`బంధాలన్నీ నకిలి… ఆస్తులే కలిమి!
`రాజకీయ కుటుంబాలు.. పంపకాలలో విభేదాలు!
`ప్రేమలన్నీ పై పైనే.. లోపలంతా విషమే.
`అడిగినవన్నీ ఇస్తే సంతోషమే.. అంతా గందరగోళమే.
`పరువు లేదు.. పరపతి కాదు.. డబ్బుకు లోకం దాసోహమే.
`అనుబంధాలన్నీ ఆస్తుల కోసమే!
`ఆస్తుల దాకా వస్తే అందరూ అంతే!
`డబ్బు ఎంత వారినైనా విడదీస్తుంది.
`వైస్ విజయమ్మ ఉత్తరం తో మరోసారి బైట పడింది.
`సాక్షి పత్రికలో వచ్చిన వార్త అబద్దమని సూటిగానే చెప్పింది.
`సాక్షి లో వచ్చిన వార్త సాక్షిగా ధనమే మూలం.
`జగతి అంతా డబ్బు చుట్టే ప్రదక్షిణం.
`ఎవ్వరూ అతీతులు కాదు.. డబ్బంటే ఎవరికీ చేదు కాదు.
`తల్లి తండ్రి కూడా మినహాయింపు కాదు.
`రాజకీయ నాయకులంతా ఆస్తుల బందీలే!
`తాజాగా వై ఎస్ విజయమ్మ ఉత్తరం అందులో భాగమే!
`చెల్లికి అన్యాయం అన్న చేయలేదు అని వైసీపీ నాయకుల వాదన.
`చెల్లికి అన్న అన్యాయం చేశాడని స్వయంగా తల్లి ఆవేదన.
`ఇవి కూడా రాష్ట్ర సమస్యలే.. ప్రజా సమస్యల కన్నా పెద్దవే.
`ప్రజల్లో చర్చించుకునే అంశాలే!
`రాజకీయ రగడలో బాగాలే!
`రాజకీయ కుటుంబాలలో కొత్తేమి కాదులే.
`ఇందిరా గాంధీ కుటుంబం నుంచి ఉన్నదే.
`ఎన్టీఆర్ కుటుంబం లో జరిగిందే.
`కెసిఆర్ కుటుంబం లో కలతలకు కారణమదేలే.
`వైస్ కుటుంబం లో కొంత కాలంగా నలుగుతున్నదే.
`రాజకీయాల సంపాదన లోగుట్టులన్ని జనానికి తెలిసినవే.
`కూతురు రాజకీయం కోసం తల్లి విజయమ్మ ఆరాటం.
`కొడుకు రాజకీయం ఏమైనా పర్వాలేదన్న దైర్యం.
`పిల్లల విషయంలో తల్లి దండ్రుల ఆలోచనలకు ఇదే నిదర్శనం.
`తల్లిదండ్రులలో కూడా పిల్లల ప్రేమలో స్వార్దాలు ఉంటాయానేది నిజం.
`కడుపులో పుట్టిన పిల్లలే అయినా అమ్మ ప్రేమ లో వ్యత్యాసాలకు సాక్ష్యం.
హైదరాబాద్, నేటిధాత్రి:
ఏ బంధమైనా సరే ధనంతోనే ముడిపడి వుంటుంది. ఏ చరిత్ర చూసినా ఇదే కనిపిస్తుంది. అది రాజ్యమైనా, రాజరికమైనా,రాజకీయమైనా, ఆఖరుకు పేదరికమైనా సరే బంధాలన్నీ డబ్బుతోనే ముడిపడి వుంటాయి. ధనం మూలమిదం జగత్ అని పెద్దలు ఊరికే అనలేదు. అందుకే లెక్కల్లో తేడాలొస్తే అంతే..అది ఎంతటి వారికైనా పంచాయితీకి ఆజ్యమే. రామాయణం చూసినా కనిపించేది ఇదే. బారతం మొత్తం కనిపించేది ధనమే. ఐదు ఊర్లు ఇచ్చేందుకు కూడా కౌరవులు ఒప్ప్పుకోకపోవడమే మహాభారతం. పెద్ద కొడుకును కాదని చిన్న కొడుకుకు పట్టం కట్టడమే రామాయణం. మనమెంత మావన మాత్రులమని అనుకుంటూనే పోరు లేనిదే ఈ కుటుంబం కలిసి లేదు. అది తరాలు మారినా బందానికి ఎన్ని బాంధవ్యాలు తోడైనా సరే దనంతోనే ఆత్మీయం. ధనంతోనే శత్రుత్వం. ధనమే అన్ని వినాశకాలకు మూలం. అనుబంధాలన్నీ ట్రాష్. అందుకే ఎంత పెద్ద కుటుంబమైనా ఎప్ప్పుడో అప్ప్పుడు రోడ్డున పడాల్సిందే. పది మంది ముందు పంచాయితీ పెట్టాల్సిందే. తాజాగా దివంగత వైఎస్ కుటుంబానికి చెందిన ఆస్తుల పంపకాలు, అన్నా చెల్లళ్ల మధ్య ముదిరిన పోరుకు సంబంధించిన ఓ వార్త వచ్చింది. ఏపి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన చెల్లి షర్మిలకు ఇవ్వాల్సింది ఇచ్చారని ఆ వార్త సారాంశం. ఎంతో ఉదారంగా తన చెల్లెలు కోసం అన్న జగన్ ఇవ్వాల్సిందానికన్నా ఎక్కువే ఇచ్చారనేది వైసిపి నుంచి వినిపిస్తున్న బలమైన వాదన. దానికి జగన్ తల్లి విజయమ్మ అదే రోజు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. వైసిపి పార్టీ చేస్తున్న ప్రచారం అబద్దమని తేల్చేసింది. షర్మిలకు రావాల్సిన పంపకాలు పూర్తి కాలేదన్నది ఆమె లేఖలోని సారాంశం. ముఖ్యంగా సరస్వతీ సిమెంట్‌తోపాటు ఇతర ఆస్ధులలో వాటాలు అందలేదని, సాక్షిలో వచ్చిన కధనం నిజం కాదని విజయమ్మ తేల్చి చెప్పింది. వైఎస్. రాజశేఖరరెడ్డి బతికివున్నప్ప్పుడు వున్న ఆస్ధి ఇద్దరు పిల్లలకు సమానమని, వారి వారసులకు సమానంగా పంచాలని కోరుకున్నాడని విజయమ్మ చెబుతోంది. ఆ విషయాలు తనకు, పైనున్న దేవుడు, జగన్‌కు తెలుసంటూ ఆ లేఖను ముగించారు. అంటే ఇంత కాలం పదవుల పంచాయితీ అని అందరూ అనుకున్నారు. జగన్ తన సొంత చెల్లికి అన్యాయం చేశాడని రాజకీయంగా ఇతర పార్టీలు వాడుకున్నాయి. జగన్ జైలులో వున్నప్ప్పుడు షర్మిల పాదయాత్ర చేసిందని, పార్టీకోసం ఎంతో కష్టపడిందని అనేక వార్తలున్నాయి. నిజమే కావొచ్చు. కాని జగన్ జైలు నుంచి విడుదల కాకపోతే పార్టీ బాద్యతలు తన చూసుకోవాల్సి వస్తుందన్న ఆలోచనతో కూడా షర్మిల పార్టీకోసం పనిచేసిందనే వార్తలు కూడా వున్నాయి. జగన్ మొదలు పెట్టిన ఓదార్పు యాత్రను కూడా ఆమె చేపట్టడంతో అన్నమీద ప్రేమతో కాదనే వార్తలు కూడా వున్నాయి. పైగా షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసుకునే సమయంలో ఏకంగా 250 కోట్ల రూపాయలు కూడా ఇచ్చినట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి. జగన్ తన చెల్లికి ఎలాంటి అన్యాయం చేయలేదన్నది వైసిపి బలంగా చెబుతున్న మాట. ఈ మాట జగన్ నోటి నుంచి కాకుండా పార్టీ శ్రేణుల నుంచి రావడం వల్ల తల్లి విజయమ్మ మీడియాకు లేఖ విడుదల చేసిందనేది కూడా ప్రచారంలో వుంది. ఏది ఏమైనా ఏ కుటుంబమైనా సరే ముందు పదవుల పంపకాల విషయంలో రాద్దాంతాలు మొదలై, ఆఖరు ఆస్తుల పంపకాలు తెరమీదకు వస్తాయన్నది మరోసారి రుజువైంది. అన్న బాగుంటే చాలు. అమ్మ బాగుంటే చాలు. కొడుకు బాగుంటే చాలు అనేకునే రోజులు ఎప్ప్పుడూ లేవు. ఇప్ప్పుడు కూడా వైఎస్ కుటుంబంలో ఇదే కనిపిస్తోంది. కాని అక్కడకడ్క కొన్ని కుటుంబాలు వున్నాయి. అన్న కోసం చెల్లెలు త్యాగం కనిపిస్తుంది. చెల్లెలు కోసం అన్న త్యాగం కూడా కనిపిస్తుంది. వాటిని ఆదర్శంగా తీసుకుంటారని అనుకుంటాం. కాని అలాంటి మంచి విషయాలు ఎవరూ ఆదర్శంగా తీసుకోరు. తమిళనాడులో కరుణానిధి కుటుంబంలో కూడా గతంలో ఇలాంటి పంచాయితీలే మొదలయ్యాయి. కనిమొలి ఇలాంటి రాజకీయాలకు భిన్నంగా ఆదర్శంగా నిలిచింది. నిజానికి కనిమొలి రాద్దాంతం చేస్తే అక్కడ రాజకీయం మరోలా వుండేది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు కనిమొలి చెల్లెలే ..కాని సొంత చెల్లెలు కాదు. కరుణానిధికి ఇద్దరు భార్యలు. ఇలా సవతి తల్లులు సంతానమే కరుణానిధి కుటుంబం. అయినా తన తండ్రి పేరు శాశ్వతంగా నిలిచిపోవాలంటే అన్నతో విభేదాలకన్నా, సఖ్యతే ముఖ్యమని కనిమొలి అనుకున్నారు. అన్నకు తోడుగా నిలిచారు. పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. స్టాలిన్ తర్వాత ఆయన కొడుకు ఉదయ్ నిధి వారసుడుగా కనిపిస్తున్నా, కనిమొలి సహకరిస్తూనే వుంది. అందుకే అక్కడ రాజకీయ గొడవలు లేవు. ఆస్ధుల పంపకాలపై పేచీలు లేవు. కాని తెలుగు రాష్ట్రాలలో రెండు పార్టీలలోనూ ఇదే కనిపిస్తోంది. ప్రజలకు కూడా ఇలాంటి వార్తలే ఆసక్తిగా వుంటాయి. తెలంగాణ ప్రజలు ఎట్టిపరిస్ధితుల్లో షర్మిలను ఆదరించరని తెలిసినా ఆమె మొండితనంతో పార్టీ పెట్టింది. పుట్టిల్లు ఆంద్రా అయితే మెట్టినిల్లు తెలంగాణ. ఆడపిల్లకు అత్తవారిల్లే అసలైన ఇల్లు అని షర్మిల చెప్పింది. తెలంగాణలో పార్టీ పెట్టింది. ఏమైంది. ప్రజలు తిరస్కరించారు. ఎంతో మంది హితవు పలికారు. కాని షర్మిల వినలేదు. తెలంగాణలో తాను ప్రత్యామ్నాయం అనుకున్నారు. కాని జనం తిరస్కరించారు. దాంతో మళ్లీ షర్మిల ఏపికి వెళ్లారు. మళ్లీ సొంత అన్నకే బల్లెమయ్యారు. అన్న రాజకీయాన్ని అడ్డుకున్నారు. అన్నను ఓడించడమే ధ్యేయంగా రాజకీయాలు చేశారు. అన్నను ఓడించారు. ఇంత చేసి ఇప్ప్పుడు ఆస్ధుల పంపకాలు అంటే ఏ అన్న అయినా ఒప్ప్పుకుంటారా? షర్మిల చేసిందాంట్లో న్యాయముందని ఎవరైనా అనుకోవడం లేదు. కాని ఆమె మాత్రం తాను చేస్తున్నదే కరక్టు అని అనుకోవడంలో కూడా తప్ప్పులేదు. దాదాపు అదే పరిస్దితి కేసిఆర్ ఇంట్లో కూడా చూడొచ్చు. ఇక్కడ అది రాజకీయ పంచాయితీలాగానే కనిపించేలా వ్యహరిస్తున్నారు. ఎక్కడో తేడా కొడుతుందన్న సంగతి అందరూ అనుకున్నదే. లేకుంటే పదవుల పంచాయితీ అనేది ప్రభుత్వంలోవున్నప్ప్పుడు జరగాలి. పార్టీ అదికారంలో వున్నప్ప్పుడు తన ప్రాదాన్యతల గురించి ప్రశ్నించాలి. తనకు జరిగిన అన్యాయం గురించి చర్చించే అవకాశం వుంది. తనను ఓడించిన వారిని పార్టీ నుంచి పంపించేంత శక్తి కూడా అప్ప్పుడు కవితకు వుంది. తన ఓటమికి కారణమైన వారిని ఇబ్బందులకు గురిచేసే శక్తి కూడా వుంది. అంతెందుకు పెద్ద పెద్ద నాయకులు కూడా ఆ సమయంలో నోరు తెరిచేందుకు కూడా భయపడేవారు. తమ అభిప్రాయాలను కూడా ధైర్యంగా చెప్ప్పుకునే స్వేచ్ఛ లేదు. మంత్రులు కూడా నేరుగా ప్రగతి భవన్‌లోకి వేళ్లే పరిస్దితి కనిపించలేదు. అప్పాయింటు మెంటు వుంటే తప్ప ఎంత పెద్ద నాయకుడైనా సరే వెళ్లేందుకు వీలు లేదు. కాని కవితకు అలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆమె కుటుంబ సభ్యురాలు. పైగా స్వయంగా కేసిఆర్ కన్న కూతురు. బంధువులకే లేని కష్టాలు కవితకు వున్నాయంటే ఎవరైనా నమ్ముతారా? అందుకే కవిత విషయంలో కూడా నిఘూడంగా దాగిన వున్న నిజమదే అని అంటున్నారు. ఎప్ప్పుడో అది బైట పడకుండా వుండేది కాదని అంటున్నారు. ఇలా రాజకీయ పార్టీ విషయంలో ఆస్ధుల పంచాయితీ ఈనాటిది కాదు. ఇందిరాగాంధీ కాలం నుంచే మన రాజకీయాల్లో కనిపిస్తుంది. ఇందిరాగాంధీ ప్రధానిగా వున్న సమయంలో రాజీవ్‌గాంధీ క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఆయన రాజకీయాýకే దూరంగా వున్నారు. ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ ఆ రోజుల్లోనే డిఫాక్టో పిఎంగా పనిచేసినంత పనిచేశారు. ప్రతి విషయంలోనూ నిర్ణయం సంజయ్‌గాంధీ తీసుకున్నట్లు కూడా ఇప్పటికీ ఆ తరం నాయకులు చెబుతుంటారు. పైగా ఆ రోజుల్లో రచయితలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాసిన పుస్తకాలలోనూ వివరించారు. ఎప్ప్పుడైతే సంజయ్ గాంధీ మరణించారో అప్ప్పుడు రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. తల్లి ఇందిరాగాందీ మరణంతో పూర్తి స్తాయి నాయకుడు కావాల్సి వచ్చింది. అప్పటి నుంచి రాజీవ్ గాందీ, సంజయ్‌గాంధీ కుటుంబాల మధ్య దూరం పెరిగింది. ఆస్ధుల గొడవలు, పదవులు గొడవలు, అదికారం వంటి వాటిపై అంతర్గతంగా పెద్దఎత్తున చర్చలు జరిగాయి. ఆస్దిపాస్తుల ముందు అన్నీ బలాదూరే అని ఇందుకే అంటారేమో!!
