
Politics Blocks Road Development in Ainavolu
ప్రజా సంక్షేమంపై రాజకీయ పంతాలా???
మంజూరైన రోడ్డును అడ్డుకున్నది ఎవరు??
గ్రామంలో రోడ్డు వేయడానికి కాంట్రాక్టర్లు వెనుకంజ వేస్తున్నారా??
20 ఏళ్లుగా రోడ్డు కోసం కాలనీవాసుల ఎదురుచూపులు
పట్టించుకోని అధికార పార్టీ నేతలపై సర్వత్ర విమర్శలు
నేటి ధాత్రి అయినవోలు :-
అయినవోలు మండల కేంద్రంలోని ఓ వార్డుపై అధికార పార్టీ నేతలు కావాలనే వివక్ష చూపుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీల మధ్య భేదాభిప్రాయాలు ఉంటే ఎన్నికల అప్పుడు చూసుకోవాలి గాని ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో ప్రభుత్వం చే మంజూరైన రోడ్డును రాజకీయ కుట్రలతో పనులు చేయకుండా నిర్లక్ష్యం చేసి మంజూరైన నిధులు వెనక్కి పోయేలా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అయినవోలు మండల కేంద్రంలోని ఏడో వార్డు మాడిశెట్టి సోమయ్య ఇంటి వద్ద నుంచి గడ్డం చిట్టీ సమ్మయ్య ఇంటి వరకు సిసి రోడ్డు వేయాలి అన్న స్థానికుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం గత సంవత్సరంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద 5 లక్షలు మంజూరు ఇచ్చింది. వాటి పనులు ప్రారంభించాలని మస్టర్లు కూడా ఇచ్చింది.
అయితే కొంతమంది స్థానిక రాజకీయ నాయకులు కుట్రపూరితంగా రోడ్డు పనులు జరగకుండా అడ్డుకొని నిధులు వెనుక వెళ్లేలా పావులు కలిపినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇందుకు వారు చెబుతున్న కారణం అట్టి రోడ్డు పనులు చేయడానికి ఏ కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదని అందువల్లనే రోడ్డు పనులు చేయడం లేదని గ్రామపంచాయతీ వర్గాలు తెలిపాయి.అయితే అదే సమయంలో
గ్రామంలో అధికార పార్టీ నాయకులు అంతగా ప్రాముఖ్యత లేని చోట డ్రైనేజీలు రోడ్లు నిర్మించినట్లు అందుకు గ్రామపంచాయతీ సహకరించి సకాలంలో సంబంధిత బిల్లులు ఇప్పించినట్టు ఆరోపణలు ఉన్నాయి. కావాలనే గత 20 ఏళ్లుగా రోడ్డు సౌకర్యం కల్పించమని స్థానికులు కోరినా నాయకులు రోడ్డు వేయడానికి ఆ దారిలో పాత నిర్మాణాలు అడ్డుగా ఉన్నాయని సాకుగా చూపి ఇన్నాళ్లు దాటవేత ధోరణి ప్రదర్శించారు. దాంతో స్థానిక ప్రజలు అడ్డుగా ఉన్న తమ నిర్మాణాలను స్వచ్చందంగా కూల్చివేసి రోడ్డు వేయాలని కోరగా గత మార్చి 10న ప్రతిపాదనలు పంపగా మార్చి 12న ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ కింద రోడ్డు మంజూరు చేసింది. అయితే రూరల్ డెవలప్మెంట్ కింద వచ్చిన ఈ నిధులు వినియోగించుకోకపోతే వెనక్కి వెళ్తాయని తెలిసి కూడా కార్య(దర్శి)క్రమాలు చేపట్టాల్సిన అధికారి అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులు వత్తుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించగా ప్రభుత్వం మంజూరైన నిధులను వెనక్కి తీసుకుంది. దాంతో ఆగ్రహించిన స్థానికులు సదరు అధికారిని వెళ్లి నిలదీయగా అధికార రాజకీయ ఒత్తిళ్ళ కారణంగా కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రావడం లేదని అని చెప్పి ముఖం చాటేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. అయితే అప్పటి వరకు మండల పరిషత్ ను గ్రామపంచాయతీని తన కనుసైగలతో శాసించిన వారిని స్థానికులు ఇదే విషయంపై నిలదీయగా.. అసలు రోడ్డు మంజూరైనట్టు తనకు తెలియదని చెప్పడం కోసం కొసమెరుపు…..
ఈ విషయం పై పూర్తి వివరాలు గ్రామపంచాయతీ కార్యదర్శిని ఫోన్లో సంప్రదించడానికి నేటిధాత్రి ప్రయత్నించగా ఫోన్లో కార్యదర్శి అందుబాటులోకి రాలేదు…