
అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరగాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:
మానవ అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరగాలని మరొక వ్యక్తికి పునర్జన్మను ఇవ్వడానికి జీవన్ దాన్ మహాదానమని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.శనివారం తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్ శాఖ, టీ 9 ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్ పట్టణంలోని ఆబ్నుస్ ఫంక్షన్ హాల్ లో నేత్ర అవయవ శరీర దానం పై ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ముఖ్య అతిధిగా పాల్గొని, అతిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ అవయవ దానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. సమాజానికి మంచి చేయాలనే ఆలోచన కలగాలని, అవయవ దానంతో మరికొందరి జీవితాలలో వెలుగు నింపవచ్చునని, దీనిపై ప్రజల్లో ఇంకా అవగాహన కలగాలని చెప్పారు. అవయవదానం చేసిన వారు మహాత్ములని, చిరంజీవులుగా మిగిలిపోతారని సూచించారు.
ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో వైద్య విద్యార్థులు మానవ శరీరం పై ఫిజియాలజీ, అనటమి పరీక్షలు ఆచారాత్మకంగా చేయుటకు మానవ మృత దేహల అవసరం ఎంతో ఉందని, మానవ మృత దేహలు దానం చేయడం వల్ల వీటిని వినియోగించి మంచి వైద్యులను తయారు చేయ వచ్చునని కలెక్టర్ తెలిపారు. మనిషి చనిపోతే ఇక తిరిగి రారు, ఇక లేరు అనుకుంటారని, కానీ ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుండి 8 మందికి కొత్త జీవితాన్ని ఇస్తుందన్నారు. వేల మంది రోగులు తమకు అవసరమైన అవయవాలు సరైన సమయంలో లభించకపోవడంతో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి రక్తదానం చేసే విధంగానే ప్రతి ఒక్కరూ అవయవనానికి సైతం ముందుకు రావాలని కోరారు. జీతే జీతే రక్తదానం జాతే జాతే నేత్రదాన్, దేహ్ దాన్ చేయాలన్నారు.రోగిని బ్రతికించే వాళ్ళు డాక్టర్లు దేవతలైతే అవయవ దానం చేసిన వారు దైవదూతలన్నారు.అవయవ దానం పై అవగాహన కార్యక్రమాలను ఉదృతం చేయాలని కలెక్టర్ కోరారు. దాతలకు అవగాహన కల్పిస్తున్న వాలంటీర్లు, నిర్వాహకులు, అధికారులు వైద్య సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు, మాట్లాడుతూ అవయవ దానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.
తాము కూడా వైద్య విద్యార్థులుగా విద్యానభ్యసించిన సమయంలో మానవ మృతదేహాలపై ప్రాక్టికల్ గా పరీక్షలు నిర్వహించడం వల్ల ఈరోజు సమాజంలో రోగులకు పరిపూర్ణంగా శస్త్ర చికిత్సలు చేయగలుగుతున్నామన్నారు.నేటి వైద్య విద్యార్థులకు కూడా ప్రాక్టికల్ గా శస్త్ర చికిత్సలు నేర్పడానికి మానవ పార్థివ దేహాలు ఎంతో అవసరమని అన్నారు. అవయవ దానం చేయుటకు అంగీకరించడం,బ్రెయిన్‌డెడ్ అయిన వారి శరీరాలను ముందుకు వచ్చి మెడికల్ కాలేజీలకు ఇవ్వడం మంచి పరిణామం అని, దీని ద్వారా గొప్ప డాక్టర్లను తీర్చిదిద్దడం తో పాటు దైవం కూడా అనుగ్రహిస్తుందని తెలిపారు.ఈ సందర్భంగా అవయవ దానం చేయుటకు అంగీకరించిన వారికి శాలువాలతో కలెక్టర్ సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు,
కేఎంసీ, ఎంజీఎం నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ లు డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి, డాక్టర్ చిలుక మురళి, డాక్టర్ మోహన్ దాస్, డాక్టర్ కూరపాటి రమేష్,ప్రభుత్వ సూపర్డెంట్ డాక్టర్ భరత్ కుమార్, మైదం రాజు,తహసీల్దార్ ఇక్బాల్, నిర్వాహకులు, వాలంటీర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.