
NHRC State President Dr. Mogulla Bhadraiah's appeal
చెరువు, కుంటల లెక్కలు తేల్చాలి, హద్దులు నిర్ణయించాలి
కబ్జాకు గురైనా చెరువు, కుంటలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలి
చెరువు, కుంటల కనుమరుగుపై సంబంధిత అధికారులను బాధ్యులను చేసి చర్యలు తీసుకోవాలి
ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య విజ్ఞప్తి
“నేటిధాత్రి”,కరీంనగర్ టౌన్:
రాష్ట్రంలో చెరువులు, కుంటల లెక్కలు తేల్చాలని, అక్రమణలకు గురికాకుండా వెంటనే హద్దులు నిర్ణయించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కమిటీ సభ్యులు విలాసాగరం పృథ్వీరాజ్ అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చాలాచోట్ల చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయని, అక్రమణదారులు కొంతమంది రాజకీయ నాయకులు, అధికారుల అండతో నకిలీ పేపర్లు డాక్యుమెంట్లు సృష్టించి పట్టాలు పొందారని, వాటిపై బ్యాంకు లోన్లు, రైతుబంధు, రైతు భరోసా లాంటి ప్రభుత్వ పథకాలను లబ్ధి పొందుతున్నారని ఆయన స్పష్టం చేశారు. ఇలా కనుమరుగైన చెరువు,కుంటల లెక్కలు తీసి సంబంధిత అధికారులను బాధ్యులుగా చేసి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. చెరువులను, కుంటలను రక్షించే బాధ్యత సంబంధిత అధికారులేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి చెరువు, కుంటలను గుర్తించి వాటికి హద్దులను నిర్ణయించాలని ఆయన కోరారు. అక్రమణలకు గురైన చెరువు కుంటలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అక్రమంగా పొందిన పట్టాలను రద్దు చేయాలని, వారికి క్షేత్రస్థాయిలో సహకరించిన రెవెన్యూ శాఖ అధికారులపై, ఇరిగేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు జెల్ల చంద్రయ్య, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఇమ్మడి ప్రణయ్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వడ్డీక అనిల్ రెడ్డి, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి రవి గౌడ్, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, కరీంనగర్ పట్టణ అధ్యక్షులు హరీష్, జిల్లా అధికార ప్రతినిధి నూనె శ్రీనివాస్, తిమ్మాపూర్ మండల అధ్యక్షులు అభిషేక్, జిల్లా నాయకులు మధుకర్, సామాజిక ఉద్యమకారులు కాట్నపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.