*51 శాతం ఫిట్మెంట్తో ఉద్యోగ ఉపాధ్యాయులకు తక్షణమే పిఆర్సి అమలు చేయాలి*
*డి ఏ లు,జూలై 2023 నుండి అమలు కావలసిన పిఆర్సి ఇంకా పెండింగ్ లోనే….!!*
*ఆర్థికంగా ఎంతో నష్టపోతున్న ఉద్యోగ ఉపాధ్యాయులు.*
*ఉచితాలకు పెద్దపీట వేస్తూ, ఉద్యోగ ఉపాధ్యాయులు కొట్లాడి తెచ్చుకున్న ఆర్థిక హక్కులను కాలురాస్తున్న ప్రభుత్వాలు.*
*కోరి తెచ్చుకున్న ప్రజా ప్రభుత్వం సత్వరమే తగిన చర్యలు గైకొనాలి.*
*తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మహబూబాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు బాలాష్టి రమేష్ డిమాండ్*
*కేసముద్రం/ నేటి ధాత్రి*
జూలై 2023 సంవత్సరం నుంచి అమలు చేయాల్సిన పిఆర్సిని 51 శాతం ఫిట్మెంట్తో తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ మహబూబాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు బాలాస్టి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం టిపిటిఎఫ్ కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షులు గుండు సురేందర్, ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు ల నేతృత్వంలో కేసముద్రం మండలంలోని వివిధ పాఠశాలలను సందర్శిస్తూ రెండో రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా శాఖ అధ్యక్షులు బాలాష్టి రమేష్ మాట్లాడుతూ డిఏలు, మెడికల్ రీయంబర్స్మెంట్, జిపిఎఫ్ ఉపసంహరణ లతో పాటు 2023 జూలై నుంచి అమలు కావల్సిన పి ఆర్ సి ఇంతవరకు అమలు చేయకపోవడం బాధాకరమని తద్వారా ఉద్యోగ ఉపాధ్యాయులు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఇవ్వకూడని హామీలు ఇస్తూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ఉచితాల హామీలను నెరవేర్చడానికి నానా తంటాలు పడుతున్నారని, కానీ ఉపాధ్యాయ,ఉద్యోగ వర్గాలకు హక్కుగా ఇవ్వాల్సిన డి ఏలు, పిఆర్సీలు మొదలగు వాటిని ఆమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఏరి కోరీ తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే వీటిని అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని, అంతేకాదు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
అనంతరం మండల శాఖ అధ్యక్షులు అధ్యక్షులు గుండు సురేందర్ మాట్లాడుతూ రెండో రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గురువారం కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్, కస్తూరిబా గాంధీ, మోడల్ స్కూల్, కల్వల తాళ్లపూసపల్లి ఉన్నత పాఠశాలలను, అన్నారం ప్రాథమికొన్నత పాఠశాలలను సందర్శించామని తెలిపారు
ఈ కార్యక్రమంలో మండలశాఖ ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, జిల్లా శాఖ ఉపాధ్యక్షులు చీకటి వెంకట్రామ్ నర్సయ్య, మండల శాఖ ఉపాధ్యక్షులు ఆంజన్న, కొమ్ము రాజేందర్, కార్యదర్శులు బి విజయ్ చందర్, జీ.మోహనకృష్ణ, బబ్బులు సురేష్ , పి రామారావు తదితరులు పాల్గొన్నారు.