ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని చౌటుపర్తి గ్రామపంచాయతీ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బడిబాట గ్రామసభను మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోడెం రాజేందర్ బాబు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నడికూడ మండల విద్యాశాఖ అధికారి కె.హనుమంతరావు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తారు. అయితే దానికోసం మన ఊరిలో మనకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యను అందిస్తూ కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఐ ఎఫ్ పి టివి ప్యానెల్ ద్వారా డిజిటల్ విద్యాబోధన చౌటుపర్తి ప్రాథమికోన్నత పాఠశాలలో జరుగుతుంది. నిరంతర సమగ్ర మూల్యాంకనం,కృత్యాధార, అనుభవజ్ఞులైన అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులచే విద్య బోధన జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్,పాఠ్య పుస్తకాలు,వర్క్ బుక్కులు ఉచితంగా అందిస్తున్నారు, ప్రతిరోజు రుచికరమైన పౌష్టికాహారం మధ్యాహ్న భోజనం,వారానికి మూడు గుడ్లు,మూడు రోజులు రాగి జావా,ప్రతినెల తల్లిదండ్రుల ఉపాధ్యాయ సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు వివరించడం జరుగుతుంది. కావున విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తున్నందున గ్రామంలోని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి,ప్రభుత్వ బడి అభివృద్ధి చెందేటట్లుగా గ్రామంలోని ప్రజాప్రతినిధులు మహిళా సంఘాలు, యువజన సంఘాలు,పూర్వ విద్యార్థులు గ్రామంలోని పెద్దలు అందరూ కలిసి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచి ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని తెలిపారు.
ఈ సమావేశంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీమతి గూడెం రమ్య విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు,మహిళా స్వయం సహాయక సంఘాలు,అంగన్వాడీ టీచర్లు,పాఠశాల ఉపాధ్యాయులు,యువజన సంఘాల నాయకులు,పూర్వ విద్యార్థులు సమావేశంలో పాల్గొన్నారు.