
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ పారా (దివ్యాంగుల) స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 1వ తేదీన హైదరాబాదులోని సరూర్ నగర్ లో నిర్వహించిన దివ్యాంగుల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికైన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలంలోని అంకుషా పూర్ గ్రామానికి చెందిన సాదా రఘు, పలిమేల మండలంలోని ముకునూరు గ్రామానికి చెందిన మట్టి సాగర్ లు తెలంగాణ రాష్ట్రం నుండి త్రో బాల్ క్రీడలో జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఎంపికయ్యారు క్రీడాకారులు జాతీయస్థాయికి వెళ్లే ఆర్థిక స్తోమత లేకపోవడంతో, వారి ప్రయాణ ఖర్చుల నిమిత్తం సింగరేణి భూపాలపల్లి ఏరియా క్రీడాకారులు సోమవారం జాతీయస్థాయి దివ్యాంగ క్రీడాకారులకు రూ. 12 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ మేరకు దివ్యాంగ జాతీయస్థాయి క్రీడాకారుడు సాధా రఘు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొయ్యడ కుమారస్వామి గౌడ్ లకు అందజేశారు. జాతీయస్థాయిలో ఎంపికైన ఇద్దరు దివ్యాంగ క్రీడాకారులు రఘు, సాగర్ లు ఈనెల 21 నుండి 23 వరకు జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ లో నిర్వహించే జాతీయస్థాయి పారా త్రో బాల్ పోటీలలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి క్రీడాకారుల సూపర్వైజర్ పర్శ శ్రీనివాస్, క్రీడాకారులు రమేష్ , వై తిరుమల, చంద్రశేఖర్, తిరుపతి, ప్రకాష్, రాజమౌళి, తదితరులు పాల్గొన్నారు