రేపటి పౌరుల భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం!

https://epaper.netidhatri.com/

బావిబడి జీవితం బంగారుమయం

బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బి. వినోద్‌ కుమార్‌,

నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న విషయాలు..ఆయన మాటల్లోనే..

తెలంగాణలో విద్యా విప్లవం.

`ప్రభుత్వ విద్యా వ్యవస్థ పటిష్టం.

`త్వరలో ప్రాధమికోన్నత పాఠశాలకు మహార్థశ.

`పిల్లల నోటికాడి ముద్ద లాగేస్తారా?

 

`ఇదేనా ప్రతిపక్షాలు విధానం!

`బడి పిల్లల ఉపాహారం మీద విమర్శలా?

`గురుకుల విద్యార్థులకు చేపల కూరతో భోజనం పెట్టడాన్ని ఎన్నికలకు ముడిపెడతారా?

 

`ఎన్నికల స్టంట్‌ అని వ్యాఖ్యలా!

`బీఆర్‌ఎస్‌ ను విమర్శించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి?

`కేంద్రం 2020లో దేశ వ్యాప్తంగా బడి పిల్లలకు అల్పాహారం ప్రకటించారు?

`ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదు?

`పిల్లలకు ఉపాహారం పెట్టేందుకు కేంద్రం వద్ద నిధులు లేవా?

`పిల్లలంటే ప్రతిపక్షాలకు ఎంత చులకనో అర్థమౌతోంది!

`ప్రధాని మోడీ పసుపు బోర్డు ఇప్పుడెందుకు ప్రకటించారు?

`ఐదేళ్లనుంచి ఎందుకు చేయలేదు?

`పసుపు బోర్డు కన్నా మంచిది ఇచ్చామని అప్పుడెందుకు చెప్పారు?

`వరంగల్‌ స్పైసీ బోర్డు నుంచి ఒక వింగ్‌ నిజామాబాదు కు తరలించి గొప్పలు చెప్పుకున్నారు.

`అబద్దాల పునాదుల మీద బిజేపి నాయకులు రాజకీయాలు చేస్తున్నారు.

`రాజస్థాన్‌ లో కాంగ్రెస్‌ సిలిండర్‌ ధర ఇప్పుడే ఎందుకు తగ్గించింది?

`అది ఎన్నికల జిమ్మిక్కు కాదా?

`పిల్లలకు అన్నం పెట్టేందుకు వెనుకాడిన బిజేపికి బిఆర్‌ఎస్‌ ను విమర్శించే అర్హత వుందా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఎన్నికలంటే బిఆర్‌ఎస్‌ కు ఒక పవిత్ర యజ్ఞం. ప్రజల జీవితాలలో గొప్ప మార్పుకు సంకేతం. ఆ యజ్ఞంతోనే తెలంగాణ సాధించుకున్నాం. అదే కంకణ బద్దంగా తెలంగాణ అభివృద్ధికి బాటలు చేసుకున్నాం. ప్రపంచంలోనే ఇంత వేగమైన అభివృద్ధి ఎక్కడా జరిగింది లేదు. తొమ్మిదేళ్లలలో జరిగిన అభివృద్ధి అద్భుతం. కాదన్నారంటే వారి కుత్సిత, కుటిల మనస్తత్వాలకు నిదర్శనం. రాజకీయాలలో కాంగ్రెస్‌, బిజేపి నాయకులు అబద్దాలు మాట్లాడడం బాగా అలవాటు చేసున్నారు. తెలంగాణ లో అభివృద్ధి, ప్రగతి అంటే ఏమిటో అర్థం కూడా తెలియని వాళ్లకు పదవీ కాంక్షలు ఎక్కువైపోయింది. బిఆర్‌ఎస్‌ ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నామ్‌ చేయాలని తెలంగాణ వచ్చిన మరు క్షణం నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే వున్నారు. వారి అతి తేటలను, కుటిల మనస్తత్వాలను, దుర్నీతిని ప్రజలు ఎప్పకప్పుడు గమనిస్తూనే వున్నారు. అందుకే తెలంగాణ రాజకీయాలలో ఆ పార్టీలను ప్రజలు ఎప్పుడో దూరం పెట్టారు. అభివృద్ధి నిరోధకులుగా వాళ్లను ప్రజలు గుర్తించారు. రాజకీయాలకు మాత్రమే వారు పరిమితం. తెలంగాణ అభివృద్ధి కాంక్ష ప్రతిపక్షాలలో ఇసుమంతైనా లేదు. ఎంత సేపు అధికార యావ మాత్రమే కనిపిస్తున్నాయి. ఎంత దుర్మార్గమంటే పరీక్షలు రాసే విద్యార్థులను పుస్తకాలు వదిలిపెట్టమని పిలుపునిస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయమని ప్రోత్సాహిస్తున్నారు. ఇంత దుర్మార్గపు రాజకీయాలు ఎక్కడైనా వుంటాయా? రైతులకు ఇరవై నాలుగు గంటల కరంటు అవసరం లేదని ఒకరంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిపక్షాల దిగజారుడు తనం పరాకాష్టకు చేరింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉదయం అల్పాహారం పెట్టడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. బడి పిల్లలకు ఇంత మంచి పథకాన్ని ప్రభుత్వం తీసుకురావడాన్ని ప్రశంసించాలి. విజ్ఞులైతే అభినందించాలి. రాజకీయాలకు అతీతంగా స్పందించాలి. విద్యార్థులకు మేలు చేసే కార్యక్రమాలపై సూచనలు, సలహాలు ఇవ్వాలి. కానీ ప్రతిపక్షాలకు చెందిన నేతలకు విద్యార్థులకు మేలు చేయడం కూడా ఇష్టం లేదు. ఇక గురుకులాల విద్యార్థులకు చేపల కూరను కూడా మెనులో చేర్చడం జరిగింది. అది కూడా తప్పే అన్నట్లు రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాల వైఖరిని ప్రజలు బాగా గమనిస్తున్నారు. వారికి తప్పకుండా ప్రజలు మళ్ళీ గుణపాఠం చెబుతారు. అసలు ప్రజల్లో లేని పార్టీలు తమ ఉనికి కోసం పడే ఆరాటంలో ఆగమాగమౌతున్నారు. ఏం మాట్లాడుతున్నారో కూడా సోయిలేకుండా కూతలు కూస్తున్నారు. ఈసారి తెలంగాణ లో విద్యా విప్లవం ఎలా వస్తుందో అతి తొందరలోనే చూస్తామంటున్న మాజీ పార్లమెంటు సభ్యుడు ,రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బి. బినోద్‌ కుమార్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న విషయాలు… ఆయన మాటల్లోనే…
రానున్న రోజుల్లో తెలంగాణలో విద్యా విప్లవం రానున్నది.
ఇప్పటికే తెలంగాణలో వెయ్యికి పైగా సంక్షేమ గురుకుల పాఠశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా స్కూళ్లలో పేద విద్యార్థులకు నాణ్యమైన భోజన వసతులు, ఉత్తమ భోధన, భద్రత కల్పన జరుగుతోంది. పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు కేజి టు పిజి విద్య అందుతోంది. దాంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ మరింత పటిష్టమైంది. తెలంగాణ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అనేక ప్రశంసలు అందుకుంటోంది. కానీ అవి మన రాష్ట్ర ప్రతిపక్షాలకు కనిపించవు. దేశాలోనే స్వచ్చ సర్వేక్షన్‌ అవార్డులు తెలంగాణ కు సింహ భాగం ఏటా వస్తున్నాయి. బిజేపి పెద్దలు డిల్లీలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తారు. తెలంగాణ కు వచ్చి ఏవేవో మాట్లాడి పోతుంటారు. అందుకే ఎవరెన్ని మాట్లాడినా తెలంగాణ అభివృద్ధి అన్నది ఒక్క బిఆర్‌ఎస్‌ మాత్రమే చేయగలదు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ మాత్రమే తెలంగాణ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అందుకే రేపటి పౌరుల భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధమౌతున్నాయి. త్వరలో ప్రాధమికోన్నత పాఠశాలకు త్వరలో మహార్థశ రానున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ భోదన తెలంగాణలో చూస్తున్నాం. రానున్న రోజుల్లో మన విద్యా వ్యవస్థలో అనేక గొప్ప ఆవిష్కరణలు చూడనున్నాం. అయితే గ్రామీణ ప్రాంతాలలో ఇంకా చాలా మంది పిల్లలు స్కూల్‌ కు రావడం లేదు. పల్లెల్లో ప్రైవేటు స్కూళ్లకు ఆస్కారం లేదు. కాస్తో, కూస్తో పిల్లల చదువుల కోసం కొంత వెచ్చించుకోగలం అనుకునే వారు ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తున్నారు. అది కూడా ఆగిపోవాలి. ఎందుకంటే మన ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ప్రభుత్వ ఉపాధ్యాయుల ద్వారా విద్యా బోధన జరుగుతుంది. ప్రైవేటు స్కూళ్లలో పని చేసే ఉపాధ్యాయులకు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు చాలా తేడా వుంటుంది. అందుకే అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడమే ఉత్తమం. ఇక పల్లెల్లో ఇప్పటికీ తమ పిల్లలను స్కూల్‌ కు పంపకుండా వుండే వారు చాలా మంది వున్నారు. అలాంటి పిల్లలకు పౌష్టికాహారం కూడా అవసరం. ఆ పిల్లలకు ఉదయం ఉపాహారం అందించడం వలన మధ్యాహ్నం వరకు ఆకలి లేకుండా శ్రద్ధగా చదువుకునే అవకాశం వుంది. అది విద్యా పరంగా ఆరోగ్య పరంగా ఎంతో మంచిది. మధ్యాహ్నం మిడ్‌ డే మీల్‌ అందుతుంది. తెలంగాణ ఇరవై లక్షలకు పైగా విద్యార్థుల ఆరోగ్యాలు దృష్టిలో పెట్టుకొని అల్పాహారం అందించాలని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అన్ని విధాల సౌకర్యాల కల్పన చేసి, ప్రారంభించుకోవడం జరిగింది. దానిని ప్రతిపక్షాలు స్వాగతించాలి. అంతే కాని పిల్లల నోటికాడి ముద్ద లాగేసేలా వ్యవహరించొద్దు. స్కూల్‌ పిల్లలకు ఆహారం అందించడాన్ని కూడా రాజకీయం చేసే బిజేపి, కాంగ్రెస్‌ పార్టీలు తిరస్కరిస్తున్నాయి. 2020లో కేంద్ర ప్రభుత్వం ఓట్ల కోసం దేశం మొత్తం స్కూళ్లలో పిల్లలకు అల్పాహారం అందిస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకు దాని విధి విధానాలు కూడా ఖరారు చేయలేకపోయింది. దేశం మొత్తం మీద వున్న స్కూళ్లలో అల్పాహారం అందించడానికి మూడు వేల కోట్లు ఖర్చయ్యే అవకాశం వుంది. 48 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌ లో విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు మూడు వేల కోట్లు ఖర్చు చేయాలంటే వారికి చేతులు రావడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఆ పని చేస్తోంది. కనీసం అభినందించాలన్న సోయి కూడా బిజేపికి లేకుండా పోయింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్టానికి వచ్చి సభలు ఏర్పాటు చేసి నిజామాబాదు లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. మంచిదే…కానీ ఈ ఐదేళ్లు ఎందుకు చేయలేదు. తెలంగాణ లో పసుపు బోర్డు ఏర్పాటు కుదరని కూడా చెప్పిన సందర్భాలు కూడా వున్నాయి. ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి రావడం మొదలవడంతో అంతకు మించిమ స్పైసీ బోర్డు తెచ్చామని ప్రజల్ని నమ్మించారు. ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలోనే వరంగల్‌ లో వున్న స్పైసీ బోర్డు నుంచి ఒక వింగ్‌ నిజామాబాదు లో ఏర్పాటు చేసి మమ అనిపించారు. ప్రజలకు బిజేపి అసలు రంగు అర్థమైంది. దాంతో మళ్ళీ ప్రధాని మోడీ పసుపు బోర్డు ప్రస్తావించారు. ఇస్తామన్నారు. అంతే ఎప్పుడు ఇస్తామన్నది చెప్పలేదు. తర్వాత ఇస్తారా? లేదా అన్నది కూడా చెప్పలేం. బిజేపి అబద్దాల రాజకీయాలు అలా వుంటాయి. ఇక కాంగ్రెస్‌ ఇస్తున్న హామీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజస్థాన్‌ లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వుంది. కానీ ఐదేళ్లుగా రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ అందించడం లేదు. ఎన్నికల ముందు హడావుడిగా ప్రకటించింది. చత్తీస్‌గఢ్‌ లో కూడా కాంగ్రెస్‌ పార్టీ యే అధికారంలో వుంది. అక్కడ మాత్రం సిలిండర్‌ అందించే కార్యక్రమం లేదు. కర్నాటక లో ప్రకటించి ఆరు నెలలౌతున్నా ఇంత వరకు అమలు చేస్తున్నది లేదు. ఇలాంటి ప్రతిపక్షాలు తెలంగాణ లో రాజకీయాలు చేయడం మన దౌర్భాగ్యం. ఇలాంటి పార్టీలు తెలంగాణ లో అధికారం కోసం అర్రులు చాచడం తప్ప అభివృద్ధి చేయడానికి పనికి రావు. ప్రజలకు కూడా ఈ విషయం బాగా తెలుసు. ఈ ఎన్నికలలో కూడా లేనివి వున్నట్లు, వున్నవి లేనట్లు ప్రచారం చేసి ప్రజలను గందరగోళ పర్చాలని చూస్తున్నారు. ప్రజలు వాళ్ల మాటలు వినరని మరో సారి రుజువౌతుంది. బిఆర్‌ఎస్‌ కచ్చితంగా 90కి పైగా సీట్లు గెల్చుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!