్గుతుంది. కొత్త కార్యాలయాల వల్ల ప్రజలకు గౌరవం దక్కుతుంది. రిజిస్ట్రేషన్ల ప్రకియ చాలా వేగంగా మారుతుంది.