లిఫ్ట్ ప్రమాదంలో గాయపడిన సెక్రటేరియట్ మాజీ సిఎస్ఓ తోట గంగారాం మృతి..
* సిరిసిల్ల జిల్లాలో పోలీస్ విషాద దుర్ఘటన ప్రమాదం..
సిరిసిల్ల టౌన్:(నేటి ధాత్రి)
స్పెషల్ పోలీస్ 17వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ గా పనిచేస్తున్నారు. గతంలో ఆయన తెలంగాణ సచివాలయానికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వర్తించారు…
లిఫ్ట్ ప్రమాదంలో గాయపడిన సెక్రటేరియట్ మాజీ సిఎస్ఓ తోట గంగారాం మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17వ పోలీస్ బెటాలియన్ కు చెందిన కమాండెంట్ తోట గంగారాం(58) సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ అపార్ట్ మెంట్ లో సోమవారం అర్ధరాత్రి డిన్నర్ చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు లిఫ్ట్ వద్ద కొద్దిసేపు వెయిట్ చేశారు. ఏదో సౌండ్ రావడంతో లిఫ్ట్ వచ్చిందనుకొని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లగా కింద పడ్డారు. తీవ్రగాయాలపాలైన ఆయనను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే గంగారాం చనిపోయారని నిర్ధారించారు.
బెటాలియన్ కమాండెంట్ తోట గంగారాం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దులం గ్రామానికి చెందిన వారు. కాగా, ఆయనకు భార్య రేఖ, ఒక కొడుకు సతీష్ కుమార్, ఇద్దరు కూతుర్లు గౌతమి, మీనల్ ఉన్నారు. గంగారాం మృతితో పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. ఆయన మృతి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మరియు జిల్లా పోలీసు అధికారులు నివాళి తెలిపారు.