ప్రొఫెసర్ సాయిబాబా మృతి మానవహక్కుల ఉద్యమానికి తీరనిలోటు

జైల్లో సరైన వైద్యం అందించకుండా కేంద్రమే సాయిబాబాను హత్య చేసింది

సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు

కరీంనగర్, నేటిధాత్రి:

అణగారిన వర్గాలను పోరాటం వైపు నడిపించిన సేనాధిపతి సాయిబాబా అని, ఆయన మృతి పౌరహక్కుల ఉద్యమానికి తీరని లోటని సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజులు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ సాయిబాబా మృతిపై సోమవారం వారు స్పందిస్తూ సాయిబాబాది సాధారణ మృతికాదని కేంద్రం చేసిన హత్య అని ఆరోపించారు. తోంబై శాతం అంగవైకల్యంతో ఉన్న ఆయనపై నక్సలైటుగా ముద్రవేసి ఉపా చట్టం క్రింద ఏండ్ల తరబడి జైల్లో పెట్టి దుర్మార్గంగా వ్యవహరించిందని, అందువల్లే ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మృతి చెందారన్నారు. జైల్లో ఉన్న సమయంలో వారి మాతృమూర్తి మరణించిన అంత్యక్రియలు కూడా హాజరు కావడానికి బెయిలు ఇవ్వకుండా ఎన్డీఏ ప్రభుత్వం నిరాకరించిందని పేర్కొన్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన సాయిబాబా తోంబై శాతం అంగవైకల్యం కలిగిన వికలాంగత శరీరానికి కాదని మనసుకు కాదని భావించి ఉన్నత చదువులు చదివి ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఇంగ్లీష్ చాలా సంవత్సరాల పాటు బోధించారని ఒక మేధావిగా, రచయితగా, మానవహక్కుల కార్యకర్తగా, ఉద్యమకారుడిగా అంకిత భావంతో పని చేశారని కొనియాడారు. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సాయిబాబా పోరాడారని, వికలాంగులకు, దళితులకు, గిరిజనులకు, వెనుకబడిన వర్గాలకు అండగా, వారి హక్కులకోసం పోరాడిన సాయిబాబా మృతి ప్రజా పోరాటాలకు తీరనిలోటని, ఆయన మృతిపట్ల సంతాపాన్ని, కుటుంబసభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. పేద ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడేందుకు కృషి చేయాలని అదే ఆయనకు నిజమైన నివాళి కాగలదన్నారు. సాయిబాబా పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల కోసం గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించడం అభినందనీయం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *