
Pregnant Wife Brutally Murdered in Medchal
గర్భవతని చూడకుండా.. రంపంతో ముక్కలు ముక్కలుగా నరికి.. మేడిపల్లిలో భర్త దారుణం..
నువ్వే నా ప్రాణం.. సర్వస్వమని మాయమాటలు పెళ్లి చేసుకున్న అతడు.. కొన్నేళ్లకే అసలు రూపం బయటపెట్టుకున్నాడు. గర్భిణీ అని కూడా చూడకుండా భార్యను అతి కిరాతకంగా రంపంతో ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు. మేడ్చల్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన అందరి హృదయాలనూ కలచి వేస్తోంది.
మేడ్చల్ జిల్లా, మేడిపల్లి: మేడ్చల్ జిల్లా జరిగిన అమానవీయ ఘటన అంతటా కలకలం రేపుతోంది. మేడిపల్లి పరిధిలోని బాలాజీహిల్స్ కాలనీలో నివసిస్తున్న ఓ వ్యక్తి గర్భిణీ అయిన భార్యను అతి క్రూరంగా హతమార్చిన ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది. రంపంతో భార్యను ముక్కలు ముక్కలుగా కోసి శరీర భాగాలను మూసీ నదిలో పడేశాడు. ఇరువురి మధ్య కొన్నాళ్లుగా చెలరేగుతున్న కలహాలే హత్య దారి తీశాయని పోలీసులు అనుమానిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడకు చెందిన ఈ దంపతులు కొన్నాళ్ల కిందటే హైదరాబాద్లోని బోడుప్పల్ ప్రాంతానికి వలస వచ్చారు.
వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి (వయస్సు 25), మహేందర్ రెడ్డి ఇరువురూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. హైదరాబాద్ వచ్చి నెల కూడా అవలేదు. మహేందర్ ర్యాపిడో నడుపుతుంటాడు. అయితే, కొంతకాలంగా దంపతులు ఇరువురూ తరచూ గొడవపడుతున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం (ఆగస్ట్ 22) మధ్యాహ్న సమయంలో ఐదు నెలల గర్భవతిగా స్వాతిని ఆమె భర్త మహేందర్ రెడ్డి అత్యంత దారుణంగా హతమార్చినట్టు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి కవర్లలో పెట్టి వాటిని మూసీ నదిలో పడేసే ప్రయత్నం చేశాడు. తల, చేతులు, కాళ్లు వేరు చేసి విభిన్న ప్రాంతాల్లో వదిలిపెట్టినట్లు అతడు అంగీకరించినట్టు తెలుస్తోంది. మొండాన్ని మాత్రం ఇంట్లోనే ఉంచడంతో దుర్వాసన వచ్చి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కవర్లను పరిశీలించగా మహేందర్ ఇంట్లో స్వాతి మొండెం కనిపించింది. దీంతో నిందితుడు మహేందర్ రెడ్డి పోలీసులు వెంటనే అరెస్టు చేశారు.
స్వాతి తల్లి మీడియాతో మాట్లాడుతూ, తమ కూతురు డిగ్రీ చదువుతున్న సమయంలో మాయమాటలతో ఆకర్షించి మహేందర్ ఇంట్లోంచి తీసుకెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నాడని తెలిపింది. మాట వినకుండా పెళ్లి చేసుకున్నప్పటికీ కొన్నాళ్ల తర్వాత బంగారం కూడా ఇచ్చామంది. కానీ పెళ్లి తర్వాత మహేందర్ పూర్తిగా మారిపోయాడని.. నా కూతుర్ని చిత్రహింసలు పెట్టేవాడని.. కనీసం ఫోన్లో కూడా మాట్లాడనిచ్చేవాడు కాదంటూ కన్నీటిపర్యంతమైంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. కాగా, ఈ హత్య పూర్తిగా ప్రణాళికాబద్ధంగానే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. మిగిలిన శరీర భాగాల కోసం మూసీ నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటనతో ప్రేమ వివాహాలు, గృహహింస, మహిళల భద్రత అంశాలపై మళ్లీ చర్చ మొదలైంది. ప్రేమ పేరుతో జరిగే పెళ్లిళ్లు, అనంతరం వెలుగు చూస్తున్న హింసాత్మక సంఘటనలు సమాజాన్ని ఆలోచనలో పడేస్తున్నాయి.