Rahul Gandhi Alleges 25 Lakh Fake Votes in Haryana
బిహార్ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ మళ్లీ ఓట్ల చోరీ ఆరోపణలు! 25 లక్షల ఫేక్ ఓట్లంటూ..
రాహుల్ గాంధీ మరోసారి ఓట్ల చోరీ అంశాన్ని లేవనెత్తారు. గతేడాది హర్యానా ఎన్నికల సందర్భంగా వ్యవస్థాగత స్థాయిలో అవకతవకలు జరిగాయని అన్నారు. అక్కడ ప్రతి 8 ఓట్లలో ఒకటి ఫేక్ అని ఆరోపించారు.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి అధికార బీజేపీ, ఎలక్షన్ కమిషన్లపై విరుచుకుపడ్డారు. గతేడాది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. 100 శాతం పక్కా ఆధారాలతో ఈ ఆరోపణలు చేస్తున్నానని అన్నారు (Rahul Gandhi Vote Chori Allegations). కాంగ్రెస్ గెలుపును ఓటమిగా మార్చేందుకు వ్యవస్థాగత స్థాయిలో అవకతవకలు చోటుచేసుకున్నాయని అన్నారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఎలక్షన్ కమిషన్ వర్గాలు రాహుల్ గాంధీ ఆరోపణల్ని కొట్టిపారేశాయి. ఎన్నికల సమయంలో ఓటర్ జాబితాపై ఒక్క అప్పీల్ కూడా రాలేదని గుర్తు చేశాయి. హర్యానాలో 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అయితే, పంజాబ్ హర్యానా హైకోర్టులో మాత్రం కేవలం 22 ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. అంటే, ఎన్నికల ఫలితాలకు న్యాయపరమైన సవాళ్లు పరిమితమనేందుకు ఇది సూచనని ఈసీ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.
