
"Police Issue Guidelines for Vinayaka Festival"
వినాయక ఉత్సవ కమిటీ సభ్యులకు పోలీసువారి ఆంక్షలు
మందమర్రి నేటి ధాత్రి
వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ప్రజలకు సూచించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, డిఐజి (ఐపీఎస్), మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపీఎస్, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ ల ఆదేశాల మేరకు మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) శశిధర్ రెడ్డి గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు పండుగను ఆనందంగా జరుపుకునే క్రమంలో భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.గణేష్ మండపాల ఏర్పాట్లు గురించి పోలీస్ వారికి సమాచారం అందించాలని, విగ్రహం సైజు, బరువు, ఉత్సవాల తేదీలు, నిమజ్జనం వివరాలు, కమిటీ సభ్యుల సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేయాలి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుని, అనుభవజ్ఞులైన వారి ద్వారా మాత్రమే విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయించుకోవాలి. గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ, విద్యుత్ శాఖల నుండి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. వివాదాస్పద స్థలాల్లో మండపాలు ఏర్పాటు చేయకూడదు.
జాగ్రత్తలు పాటించాలి
మండపాల వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిర్వాహకులు పూర్తి బాధ్యత వహించాలి. రాత్రిపూట కనీసం ఇద్దరు కమిటీ సభ్యులు కాపలాగా ఉండి, చిన్న పిల్లలు, వృద్ధులను మండపాల వద్ద పడుకోనివ్వరాదు. మండపంలో మండే స్వభావం ఉన్న పదార్థాలు లేదా పటాకులు ఉంచకూడదు. అగ్నిప్రమాదాలు జరిగితే వాటిని అదుపు చేయడానికి ఇసుక, నీటిని సిద్ధంగా ఉంచుకోవాలి.
ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలి. ఇతర మతాలు, కులాలను కించపరిచే పాటలు లేదా అసభ్యకరమైన పాటలు పెట్టరాదు. గణేష్ మండపం వద్ద లేదా ఊరేగింపులో డీజేలను వాడటం పూర్తిగా నిషేధం. ఊరేగింపు సమయంలో ముస్లిం ప్రార్థనల వేళ మసీదుల వద్ద మైకులు ఆపి, ప్రశాంతంగా వెళ్ళాలి. మండపాలు ట్రాఫిక్కు అంతరాయం కలిగించకుండా ఏర్పాటు చేయాలి.
నిమజ్జనం మరియు పర్యావరణ పరిరక్షణ
నిమజ్జనం రోజున పోలీసులు సూచించిన మార్గాల్లో మాత్రమే ఊరేగింపు నిర్వహించాలి. ఊరేగింపు నిర్ణీత సమయంలోగా పూర్తయ్యేలా చూసుకోవాలి. ఊరేగింపు సమయంలో వాలంటీర్లను నియమించుకుని, కమిటీ సభ్యులు విగ్రహంతో పాటు ఉండాలి. మద్యం తాగి నిమజ్జనంలో పాల్గొనరాదు. సమావేశం సందర్భంగా పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి గణపతులను పూజించాలని సీఐ శశిధర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మట్టి గణపతులను నిర్వాహకులకు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో ఎస్ఐ రాజశేఖర్, ఎలక్ట్రిసిటీ ఏఈ, గణేష్ మండపాల నిర్వాహకులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.