రామడుగు, నేటిధాత్రి:
చిన్నప్పుడు చదువుతోపాటు ఆటపాటలతో ఆనందంగా గడిపిన పాఠశాలలో స్నేహితులంతా ఒక్కచోట చేరి గత స్మృతులను గుర్తు చేసుకుని ఆనందంగా ఇరవై ఐదు ఏళ్లకు తిరిగి అదే పాఠశాలలో సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆత్మీయ సమ్మేళనం జరుపుకొని ఆనందంగా గడిపారు. వివరాలలోకి వెళ్ళితే కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని ప్రగతి విద్యానికేతన్ హైస్కూల్ 1998-99 ఎస్ఎస్సి బ్యాచ్ కి చెందిన విద్యార్థులు అపూర్వ ఆత్మీయ సమ్మేళనం సిల్వర్ జూబ్లీ వేడుకలను గోపాలరావుపేటలోని శ్రీప్రగతి పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకల కార్యక్రమంలో భాగంగా అప్పటి పూర్వ విద్యార్థులంతా ఒక్కచోట చేరటం ఆనందదాయకంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇరవైఐదు ఏళ్లకు చదువుకున్న పాఠశాలలో స్నేహితులంతా కలిసి తమ చిన్ననాటి గతస్మృతులను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని ఆనందంగా పరవశించారు. ఈసందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ చిన్ననాటి స్నేహం బంధం జీవితంలో ఎప్పటికీ మర్చిపోకుండా శాశ్వతంగా ఉండిపోతుందని అభిప్రాయపడ్డారు. చిన్ననాటి గత స్మృతులను మననం చేసుకుంటూ వారికళ్ళల్లో ఆనంద బాష్పాలు చెమ్మగిల్లాయి. ఈకార్యక్రమంలో అప్పటి పాఠశాల యాజమాన్యం కర్ర శ్యాంసుందర్ రెడ్డి, అన్నదానం రాధాకృష్ణ, అట్ల శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు నముండ్ల రమేష్ లను శాలువాతో కప్పి ఘనంగా సన్మానించారు.