ఆంధ్రప్రదేశ్‌లో డైవర్షన్‌ రాజకీయాలు

పవన్‌ చేతికి ‘సనాతనధర్మం’ అస్త్రం

బాబు రాజకీయం పవన్‌కు అనుకోని వరం

బాబు తలచింది ఒకటి అయింది మరొకటి

నిలకడ రాజకీయవేత్తగా పవన్‌ నిరూపించుకోవాలి

నిజాయతీ పవన్‌కు ప్లస్‌ పాయింట్‌

మూడోశక్తిగా పవన్‌కు అవకాశాలు పుష్కలం

‘ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే అసలైన నాయకుడు’ అనేది ఒక సినిమా డైలాగు. ప్రస్తుతం పరిణిత నాయకుడిగా తయారవుతున్న పవన్‌ కళ్యాణ్‌ కు ప్రస్తుతం కావలసింది ఇదే. ఎందుకంటే తొందరపడి చేసే వ్యాఖ్యలు లేదా విమర్శల వల్ల ప్రత్యర్థులనుంచి బలమైన ప్రతి విమర్శలకు దారితీసి అసలు లక్ష్యం దెబ్బతినే ప్రమాదం వుంది. ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ తమిళనాడులోని మదురైలో వాంజినాథన్‌ అనే ఒక న్యాయవాది ఫిర్యాదు చేయడం తాజా పరిణామం. ఇటీవల తిరుపతిలో పవన్‌ కళ్యాణ్‌ సనాతనధర్మ పరిరక్షణకోస మంటూ ఒక డిక్లరేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ డిక్లరేషన్‌ సందర్భంగా ఆయన రాహుల్‌గాంధీ, అక్బరుద్దీన్‌ ఒవైసీ, తమిళనాడు ఉపముఖ్యమంత్రి దయానిధి స్టాలిన్‌లపై విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా దయానిధి స్టాలిన్‌ సనాతన ధర్మాన్ని వైరస్‌తో పోల్చారంటూ పేర్కొనడం మదురైలో ఫిర్యాదుకు కారణం. ఇటీవల తమిళన నటుడు కార్తిపైపవన్‌ ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని కూడా తమిళులు జీర్ణించుకోలేక పోయారన్నది గుర్తుంచుకో వాలి. తమిళుల్లో వుండే అపరిమిత ప్రాంతీయాభిమానం అందరికీ తెలిసిందే. దయానిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు సనాతన ధర్మ మద్దతుదార్లకు తప్పనిపించినా తమిళుల్లో చాలామందికి అవి ఆమోదయోగ్యమే. నిజానికి ఇక్కడ దయానిధి అంశం అప్రస్తుతం! డిఎంకె దీన్ని ఖండిరచి తాముఏ మతానికి వ్యతిరేకంగా ఎప్పుడూ వ్యాఖ్యానిం చలేదని వివరణ ఇచ్చినా, తమిళుల సంగతి మనకు తెలిసిందేగా!

ప్రజల్లోకి వెళ్లిన సనాతనధర్మ వాదం

ప్రస్తుతం పవన్‌ ఎత్తుకున్న సనాతనధర్మ పరిరక్షణ వాదం ఆంధ్రప్రజల్లోకి బాగా వెళ్లిందనేది సుస్పష్టం. హిందూ ధర్మ పరిరక్షణ అనే పదం ఆయన వాడకుండా జాగ్రత్త పడుతున్నారు. మహారాష్ట్రలో శివసేన ప్రధాన లక్ష్యం హిందూధర్మ పరిరక్షణ. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆది త్యనాథ్‌ కార్యాచరణ శైలి ఇదే దిశలో కొనసాగుతోంది. దేశంలోని అన్ని ఆలయాలు ఒకే బోర్డ్‌ కింద ఉండాలి, అలాంటి ధర్మ పరిరక్షణ బోర్డు అవసరమనేది పవన్‌ చేస్తున్న ప్రధాన డిమాండ్‌.సనాతనధర్మ పరిరక్షణకు ఆవిధంగా హిందూ ఆలయాలన్నింటిని ఒకే తాటికిందికి తీసుకురావాలని ఆయన కోరడం సహేతుకం. నిజానికి ఇది ఆయన ఒక్కడు చెబుతున్న మాట కాదు, ఇది దేశంలోని మెజారిటీ హిందువుల అభిప్రాయం. దీనివల్ల సనాతనంగా కొనసాగుతున్న దేవాలయ వ్యవస్థకు రక్షణ ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆదాయం వున్న దేవాలయాలన్నీ ప్రభుత్వాల పరిధిలోకి వెళ్లడంతో, సనాతనధర్మాచరణకు విఘాతం కలుగుతోంది.

తెరవెనుక నిజాలు

ఇక్కడ తెరవెనుక వాస్తవాన్ని గుర్తించాలి. తెలుగుదేశం`జనసేన కాంబినేషనల్‌లో ప్రభుత్వం కొనసాగుతున్నంతకాలం చంద్రబాబు లేదా లోకేష్‌ మాత్రమే ముఖ్యమంత్రిగా వుంటారు. పవన్‌ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వుండదు. ఈ నేపథ్యంలో అయాచితంగా చేతికందిన సనాతన ధర్మం అస్త్రాన్ని ఉపయోగించి ఆయన లేవనెత్తిన సరికొత్త వాదం, భాజపా పెద్దలకు తప్పక ఆనందం కలిగించేదే! అదీకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో నాయకత్వ లేమితో ఇబ్బంది పడుతున్న బీజేపీకి పవన్‌ ఆ లోటును భర్తీచేయగలడన్న విశ్వాసం ఏర్పడుతుంది. ప్రస్తుతం అందుకున్నసనాతన వాదం భవిష్యత్తులో పవన్‌ కళ్యాణ్‌ను ఒక శక్తివంతమైన నాయకుడిగా తయారుచేస్తుందన్న నమ్మకం కలిగే దిశగా పరిణామాలు మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భాజపా పవన్‌కు పూర్తి మద్దతు కొనసాగించి రాష్ట్రంలో బలపడేందుకు పావులు తప్పక కదుపుతుంది.

చంద్రబాబు పుణ్యమే

నిజానికి విజయవాడ వరదల విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందింద న్న అభిప్రాయం ప్రజల్లో పెరిగితే ప్రమాదమన్న ఉద్దేశంతో, ‘డైవర్షన్‌ పాలిటిక్స్‌’లో భాగంగా చంద్రబాబు లేవనెత్తిన తిరుపతి లడ్డూ వివాదం బూమరాంగ్‌ అయినట్టు ఇప్పుడిప్పుడే స్పష్టమవుతోంది. సిట్‌ ఏర్పాటు చేసి జగన్‌పై పాపం మొత్తం నెట్టేసి గట్టెక్కుదామనుకుంటే, సుప్రీంకోర్టు స్వయంగా సిట్‌ వేయడం చంద్రబాబుకు ఎంతమాత్రం కొరుకుడు పడని అంశం. విచిత్రమేమంటే ఆయన జగన్‌ను దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో లేవనెత్తిన వివాదం అటుతిరిగి ఇటుతిరిగి పవన్‌ చేతికి ‘సనాతన ధర్మం’ అస్త్రం ఇచ్చింది. హిందూత్వ, హిందూధర్మం కాకుండా ‘సనాతనధర్మం’ అనే ఈ కొత్త కాన్సెప్టు ను పవన్‌ కళ్యాణ్‌ సుస్థిరమైన ఆయుధంగా తనకు అనుకూలంగా మలచుకొని ముందుకెళితే భవిష్యత్తులో అది తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీలు రెండిరటికి ఇబ్బందికరమే. ఆంధ్రప్రదేశ్‌లో మూడో నాయకత్వం పటిష్టంగా రూపొందుతుంది. ‘సనాతనధర్మం’, ‘హిందూత్వం’ మరియు ‘జాతీ యవాదం’ అనేవి ప్రధాన ఆయుధాలు కనుక, భాజపా పెద్దలనుంచి పవన్‌కు ఆశీస్సులు పుష్క లంగా అందుతాయి. కాకపోతే పవన్‌ కళ్యాణ్‌ నిలకడగా తన రాజకీయాలు కొనసాగించాల్సి వుంటుంది. అవసరానికి తగ్గట్టు ఎప్పటికప్పుడు తాత్కాలిక అజెండాలు ఎంచుకుంటే రాజకీయంగా నష్టపోవడం ఖాయం. జగన్‌ను వచ్చే ఎన్నికల్లో పదవిలోకి రాకుండా చేసే ఉద్దేశంతో చం ద్రబాబు కదిపిన తొలి ‘పావు’ లడ్డూ వివాదం. ఈ వివాదం మొదట జగన్‌ పార్టీని హతాశుల్ని చేసినా, వారు తేరుకొని ఎదురు తిరగడంతో తెలుగుదేశం ప్రస్తుతం డిఫెన్స్‌లో పడిరది. అయితేచంద్రబాబు ప్రయోగించిన ‘లడ్డూ’ అస్త్రం ఇప్పుడు ‘సనాతనధర్మం’ పేరుతో పవన్‌ చేతిలో తిరు గులేని ఆయుధంగా మారడం ఆంధ్రప్రదేశ్‌లో భాజపాకు అనుకోని వరం!

ఇక పవన్‌ విషయానికి వస్తే ప్రస్తుతానికి సనాతన ధర్మానికి బ్రాండ్‌ అం బాసిడర్‌గా ప్రజల్లో పేరు తెచ్చుకోవడంలో విజయం సాధించారనేది తిరుగు లేని వాస్తవం. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో వామపక్ష భావజాలాన్ని భుజానెత్తుకున్నా అది పెద్దగా వర్కవుట్‌ కాకపోవడంతో కాడి కిందపడేశారు. నటుడుగా ఆయన చేగువేరా ఆదర్శమన్నారు. కులమతాలకతీతంగా పోరాడతామని చెప్పిన ఆయన ఇప్పుడు ‘సనాతనధర్మం’ భుజానకెత్తుకున్నారు. రాజకీయ అధికార పరమపద సోపానాన్ని అధిరోహించడానికి ఈ తాజా అస్త్రం పవన్‌కు ఎంతమేర ఉపకరిస్తుందనేని కాలమే నిర్ణయిస్తుంది.

స్థిరంగా నిలబడాలి

అయితే ‘సనాతనధర్మం’పైనే ఆయన స్థిరంగా నిలబడితే, కొన్ని ప్రయోజనాలు సిద్ధించే అవ కాశాలు లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో రెడ్లు, కమ్మల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో మరోకులానికి చోటు లేకుండా పోయింది. కుల రాజకీయాలు బలీయంగా వున్న నేపథ్యంలో పవన్‌కు ‘కాపు’ కుల కార్డు ఎలాగూ తప్పదు. ఇప్పుడు సనాతనధర్మం పుణ్యమాని, మైనారిటీల పేరుతో రాజకీయ పార్టీలు తమను అణచివేస్తున్నాయన్న భావన ఉన్న అన్ని కులాల్లోని ప్రజలు ఇప్పుడు పవన్‌కు తప్పక మద్దతిస్తారు. ఎందుకంటే ఇప్పటివరకు తమ వాణి వినిపించే అవకాశం లేక, సమర్థవంతుడైన నాయకుడు లేక మౌనంగా ఉన్న గళాలన్నీ ఇప్పుడు పవన్‌ వెంట నడవడానికి నిస్సంకోచంగా ముందుకువస్తాయి. ఇది భాజపాకు, పవన్‌కు…ఇద్దరికీ లాభమే. ఈ ‘వాదం’ ఆం ధ్రలో వేళ్లూనుకుపోయిన కుల రాజకీయాల్లో తప్పక మార్పు తెచ్చే అవకాశాలే ఎక్కువ. పవన్‌కు ‘అస్థిర’ రాజకీయాలు నడుపుతారన్న అపవాదుతో పాటు ‘నిజాయతీ’గల నాయకుడిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో గుర్తింపూ వున్నది. ఇప్పుడు తానొక నిలకడ రాజకీయవేత్తగా నిరూపించు కోవడం పవన్‌ ప్రధాన కర్తవ్యం. అనుభవం పెరిగే కొద్దీ రాజకీయ పరిణితి కూడా విస్తరిస్తుంది. అందువల్ల పవన్‌ను గతంలో మాదిరిగా అంచనా వేయడం కూడా తప్పే అవుతుంది. అధికారం కోసం లేదా ప్రజామద్దతుకోసం ఎన్నో అంశాలను నెత్తికెత్తుకోవాల్సి వుంటుంది. కానీ వాటిల్లో ఏదో ఒకఅంశమే ఒక నాయకుడి జీవితాన్ని మలుపు తిప్పే బ్రహ్మాస్త్రమవుతుందనేది చరిత్ర చెబుతున్న స త్యం. ‘తెలుగువారి ఆత్మ గౌరవం’ అంశం ఎన్టీఆర్‌ను, ‘తెలంగాణా అస్తిత్వం’ అన్న అంశం కె.సి.ఆర్‌.ను, ‘గరీబీ హటావో’ ఇందిరాగాంధీని, ‘జై జవాన్‌ జైకిసాన్‌’ నినాదం లాల్‌ బహదూర్‌ శాస్త్రిని గొప్ప నాయకులుగా నిలిపాయి. మరిప్పుడు ‘సనాతన ధర్మం’ అంశం పవన్‌ను ఎంతమేర నిలుపుతుందో చూడాలి.

తానొకటి తలిస్తే…

నిజం చెప్పాలంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఇంకా కష్టాల కడలిని ఈదు తుందనే చెప్పాలి. మామూలు వర్షాలకే అమరావతిలో వరదనీరు పారుతోంది. దీని అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు రుణం ఇస్తుందో లేదో తెలియదు. వైఎస్‌ జగన్‌ మూడు రాజధానులంటూ ప్రచారం చేసినా, తెలుగుదేశం ఎప్పటికప్పుడు అమరావతికి అనుకూలంగా ఎదురుదాడులు చేస్తూ జగన్‌ను అడుగు ముందుకేయనీయలేదు. జగన్‌ పుణ్యమాని రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ లేకుండాపోయిందని ప్రచారం చేసిన తెలుగుదేశానికి ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేయడం మోయలేని భారంగా మారింది. దీనికి తోడు విజయవాడలో వరద విలయం గోరుచుట్టుపై రోకలిపోటుచందమైంది. ఇచ్చిన హమీలు అమలుచేయలేని దుస్థితి మరోవైపు ప్రకృతి ప్రకోపం నేపథ్యంలో ప్రచారహోరు ఎంతోకాలం ‘ప్రతికూల ప్రభావం’ నుంచి గట్టెక్కించలేదు. సకల పాపా లు జగన్‌మీద నెట్టేయాలన్న తలంపుతో ‘లడ్డూ’ను ముందుకు తీసుకొచ్చి తలబప్పికట్టిన చంద్రబాబు, ఇదే ‘లడ్డూ’ పవన్‌ చేతిలో సనాతన ధర్మం అనే బలమైన అయుధంగా మారుతుందని ఊహించి వుండకపోవచ్చు. ప్రస్తుతం దేశంలో హిందువుల్లో వేగంగా పెరుగుతున్న చైతన్యాన్ని తమను తాము ‘సెక్యులర్‌’గా చెప్పుకునే రాజకీయ పార్టీలు గుర్తించని విధంగానే, చంద్రబాబు కూడా అంచనా వేయకపోవడం వల్ల అనుకున్న రాజకీయ లక్ష్యం నెరవేరడం మాట అట్లావుంచి, పవన్‌ బలమైన నాయకుడిగా రూపొందడానికి చేజేతులారా సహకరించినట్లయింది. తానొకటి తలిస్తే…దేవుడొటి తలుస్తాడనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!