పేదింటి సరస్వతి పుత్రికకు..లక్ష్మీ కటాక్షం లేకపాయే
-ఈ పేదింటి విద్యా కుసుమాన్ని ఆరిపోనియ్యకండి
-దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి
-నీట్ లో మెరిసి..ఎంబిబిఎస్ సీటు సాధించిన సరిగోమ్ముల నిఖిల
-నిఖిలను, తల్లిదండ్రులను ఘనంగా సన్మానించిన జర్నలిస్టులు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
పేదింటి సరస్వతి పుత్రికకు..లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో..ఈ విద్యా కుసుమాన్ని ఆరిపోనీయకుండా..దాతలు ముందుకు వచ్చి ఆదుకొని కాబోయే డాక్టర్ అమ్మకు చేయూతనిచ్చి, మీ దీవెనలను అందించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పిడిసిల్ల గ్రామానికి చెందిన సరిగోమ్ముల శోభారాణి-బాబు దంపతులకు 08 అక్టోబర్ 2004న జన్మించిన కుమార్తె నిఖిల చిన్నప్పటి నుంచే చదువులో రాణించేది. బహుజన కుటుంబంలో జన్మించిన నిఖిల తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించేవారు. వారి కుమార్తె చదువులో రాణిస్తుండడంతో ఎలాగైనా ఉన్నత చదువులు చదివించాలనే పట్టుదలతో తల్లిదండ్రులిద్దరూ ఎండనక, వాననక కూలీ పనులు చేసుకుంటూ నిఖిలను చదివించారు. ఈ క్రమంలో నిఖిల 1వ తరగతి నుండి 4వ తరగతి వరకు సిఎస్ఐ మొగుళ్ళపల్లిలో, 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల చిట్యాలలో, ఇంటర్మీడియట్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల హసన్ పర్తిలో, ఆ తర్వాత నీట్ పరీక్ష రాసి ఆల్ ఇండియాలో 2లక్షల 20వేల 544వ ర్యాంక్ సాధించి వనపర్తిలో ఎంబీబీఎస్ సీటు పొంది..పుట్టిన ఊరికి..కన్న తల్లిదండ్రులకు..విద్య నేర్పిన గురువులకు పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది. కాగా ఈ సరస్వతీ పుత్రికకు లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో..ఎంబిబిఎస్ చదవడానికి ఆర్థిక స్తోమత సరిపోకపోవడంతో ఈ పేదింటి విద్యా కుసుమాన్ని ఆరిపోనియ్యకుండా ఆదుకోవడానికి దాతలు ముందుకు వచ్చి 9704970626 అనే ఫోన్ నెంబర్ కు ఫోన్ పే చేయగలరని తల్లిదండ్రులు, గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ఈ సందర్భంగా ఎంబిబిఎస్ సీట్ సాధించిన నిఖిలను టిడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్ట్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల మహేందర్ గౌడ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుర్గం సురేష్ గౌడ్, టీడబ్ల్యూజెఎఫ్ జర్నలిస్టు సంఘం మండల అధ్యక్షుడు నిమ్మల భద్రయ్య, ప్రెస్ క్లబ్ మండల ప్రధాన కార్యదర్శి మంగళపల్లి శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ కట్కూరి ఐలయ్య, టిడబ్ల్యూజెఎఫ్ జర్నలిస్టు సంఘం నాయకుడు రమేష్ తదితరులున్నారు.