నేటిధాత్రి, వరంగల్
గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 17వ డివిజన్, ఖిలా వరంగల్ మండలం స్తంభంపల్లిలో దేవాలయ భూమి కబ్జా అయినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. వివరాల్లోకి వెళితే ఖిలా వరంగల్ మండలం స్తంభంపల్లిలో దేవాలయ భూమి కబ్జా అయినట్లు బుధవారం నాడు స్థానిక గ్రామ ప్రజలు కొందరు మీడియాతో మాట్లాడారు. స్థానిక ప్రజల సమక్షంలో ఎండోమెంట్ అధికారులు సర్వే నిర్వహించారు. స్తంభంపల్లి మాజీ సర్పంచ్ ఎండోమెంట్ జాగాలో ఉన్న 5అడుగుల ఆంజనేయ విగ్రహాన్ని తీసేసి, కాళేశ్వరంలో పడేసారని గ్రామస్థులు అన్నారు. పరకాల తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా అండదండ చూసుకొని ఎండోమెంట్ భూమి కబ్జా చేసినట్లు గ్రామస్థులు ఆరోపణ చేశారు. ఈ విషయంలో తిరగబడ్డ కొందరు గ్రామస్థులు, ఆర్టీఐ కింద ఎండోమెంట్ భూమి వివరాలు సేకరణ చేశారని తెలిపారు. మా గ్రామంలో ఎదురు మాట్లాడిన వాళ్ళను పోలీసులతో బెదిరింపులు, బైండోవర్లు చేపించినట్లు గ్రామస్థుల ఆవేదన వ్యక్తంచేశారు. మాజీ సర్పంచ్ 20యేండ్ల కింద ఊర్లో ఉన్న విగ్రహాన్ని చడిచప్పుడు కాకుండా తీసి, కాళేశ్వరంలో పడేసి, ఊరి ప్రజల మెప్పు కోసం విరాళాలు సేకరించి, ఊరి బయట కొత్త గుడి కట్టినట్లు తెలిపారు. గ్రామస్థుల పిర్యాదుకు స్పందించిన ఎండోమెంట్ అధికారులు, బుదవారం సర్వే నిర్వహించి ఎండోమెంట్ భూమి ఉన్న మాట వాస్తవం అని తేల్చారు. మరోసారి సర్వే నిర్వహించి పూర్తి వివరాలు ఉన్నతాదికారులకు అందచేసి తదుపరి చర్యలు తీసుకుంటాం అని సర్వేయర్ వివరణ ఇచ్చారు. మాజీ సర్పంచ్ కబ్జాల పైన విచారణ జరిపి ఎండోమెంట్ భూమిని కాపాడాలని స్థానిక ఎమ్మెల్యే రేవూరికి వినతి పత్రం ఇచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు. ఖిలా వరంగల్ తహశీల్దార్ కి గ్రామస్థుల విన్నపం ఎండోమెంట్ భూమి పైన, మాజీ సర్పంచ్ కబ్జాలపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.