ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.
జడ్చర్ల / నేటి ధాత్రి.
బాలానగర్ మండలంలోని పెద్దయిపల్లి, గుండెడ్ గ్రామాలలో నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సోమవారం పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల ప్రజాపాలన-సంక్షేమ పథకాల సంబంధించిన గ్రామంలోని లబ్ధిదారుల ఎంపిక వివరాల సేకరణ గురించి సోమవారం ఆరా తీశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామ సభలు నిర్వహిస్తుందని తెలిపారు. ప్రజా పాలనలో ఉన్న లబ్ధిదారుల జాబితా ఫైనల్ కాదన్నారు. గ్రామసభల ద్వారా అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కలిసి తీర్మానం చేసిన జాబితాలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి పంపిస్తారని గుర్తు చేశారు. మిగతా లబ్ధిదారులు మా పేరు లేదని ఆందోళన చెందకుండా గ్రామసభల ద్వారా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల, రేషన్ కార్డుల ప్రజా పాలన సంక్షేమ పథకాలకు ఈనెల 24 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల అప్పుడే ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలను మభ్య పెట్టారని విమర్శించారు. సంక్షేమ పథకాల ఎంపికలో కూడా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వంలో ఎక్కడ కూడా అవినీతి జరగకుండా నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ ప్రజాపాలన సంక్షేమ పథకాలు అందించే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే నిర్లక్ష్యం ద్వారా పెద్దయపల్లి గ్రామానికి రూ.5 కోట్ల నష్టం వాటిల్లిందని గుర్తు చేశారు. పెద్దయపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ.50 లక్షల నిధులు, బ్రిడ్జి నిర్మాణాల కొరకు రూ.10 కోట్ల నిధులు మంజూరు చేయించానన్నారు. గ్రామ సభల నిర్వహణలో అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు.