
Rampant black market business....!
*విచ్చలవిడిగా బ్లాక్ మార్కెట్ దందా….!*

*జహీరాబాద్ నేటి ధాత్రి:*
జహీరాబాద్ న్యాల్కల్ మొగడంపల్లి కోహిర్ ఝరాసంగం మండలంలో గుట్కా వ్యాపారం జోరుగా సాగుతున్నది. పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎగిరి మరీ ఎక్కిరిస్తుందన్న సామెతలా తయారైంది ఇప్పుడు అక్రమ గుట్కా వ్యాపారుల తీరు.గుట్కా అమ్మగాలపై నిషేధం ఉన్నప్పటికీ సంబంధిత శాఖల అధికారుల నిఘా లేకపోవడంతో మండలంలో విచ్చలవిడిగా గుట్కా అమ్మకాలు చేపడుతూ లక్షల రూపాయల సొమ్ము చేసుకుంటున్నారు. గుట్కా వ్యాపారులు అక్రమంగా అమ్మకాలు చేపట్టొద్దని సంబంధిత అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. ఇటీవల కాలంలో దీనిపై అధికారులు ఎవరూ అజమాషి చేయకపోవడంతో అక్రమ వ్యాపారులు ఆడింది ఆట పాడిందే పాటగా వ్యాపారం గుట్టుగా కొనసాగుతుంది.
*- కిరాణా షాపుల్లో పుష్కలంగా గుట్కా అమ్మకాలు*
మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లోని కిరాణా షాపుల్లో, పాన్ షాపులలో నిషేధ గుట్కాలను పుష్కలంగా అమ్ముతున్నారు. అధికారులు ఎవ్వరు కిరాణా, పాన్ షాపులపై కన్నెత్తి కూడా చూడకపోవడంతో వారి వ్యాపారం మూడుపువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతోంది. ఈ గుట్కాలు అమ్ముతున్న వారు ఇతర రాష్ట్రాల నుండి ఎంతో గోప్యంగా తీసుకువచ్చి చిరు వ్యాపారులు,పాన్ షాప్ లకు అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వీటిని కొనుగోలు చేస్తున్న పాన్ షాప్, చిల్లర దుకాణాల వ్యాపారులు వారు కొన్న ధరల కంటే రెండు రెట్లు లాభాన్ని చూసుకుని గుట్కా ప్రియులకు విక్రయిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
*- గుట్కాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?*
ఈ నిషేధిత గుట్కాలు మండలానికి ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి అంటే చత్తీస్గడ్ నుండి మండలంలోని స్వర్ణ గ్రామానికి వస్తున్నాయనే వినికిడి వినిపిస్తోంది. అక్కడ నుంచి ప్రతినిత్యం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. గుట్కా వ్యాపారం చేస్తున్న వ్యక్తి అధికార పార్టీ నాయకుడి అండదండలతో ఈ గుట్కా రవాణా చేస్తు ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా అక్రమ వ్యాపారం చేస్తున్నాడన్న ఆరోపణలు వున్నాయి. గుట్కా వ్యాపారం చేస్తున్న వ్యక్తి సంబంధిత శాఖ అధికారులకు ముడుపులు అందించడంతో సంబంధిత శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మహారాష్ట్ర కూడా ప్రతినిత్యం వాహనాల్లో గుట్కాను అక్రమ వ్యాపారం చేస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. మండల గ్రామాల కేంద్రంగానే గుట్కా దందా జోరుగా సాగుతుందని మండల వాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుట్కా నిషేధాన్ని అరికట్టాలని మండల వాసులు కోరుతున్నారు.