https://epaper.netidhatri.com/
పొమ్మనలేక పొగ!
హైదరబాద్,నేటిధాత్రి:
కొన్ని ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం దొరకవు అంటే ఇదే..అందరికీ విషయం తెలుసు. ఇచ్చుకునేవారికి తెలుసు. పుచ్చుకునేవారికి తెలుసు. వివరాలందరికీ తెలుసు. అయినా నిశ్శబద్ధం…కొన్ని సార్లు సమాదానాలు లేకపోవడమే మంచిది. సమయం సందర్భం అనేవి ఎప్పుడూ రాజకీయాలలో బడుగులకేనా? అన్న ప్రశ్న మాత్రం ఎప్పుడూ ఉత్పన్నమౌతూనే వుంటుంది. సమాధానం చెప్పడం దాట వేడయం జరగుతూనే వుంటుంది. ఇంతకీ అద్దంకి దయాకర్ విషయంలో మళ్లీ అన్యాయం ఎందుకు జరిగింది. ఒక నాయకుడు ఎదగకుండా అణచి వేయడం అంటే అంతగా జరుగుతుందా? ఆధిపత్యపోరులో బడుగులకు ఎప్పుడూ అన్యాయమేనా? తాజాగా శాసన సభ సభ్యుల కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులు కాంగ్రెస్‌ను వరించాయి. అయితే అందులో ఒకటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్‌కు వస్తుందన్న ప్రచారం విసృతంగా జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి వినిపిస్తున్న పేరు అద్దంకి దయాకర్. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కూడా రేపు లిస్టు వస్తుందనగా కూడా ఒక రోజు ముందే లీకు వచ్చింది. తెలంగానలోని కాంగ్రెస్ నాయకులే కాదు, ఆయన శ్రేయోభిలాషులు కూడా ఎంతో మంది ఆయనకు అభినందనలు తెలియజేశారు. కాని ఏం జరిగింది. తెల్లారితే లిస్ట్‌లో అద్దంకి పేరు మాయమైంది. ఇదెక్కడి విచిత్రమని అందరూ అనుకున్నారు. అద్దంకి కూడా ముందు కలవరపడ్డాడు. కాని ఇప్పటికిప్పుడు ఏం చేయలేని పరిస్ధితి. ఎదురు తిరగలేని స్ధితి. నాకు టిక్కెట్ ఎందకు ఇవ్వలేదని ప్రశ్నించలేని పరిస్ధితి. సోషల్ మీడియా పుణ్యమా? అని కూడా ప్రభుత్వాలే తారు మారుతౌతుండగా? పదవులు ఒక లెక్కనా? అన్నంతగాకా వచ్చింది. అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ ఖరారైందన్న లీకు రాగానే, ఈ సభ వల్లనే ఆయనకు ఎమ్మెల్సీ వచ్చిందంటూ ఓ వీడియో తెగ వైరల్ అయ్యింది. ఇంకేమంది లిస్టు రాకముందే, లీకైన పేరులో కొత్త పేరు వచ్చి చేరింది. అంతకు ముందు ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు లేదు. హటాత్తుగా వచ్చి చేరింది. ఇంతకీ ఏం జరిగిందన్నదానిపై ఎవరి వాదనలు ఎలా వున్నా? ఆది నుంచి నల్లగొండ జిల్లాకు చెందిన కోమటి రెడ్డి సోదరుల వైపే వేళ్లన్నీ చూపాయి. గత అసెంబ్లీ ఎన్నికల టిక్కెట్ల ప్రకటన సమయంలో కూడా అదిగో వచ్చే, ఇదిగో వచ్చే అంటూ ఊరించి ఊరించి ఆఖరుకు టిక్కెట్ ఇవ్వనేలేదు. అద్దంకి డిల్లీకి వెళ్లి వచ్చినా కూడా పని జరగలేదు. మొదటి లిస్టులోనే అద్దంకి పేరు అన్నారు. రెండో లిస్టు అన్నారు. ఆఖరు లిస్టులో కూడా హాండ్ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వస్తే అద్దంకికి మంచి స్ధానం వుంటుందన్నారు. దాంతో అద్దంకి దయాకర్ తన తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను గెలిపించాడు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి తెలంగాణ మొత్తం ప్రచారం చేశాడు. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఎంతో కృషి చేశాడు. అంతే కాదు ఆయన కాంగ్రెస్ విజయం కోసం, ఈసారి ఎలాగైనా పార్టీ అధికారంలోకి రావాలని సినిమా కూడా తీశాడు. అలా కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశాడు.
నిజానికి అద్దంకి దయాకర్ తెలంగాణ ఉద్యమ సమయంలోనే పెద్ద నాయకుడుగా గుర్తింపు పొందాడు.
వ్యక్తిగతంగా మంచి నాయకుడుగా కీర్తిని పొందాడు. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వైపు అడుగులు వేశాడు. ఆయన ఆనాడే టిఆర్‌ఎస్ వైపు కాలు కదిపితే ఆయన రాజకీయ భవిష్యత్తు మరో రకంగా వుండేదేమో? కాని ఆయన పోరాడే మనత్తత్వం. పోరాటం నుంచే నాయకుడయ్యాడు. దాంతో ఆయన కాంగ్రెస్ వైపు నిలిచాడు. అయితే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ప్రజలు 2014లో పట్టం కడతారని అనుకున్నాడు. రాజకీయ వ్యూహంలో ఆనాడే తొలి తప్పటడుగు వేశాడు. కాంగ్రెస్ ఆ సమయంలో టిక్కెట్ ఇచ్చింది. కాని అద్దంకి గెలవలేదు. అయినా కాంగ్రెస్‌లోనే వున్నాడు. ఎంతో మంది కాంగ్రెస్‌ను వీడారు. టిఆర్‌ఎస్‌లో చేరారు. కాని అద్దంకి అక్కడే వున్నాడు. 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఎన్నికల పలితాల సమయంలో అద్దంకి గెలిచాడనే ముందు ప్రకటించారు. కాని తర్వాత తక్కువ మెజార్టీతో ఓడిపోయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయినా ఆయన కుంగిపోలేదు. రాజకీయ అవసరాల కోసం ఎటు వైపు చూడలేదు. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తూ వచ్చాడు. కాని ఈసారి టికెట్ రాలేదు. అయినా ఆయన పార్టీని వదిలేయలేదు. పార్టీ కోసం విసృతంగా ప్రచారం చేశారు. పార్టీ గెలుపుకు ఎంతో కృషి చేశాడు. అంతే కాదు ఎన్నికల సమయంలో టిక్కెట్ల ప్రకటనప్పుడే అద్దంకి దయాకర్ మంత్రి వెంకటరెడ్డి కాళ్లు కూడా మొక్కాడు. తర్వాత మంత్రి వర్గ కూర్పు సమయంలో కూడా వెంకటరెడ్డి ఆశీస్సులు తీసుకున్నాడు. ఏనాటికైనా అద్దంకి మంత్రి కావాల్సిన వాడు..అంటూ దీవించాడు. కాని ఎమ్మెల్సీ ప్రకటన ఆగిపోయింది. అడ్డుకున్నవారు ఎవరు? అన్న ప్రశ్నకు మళ్లీ వేళ్లన్నీ ఆ సోదరుల వైపే చూపించాయి.
అసలు అద్దంకి చేసిన తప్పేమిటి?
ఆది నుంచి ఆయనకు అన్యాయం జరుగుతూనే వుంది. కాంగ్రెస్ పార్టీ వీడిన రాజగోపాల్‌రెడ్డి విషయంలో అద్దంకి కాస్తకటువుగా మాట్లాడాడు. మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డి ఓటమికి పనిచేశాడు. ఇదే ఆయన చేసిన పెద్ద పొరపాటు. అయితే రాజగోపాల్‌రెడ్డిపైన అద్దంకి నోరు పారేసుకోవడాన్ని జీర్ణించుకోలేని మంత్రి వెంకటరెడ్డికి ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా క్షమాపణ చెప్పాడు. అయితే అప్పుడు అద్దంకికి పూర్తిస్ధాయిలో రేవంత్‌రెడ్డి మద్దతు వుందన్న ప్రచారం జరిగింది. ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వూలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ అద్దంకికి మంచి స్ధానం లభిస్తుందనే చెప్పారు. కాని ఇంత ప్రచారం జరిగినా అద్దంకికి హ్యాండే మిగిలింది. ఇప్పుడు ఆయనను ఎంపిగా పంపించాలన్న ఆలోచనతోనే అద్దంకి పేరు పక్కన పెట్టాల్సివచ్చిందని అధిష్టానం అంటున్నట్లు కూడా మళ్లీ కొత్త కథ వినిపిస్తోంది. అంటే రెడ్డెచ్చె కధ మొదలాయే? అన్న సామెత గుర్తు చేసుకుంటున్నారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఒకసారి, నాయకులు ఆగ్రహంతో ఒకసారి, ఇలా అద్దంకికి పదవులు వాయిదా పడుతూ వస్తాయా? వరిస్తాయా? అన్నది కాలమే సమాదానం చెప్పాలి.