ఎస్సై మచ్చ సాంబమూర్తి
శాంతి భద్రతల పరిరక్షణ పౌరులందరి బాధ్యత
శాంతియుత వాతావరణం లో ఎన్నికల నిర్వహణకు పౌరులు సహకరించాలి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో 21 మార్చ్
శాంతియుత వాతావరణం లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడానికి పౌరులు, రాజకీయ నాయకులు అందరూ పోలీసులకు సహకరించాలని గణపురం మండల ఎస్సై మచ్చ సాంబమూర్తి అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 4వ తేదీ వరకు ఎన్నికల నియమావళి అమలులో ఉంటుందన్నారు. అప్పటివరకు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఏలాంటి ధర్నాలు, నిరసనలు తెలుపకూడదని పేర్కొన్నారు. సెక్షన్ 144, 188 అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు. ఎన్నికల అధికారులు మోనిటరింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రజలు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.
ముందస్తు అనుమతి తప్పనిసరి
రాజకీయ పార్టీల నాయకులు సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికి ముందస్తు అనుమతి తప్పనిసరి పొందాలని ఎస్సై సాంబమూర్తి తెలిపారు. రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకుంటే ముందు దరఖాస్తు చేసుకున్న రాజకీయ పార్టీకి సమావేశాలకు అనుమతి ఇస్తామన్నారు. లేనియెడల సుమోటోగా కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సు తో పట్టిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భం గా ఎస్సై తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
రెచ్చగొట్టే పోస్టులు పెట్టొద్దు
రాజకీయ పార్టీల నాయకులు ఎక్స్( ట్విట్టర్ ), వాట్స్అప్ తదితర సామాజిక మాధ్యమాలలో రెచ్చగొట్టే పోస్టులను పెట్టకూడదని ఎస్సై సాంబమూర్తి సూచించారు. ప్రచారానికే సోషల్ మీడియాను పరిమితం చేసుకోవాలన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే పోస్టులను అనుమతించొద్దన్నారు. గ్రూపు అడ్మిన్లు బాధ్యత తీసుకొని అనవసర మెసేజ్లపై నిఘా పెట్టాలన్నారు. వివాదాస్పద వ్యక్తులను గ్రూపు నుండి తొలగించాలని గ్రూప్ అడ్మిన్ లకు ఎస్సై సూచించారు.
పెద్ద మొత్తంలో నగదు తరలించకూడదు
పెద్ద మొత్తంలో నగదు తరలిస్తూ పట్టుబడి నష్టాలపాలు కాకూడదని సాధారణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఎస్సై సాంబమూర్తి వెల్లడించారు. రూ. 50 వేలకు మించి తీసుకువెళ్తే విలువైన పత్రాలు ఎఫ్ ఎస్ సి,ఎస్ ఎస్ టి బృందాలకు చూపించాలన్నారు. ఆధారాలు లేని నగదును సీజ్ చేసి కలెక్టర్ ఆఫీసులో డిపాజిట్ చేస్తామన్నారు. 24 గంటల లోపు సంబంధిత విలువైన పత్రాలు చూపించి తిరిగి స్వాధీనం చేసుకోవచ్చని స్పష్టం చేశారు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలకు నిర్వహించుకునె సామాన్య ప్రజలు నగదు తరలింపులో జాగ్రత్తలు వహించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు సహకరించాలని ఎస్సై కోరారు.