ఆరోగ్య శ్రీ వైద్యం… కాసుపత్రులకు వరం!
`రూపాయి వైద్యానికి పది రూపాయల బిల్లులు.
`ప్రభుత్వం విడుదల చేసే నిధులకు చిల్లులు.
`చేయని వైద్యానికి దొంగ లెక్కలు.
`ప్రభుత్వం నిధులకు పెద్ద బొక్కలు.
`ప్రైవేటు ఆసుపత్రులకు పాలకుల ఊడిగం
`ఏటా వందల కోట్లు దిగమింగుతున్న ఆసుపత్రులు.
`ఆరోగ్య శ్రీ నిధులతో ఆసుపత్రుల అరాచకాలు!
`చేయని వైద్యానికి కోట్లు దిగమింగిన దొంగలు.
`ఇష్టానుసారం బిల్లులు వేసి కోట్లు కొల్లగొట్టిన ఆసుపత్రులు.
`గతంలో నోరు తెరవని ఆసుపత్రులు.
`ప్రజా ప్రభుత్వం మెతక వైఖరిని సొమ్ము చేసుకునే జిత్తులు.
`ఆరునెలల్లోనే ఏం కొంపలు మునిగిపోయాయని గగ్గోలు.
`ప్రభుత్వానికే అల్టిమేటమ్ జారీ చేసేంత ధైర్యమా?
`ఆరోగ్య శ్రీ వచ్చిన తర్వాతే పుట్టగొడుగుల్లా ఆసుపత్రులు ఏర్పాటు.
`అందుబాటులో నిపుణులు లేకపోయినా వున్నట్లు ప్రకటనలు.
`ప్రభుత్వం నుంచి ఆరోగ్య శ్రీ అనుమతులు పొంది అడ్డగోలు బిల్లులు.
`ఒక్కో ఆసుపత్రిలో నిత్యం పదుల సంఖ్యలో ఆపరేషన్లు అని లెక్కలు.
`నెలలో వందల ఆపరేషన్లకు బిల్లులు.
`ఒక్క ఆసుపత్రిలో రోజూ పదుల సంఖ్యలో ఆపరేషన్లు సాధ్యమా?
`చిన్న చిన్న ఆసుపత్రుల నుంచి కార్పోరేట్ ఆసుపత్రుల దాకా కాసుల దందా!
`ఆరోగ్య శ్రీ బిల్లుల కోసమే ఆసుపత్రులు పెట్టిన ముఠా.
`ప్రభుత్వ వైద్యులకు పెద్ద ఎత్తున కార్పోరేట్ ఆసుపత్రులలో వాటాలు.
`గతంలో జరిగిన విజిలెన్స్ ఎంక్వౌరీలు బైటకు తీయండి.
`దోపిడీకి పాల్పడిన ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేయండి.
`ఈ ఏడాది కాలంలో జరిగిన ఆపరేషన్లపై ఆరా తీయండి.
`వెంటనే కొత్త విజిలెన్స్ ఎంక్వౌరీ వేయండి.
`దోపిడీ ముఠాలను అరికట్టండి.
`ప్రైవేటు ఆసుపత్రులలో అంతా మోసమే!
`ఆరోగ్య శ్రీ నిధుల గోల్‌మాల్ కోసమే!
`ప్రభుత్వాల ఉదాసీనత కార్పోరేట్ ఆసుపత్రులకు వరమే.
`ప్రజా వైద్యం, సంక్షేమం కోసం ప్రభుత్వాల తపన
`ప్రభుత్వ నిధుల కోసం ఆసుపత్రుల యాతన
హైదరాబాద్,నేటిధాత్రి:
ఆరోగ్య శ్రీ పథకం పేదలు ఎంత మేలు చేసిందో..కార్పోరేట్ ఆసుపత్రులకు అంత కాసుల పంట పండిస్తోందని చెప్పడంలో సందేహం లేదు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న సదుద్దేశ్యంతో దేశంలోనే తొలిసారి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ పాలనలో ఆరోగ్యశ్రీకి అంకురార్పణ జరిగింది. పేదలకెంతో మందికి ఆ సమయం నుంచి ఆరోగ్యశ్రీ సంజీవనిగా మారింది. ఇంతవరకు బాగానే వుంది. కాని రాను రాను ఆరోగ్యశ్రీ పధకం పక్కదారి పడుతోంది. పేదలకు వైద్యం అందించడమేమో గాని, ప్రైవేటు ఆసుత్రులకు ఆదాయ మార్గంగా మారింది. నిజానికి ప్రభుత్వాలు ఎంతో ఉదాసీనతో పేదల ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదురుకాకూడదన్న సదుద్దేశ్యం ప్రైవేటు ఆసుపత్రులకు అలుసుగా మారింది. వైద్యుడంటే దేవుడు. ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగినప్పుడు వారికి సేవ చేయడం వారి విధి. వైద్యమంటే ఒకప్పుడు సేవ. కొంత ఉపాధి. కాని ఇప్పుడు వైద్యం వ్యాపారం. అందులోనూ అడ్డగోలు ఆదాయం. అడ్డూ అదుపు లేకుండా సంపాదనకు మార్గం. ఆరోగ్య శ్రీ వచ్చిన తర్వాత ఆ సంపాదనకు మరిన్ని రెక్కలొచ్చాయి. ఆసుపత్రులకు గొంతెమ్మ కోరికలొచ్చాయి. వైద్య వృత్తి ఎంచుకున్నవారు ఉపాధి మార్గం కోసం వైద్యం చేస్తారు. కాని ఆ వృత్తిలో నిబద్దత పూర్తిగా లోపిస్తోంది. ప్రజలను పీడిరచడమే లక్ష్యమైపోయింది. ప్రభుత్వానికి గుదిబండగా మారిపోయింది. ఆరోగ్య రాకముందు వున్న ఆసుపత్రులకు, ఈ ఇరవై ఏళ్లలో పెరిగిన ఆసుపత్రులను చూస్తే విస్తుపోవాల్సిందే. ప్రభుత్వం నుంచి తేరగా డబ్బులొస్తున్నాయి. చేసిన వైద్యానికి చేయని వైద్యానికి కూడా కాసులు కురుస్తున్నాయి. రూపాయి వైద్యానికి పది రూపాయలొస్తున్నాయి. ఒక్కసారిగా కోట్లు వచ్చి పడుతున్నాయి. ఇంతకన్నా మెరుగైన వ్యాపారం ఎక్కడుంటుంది? ఇంతకన్నా సంపాదనకు మార్గం ఎక్కడుంటుంది. ఒకప్పుడు వైద్యులే ఆసుపత్రులు, క్లినిక్‌లు పెట్టుకునేవారు. ఇప్పుడు వైద్యులే కాదు, వ్యాపార వేత్తలు పెద్దఎత్తున ఆసుపత్రులు నెలకొల్పుతున్నారు. ఆరోగ్య శ్రీ నిధులు కాజేస్తున్నారు. అటు ఇతర వైద్యానికి పెద్దఎత్తున నిదులు వసూలు చేస్తున్నారు. ఇటు ప్రభుత్వం నుంచి ఆరోగ్య శ్రీ నిధులు కొల్లగొడుతున్నారు. వైద్యం పేరుతో ప్రభుత్వాల నుంచి రాయితీలు పొందుతున్నారు. టాక్స్‌లు తప్పించుకుంటున్నారు. రూపాయి రాకడ తప్ప, పోకడ లేని వ్యాపారంగా మార్చుకున్నారు. ఒకప్పుడు ప్రైవేటు ఆసుపత్రలపై నియంత్రలుండేవి. ఇప్పుడు వాటి జాడే లేకుండాపోయింది. ఎప్పుడైతే ఆరోగ్య శ్రీ వచ్చి చేరిందో అప్పటి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల అక్రమాలకు లెక్కలేకుండాపోయింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రైవేటు ఆసుపత్రులు హెచ్చరికలు జారీ చేశాయి. ఆరోగ్య శ్రీ సేవలు బంద్ చేస్తున్నాంటూ ప్రకటనలిచ్చాయి. బకాయిలు విడుదల చేస్తే తప్ప వైద్యం చేయలేమని చేతులెత్తేశాయి. హుటాహుటిన ప్రభుత్వం దిగి వచ్చింది. వారితో చర్చలు జరిపింది. వారికి బకాయిలు విడుదల చేసింది. దానికి తోడు ప్రైవేటు ఆసుపత్రులు అడిగిన గొంతెమ్మ కోరికలను కూడా ఒప్పుకున్నారు. ఇదే ప్రైవేటు ఆసుపత్రులకు గత ఆరు నెలల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో సాగుతున్న ప్రజా ప్రభుత్వం ఆరోశ్రీ నిధులు విడుదల చేసింది. పైగా ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచింది. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు తీర్చేసింది. ఆరు నెలలు గడవకముందే మళ్లీ ప్రైవేటు ఆసుపత్రులు నిధులు విడుదలకు అల్టిమేటం ఇచ్చాయి. ఆరోగ్య శ్రీ ఏర్పాటైన నుంచి ఇంతలా ప్రభుత్వం మీద ప్రైవేటు ఆసుపత్రులు ఒత్తిడి చేసింది లేదు. బకాయిలు విడుదల చేస్తే తప్ప వైద్యం చేయలేమని భీష్మించుకున్నది లేదు. ధైర్యంగా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన సందర్భాలు లేవు. కాకపోతే ప్రైవేటు ఆసుపత్రలు సంఘాలు ప్రభుత్వానికి ఉత్తరాలు రాసేవి. మా బకాయిలు విడుదల చేయాలని కోరుకునేవి. మంత్రుల వద్ద మెరపెట్టుకునేవి. కాని ప్రైవేడు ఆసుపత్రులకు ఇంత తెగింపు ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? ఆరు నెలల క్రితమే బకాయిలు చెల్లించినా, ఇంత తొందరగా బిల్లుల కోసం ఈ లెక్కలేని తనమేది? గతంలో ఇవే ఆసుపత్రులు. ఇప్పుడూ ఇవే అసపత్రులు. గతంలో నోరు మెదపని ఆసుపత్రులకు కొత్తగా నోరు ఎందుకు వచ్చింది. ప్రభుత్వాన్ని నిలదీసేంత ధైర్యం ఎందుకొచ్చింది? ఆరోగ్యశ్రీ నధుల మీద అనేక ఆరోపణలు గతంలోనూ వున్నాయి. ఆరోగ్య శ్రీని అడ్డం పెట్టుకొని లేని వైద్యం చేసినట్లు, చేయని వైద్యానికి బిల్లులు వసూలు చేసిన సందర్భాలు అనేకం వున్నాయ. వాటిపై విజిలెన్స్ ఎంక్వౌరీలు అనేకం జరిగాయి. ఆసుపత్రుల మూతలు కూడా జరిగిన సందర్భాలున్నాయి. తొలినాళ్లలో 2005లో ఆరోగ్య శ్రీ ఏర్పాటైన నాడు అప్పటి ప్రభుత్వం ఏ మాత్రం రూపాయి అవకతవకలు జరిగినా, ఆరోగ్యశ్రీ వైద్యం అందించి, పేషెంట్లకు సరైన వైద్యం అందకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాంతో చాల కాలం పాటు ప్రభుత్వ ఆదుపాజ్ఞలోనే వైద్యం అందింది. కాని ప్రభుత్వ వైద్యులు చాల మంది ఆరోగ్యశ్రీ నిధుల వేటలో ప్రైవేటు ఆసుపత్రులు ఏర్పాటు చేసుకున్నారో అప్పటి నుంచి ఈ పథకం పక్కదారి పట్టింది. నిధుల గోల్ మాల్ మొదలైంది. ఆరోగ్యశ్రీ నిధుల లూటీ జరిగింది. అయినా ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. నిధుల విడుదలలో కాస్త జాప్యం చేసినా, నిధుల విడుదలను ఆపలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రైవేటు ఆసుపత్రులు చాలా వరకు నియంత్రణలోకి వచ్చాయి. నిదుల దుర్వినియోగం చేయడానికి ముందూ వెనుక ఆలోచించేవి. అయినా శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్లు ఆరోగ్య శ్రీ నిధులకు ప్రైవేటు ఆసుపత్రులు చిల్లులు పెట్టే ప్రయత్నాలు అనేకం చేశాయి. నిదులను దిగమంగాయి. ఈ విషయం గత ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు నిధుల విడుదలలో జాప్యం చేస్తూ వచ్చేవారు. ఆసుపత్రుల మీద కొంత నిఘా పెట్టేవారు. అందుకే గతంలో ఆరోగ్య నిధులపై పల్లెత్తు మాట మాట్లాడేందుకు ప్రైవేటు ఆసుపత్రులు ఎప్పుడూ ముందుకు వచ్చేవి కాదు. ప్రతి బడ్జెట్ తర్వాత ప్రభుత్వం నిధులు ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడే తీసుకునేవారు. గత పదేళ్ల కాలంలో నిధుల పెంచాలని, వైద్యం ఖరీదౌతున్నందున వాటి ధరలు పెంచాలని పెద్దగా పట్టుబట్టిన సందర్భాలు కూడాలేవు. కాని ఇప్పుడు ప్రైవేటు ఆసుపత్రులకు మాటలు వస్తున్నాయి. ముందు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన వైద్యులు ఆసుపత్రులను ప్రభుత్వం తనిఖీలు చేయాలి. వెంటనే విజిలెన్స్ ఎంకౌరీలు చేయించాలి. అప్పుడుగాని వారి బండారం బైట పడదు. ఆరోగ్య శ్రీ వచ్చిన తర్వాత పుట్టగొడుగుల్లా ఆసుపత్రుల వెలిశాయి. కేవలం ఆరోగ్యశ్రీ నిధులతోనే బతుకుతున్న ఆసుపత్రులు అనేకం వున్నాయి. అయినా తిన్నింటి వాసాలు లెక్కబెట్టడం ప్రైవేటు ఆసుపత్రులకు అలవాటైపోతోంది. పేరుకు కార్పొరేట్ ఆసుపత్రులు..హంగూ ఆర్భాటాలు కాని అందులో ఎంత మంది వైద్యులున్నారు? ఎంత మంది నిపుణులున్నారు. అన్ని విభాగాలకు వైద్యులున్నారా? ఆసుపత్రుల ముందు ఏర్పాటు చేసిన బోర్డుల్లో వున్న వైద్యులంతా నిత్యం చికిత్సలకు అందుబాటులో వుంటున్నారా? అన్నది ఆరా తీస్తే సగం ఆసుపత్రుల మూతపడతాయి. ఆరోగ్య శ్రీ నిధులు సగం నిదులు రాష్ట్ర ప్రభుత్వానికి మిగులుతాయి. ఆ నిదులు ఇతర వైద్య అవసరాలకు పనికొస్తాయి. ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణకు, వైద్య సేవలకు, వైద్య సిబ్బంది నియమాకానికి అక్కరకొస్తాయి. పేదలకు ప్రభుత్వ మెరుగైన వైద్యం మరింత అందుబాటులోకి వస్తుంది. ఏటా వందల కోట్లు ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లింపులు తప్పడం లేదు. అయినా మెరుగైన వైద్యం అందుతున్నట్లు దాఖలాలు లేవు. ఆ వైద్యం సక్సెస్ రేటు ఎంత వుందన్నదానిపై నివేధికలు లేవు. ప్రైవేటు ఆసుపత్రులు ఏర్పాటు చేయడం, ఆరోగ్య శ్రీ సేవలకు దరఖాస్తులు చేసుకోవడం, దందా మొదలు పెట్టడం పరిపాటిగా మారిపోయింది. గతంలో సగటున రూ.500 కోట్లు విడుదల చేస్తే కూడా సర్ధుకుపోయిన ప్రైవేటు ఆసుపత్రుల ఈసారి ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా విడుదల చేసినా వారి సంపాదనా దాహాం ఎందుకు తీరలేదన్న దానిపై ప్రభుత్వం దృష్టిపెడితే వారి పాపపు సంపాదన మొత్తం బైటకు వస్తుంది. ప్రభుత్వానికి ప్రజల నుంచి ప్రశంసలు కూడా అందుతాయి. ఆరోగ్య శ్రీ వైద్యం భయభక్తులతో సాగుతుంది. ప్రజల ఆరోగ్యానికి భరోసా దొరుకుతుంది.