
Roti Poison Case.
రోటీ పిండిలో విషం.. భర్త సహా 8 మందిని లేపేయాలని ప్లాన్..
భర్త, అతడి కుటుంబీకులను చంపేందుకు ఓ కోడలు మహత్తరమైన స్కెచ్ వేసింది. విషం కలిపిన గోధుమ పిండితో చపాతీలు తయారుచేసి అత్తమామల కుటుంబాన్ని లేపేయాలని ప్లాన్ చేసింది. ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసిన ఈ దారుణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
ఇష్టం లేని పెళ్లి చేశారనో.. ప్రియుడి కోసమో.. భర్త నచ్చలేదనో.. ఇలా ఏదొక కారణంతో కట్టుకున్న మొగుణ్ని దారుణంగా మర్డర్ చేసే భార్యల గురించి ఈ మధ్య తరచూ వినే ఉంటారు. కానీ, ఈ మహిళ స్టైలే వేరు. భర్త తిట్టాడని కాదు.. తోడికోడలు నవ్విందని అన్నట్టుగా.. ఓ మహా ఇల్లాలు వదినతో గొడవ జరిగిందని భర్తను, అతడి తరపు ఫ్యామిలీని చంపేందుకు మహత్తరమైన ప్లాన్ వేసింది. ఒకే దెబ్బతో అందరినీ లేపేయాలనే కసితో విషం కలిపిన గోధుమపిండితో చపాతీలు తయారుచేసి అందరికీ తినిపించాలని కుట్ర పన్నింది.
కరారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కియా బాజా ఖుర్రామ్ గ్రామంలో జరిగిన ఈ ఘటన జరిగింది. రోజువారీ తగాదాలు, మానసిక హింసతో విసిగిపోయిన మాల్తీ తండ్రి ప్రసాద్, సోదరుడు బజరంగీతో కలిసి ఈ కుట్ర పన్నింది. ఇంట్లో కలహాలు మొత్తం కుటుంబాన్నే చంపాలనే నిర్ణయానికి దారి తీస్తాయని తెలుసుకుని స్థానికుల ఆశ్చర్యపోతున్నారు. మాల్తీ దేవికి ఆమె వదిన, అత్తమామలతో తరచూ గొడవలయ్యేవని గ్రామస్థులు అంటున్నారు. ఈ మొత్తం ఘటన గురించి మాల్తీ భర్త బ్రిజేష్ కుమార్ వెంటనే కరారి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
వెంటనే పోలీసులు రంగంలోకి దిగి మాల్తీతో పాటు ఆమె తండ్రి, సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. విషం కలిపిన గోధుమ పిండిని స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ప్రణాళిక, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనే అభియోగాలతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తులో భాగంగా ముగ్గురినీ విచారణ చేస్తున్నారు. అయితే, ఇప్పటికే నిందితులు నేరాన్ని అంగీకరించారు. ఫోరెన్సిక్ దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముంది.