-జాతర కమిటీ డైరెక్టర్లకు తీవ్ర అవమానం
-అధికార పార్టీ జోక్యంతో అనర్హులకు పెద్దపీట
-జాతర నిర్వహణ సజావుగా సాగేనా
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
మండలంలోని ముల్కలపల్లి-మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించే శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర కమిటీకి పొలిటికల్ సెగ తగిలి..జాతర కమిటీ డైరెక్టర్లకు తీవ్ర అవమానం జరిగిందని ఆరోపణలు వినవస్తున్నాయి. అధికార పార్టీ జోక్యంతో అనర్హులకు పెద్దపీట వేయడంతో..జాతర నిర్వహణ సజావుగా సాగేనా అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1977 సంవత్సరంలో రెండు గ్రామాలకు చెందిన కొంతమంది సభ్యులుగా..డైరెక్టర్లుగా చేరి..కొంత రుసుం చెల్లించి..సభ్యత్వం పొందారు. నాటి నుండి నేటి వరకు రెండు గ్రామాలకు చెందిన డైరెక్టర్లు జాతర నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసుకొని..వనదేవతలైన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణను ఘనంగా నిర్వహించుకునే వారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతరకు రాజకీయ గ్రహణం పట్టుకుని, అధికార పార్టీ నాయకుల జోక్యంతో జాతర నిర్వహణ ఏర్పాట్లు సజావుగా సాగేలా లేవని ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ జాతర నిర్వహణకు గత కొన్ని రోజుల క్రితమే కమిటీ ఏర్పడ్డప్పటికీ, మండలంలోని కొంతమంది అధికార పార్టీ నాయకులు, ఈ కమిటీని కాదని దేవాదాయ శాఖ కమిషనర్ పై ఒత్తిడి తెచ్చి అనర్హుల పేర్లతో నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నట్లు వారికి వారే ప్రకటించుకున్నారు. దీంతో అర్హులైన కమిటీ డైరెక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇట్టి విషయమై అర్హులైన డైరెక్టర్లు దేవాదాయ శాఖ కమిషనర్ అనర్హుల జాబితాతో ప్రకటించిన లెటర్ తో హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలియవచ్చింది. శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహణ కోసం ఉపయోగించే భూమి ముల్కలపల్లి రెవెన్యూ గ్రామ శివారులో ఉంది. దీంతో రెండు గ్రామాల మధ్యన చిచ్చుపెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.