“₹6,000 Crore Water Project and PMAY House Pattas Distributed in Palamaneru”
*రూ.6వేల కోట్లతో పడమటి నియోజకవర్గాల్లోని ఇంటింటికి శుద్ధి జలాలు..
*అర్హులందరికీ ఇళ్ళు మంజూరు..
*జగన్ నిర్ణయాలతోనే రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం..
*రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి బాబే కారణం….
*ఇంటి మంజూరు పత్రాల పంపిణి కార్యక్రమంలో ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి..
పలమనేరు (నేటి ధాత్రి)
చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంత నియోజకవర్గాలలో గల అన్ని గ్రామాలకు 6వేల కోట్లను ఖర్చు చేసి శుద్ధ జలాలను ఇంటింటికి అందించినట్లు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు.
పలమనేరు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో (పీ ఎం ఏ వై) ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం ద్వారా నియోజకవర్గంలోని (బైరెడ్డిపల్లికి చెందిన 59 మందికి, గంగవరం మండలం లోని 80 మందికి, పలమనేరు రూరల్ నందు 57 మందికి, పెద్దపంజాణి మండలానికి చెందిన 99 మందికి, వి.కోట మండలంలోని 8 మందికి అదేవిదంగా పలమనేరు అర్బన్ పరిధిలోని 108 మందితో కలిపి మొత్తం*) 411 మంది లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాలను బుధవారం ఆయన పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలతోపాటు గృహ నిర్మాణాలకు ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందిస్తాయన్నారు. గత ప్రభుత్వంలో లబ్ధిదారులు పూర్తిస్థాయిలో ఇళ్లను నిర్మించుకోలేకపోయారని అయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 2.89 లక్షలు ఇవ్వడం జరుగుతుందన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు. నేడు పెట్టుబడిదారులను ఆకర్షించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని దేశంలోని 25 శాతం పెట్టుబడులు రాష్ట్రానికి రావడానికి చంద్రబాబు ప్రధాన కారణమని వివరించారు. ఆదాయం పెరిగితే పేదలకు మరింత మంచి చేసేందుకు వీలుంటుందని తెలిపారు. ఇక శాశ్వత సాగు, తాగు నీటి పరిష్కారానికై కూటమి ప్రభుత్వం కృషిచేస్తోందని అందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతాలకు గండికోట రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని వచ్చే ఏడాది తీసుకొచ్చి ప్రతి ఇంటికి శుద్ద జలాలను అందించనున్నామని పేర్కొన్నారు. ఇంటి మంజూరు పత్రాలను పొందిన లబ్ధిదారులు త్వరితగతిన పనులు చేపట్టి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్వీ రమణారెడ్డి, హోసింగ్ డీఈ రాములు, మెప్మా అధికారి బాబా, పలమనేరు బాలాజీ కోపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ, నాయకులు విజయ భాస్కర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం గౌడ్,కుట్టీ, సోమశేఖర్ గౌడ్,నాగరాజు రెడ్డి, సుబ్రహ్మణ్యం శెట్టి,ఖాజా, గణేష్, శ్రీరాములు, సుధాకర్ రెడ్డి, రోజా రెడ్డి, గిరిబాబు, ప్రసాద్ నాయుడు, నాగరాజులతో పాటు జనసేన నాయకులు దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..
