
Aadhaar
ఆధార్లో సమూల మార్పులు
ఆధార్లో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. మొబైల్ సిమ్, బ్యాంకు ఖాతా, పాస్పోర్టు, ధ్రువీకరణ పత్రాలు, సంక్షేమ పథకాలు.. ఇలా ఎన్నో అవసరాలకు…
- వివరాల్లోంచి తండ్రి/భర్త పేరు తొలగింపు
- పుట్టిన తేదీకి బదులు పుట్టిన సంవత్సరం మాత్రమే!
- యూఐడీఏఐ ఉత్తర్వులు.. ఇప్పటికే అమల్లోకి
ఆధార్లో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. మొబైల్ సిమ్, బ్యాంకు ఖాతా, పాస్పోర్టు, ధ్రువీకరణ పత్రాలు, సంక్షేమ పథకాలు.. ఇలా ఎన్నో అవసరాలకు గుర్తింపుగా తీసుకునే ఆధార్ కార్డులపై ఇక నుంచి తండ్రి/భర్త పేరు ఉండదు. ఆధార్లో పేరు కింద ఉండే ఈ వివరాలను తొలగించారు. నిజానికి మొదట్లో తండ్రి/భర్త పేరు అని ఉండేది. తర్వాత కేరాఫ్ అని మార్చారు. ఇప్పుడు పూర్తిగా తొలగిస్తూ ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)’ నిర్ణయం తీసుకుంది.
ఇక నుంచి కొత్త ఆధార్ నమోదులో తండ్రి/భర్త వివరాలు సమర్పించాలని కోరబోమని యూఐడీఏఐ తెలిపింది. అలాగే పుట్టినతేదీకి బదులు ఇకనుంచి కేవలం పుట్టిన సంవత్సరాన్నే నమోదు చేస్తారు. దీనికి సంబంధించి యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ హిమాన్షు ఉత్తర్వులు జారీచేశారు. కొత్త మార్పులను గతంలోనే పేర్కొనగా.. ఈ నెల 18 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే తండ్రి/భర్త పేరు ఉన్న ఆధార్ కార్డులను అప్డేట్ చేస్తే ఆ పేర్లు తొలగించబడతాయి. అలాగే పుట్టినతేదీ స్థానంలో పుట్టిన సంవత్సరం మాత్రమే వస్తుంది. 18 ఏళ్లలోపు ఉండే పిల్లల (మైనర్ల) ఆధార్లోనే మాత్రమే కేరాఫ్ స్థానంలో వారి తండ్రి పేరు ఉంటుంది.